రాజవొమ్మంగి: చిరుత పులి మళ్లీ రాజవొమ్మంగి మండలంలోకి ప్రవేశించింది. సోమవారం చికిలింత గ్రామంలో రైతు సోమరాజుకు చెందిన ఆవును హతమార్చింది. ఈ విషయం తెలుసుకున్న రాజవొమ్మంగి అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తమ సిబ్బందితో వెళ్లి పులి చికిలింత, వాతంగి, పెదగర్రంగి పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పుట్టిన రోజు వేడుకలకు వచ్చి
అనంత లోకాలకు..
రంపచోడవరం: స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రంపచోడవరం మండలం బోర్నగూడెం గ్రామం శివారున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన మేడిశెట్టి తరుణ్ కుమార్ (35) పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు ముసురుమిల్లి ప్రాజెక్టు వద్దకు స్నేహితులతో కలసి వచ్చాడు. రెండు బైక్‌లపై నలుగురు యువకులు వచ్చారు. ముసురుమిల్లి ప్రాజెక్టు సమీపంలో ఇద్దరు స్నేహితులు ఉండగా, తరుణ్‌కుమార్, ఈలి ప్రవీణ్‌లు కేక్, బిర్యానీ తేవడానికి మోటార్ సైకిల్‌పై రంపచోడవరం బయలు దేరారు. బోర్నగూడెం శివారున ఎదురుగా వేగంగా ఆటో వచ్చి మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొంది. తరుణ్ కుమార్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈలి ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ సన్యాసినాయుడు, ఎస్సై రాంబాబు పరిశీలించి కేసు నమోదు చేశారు.
అత్యాచారం కేసులో
20 ఏళ్ల జైలు
రంపచోడవరం: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం ప్రకారం.. 2024లో మారేడుమిల్లి సంత మార్కెట్‌కు చెందిన బాలిక (16)పై బలవంతంగా వై.రామవరం మండలం తూనికలపాడు గ్రామానికి చెందిన కంగల బుజ్జిబాబు దొర అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ కోర్ట్ ఫర్ పోక్సో న్యాయమూర్తి శ్రీదేవి తీర్పు చెప్పారు.
కడియం రైల్వే గేటు
మూసివేత
కడియం: సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కడియం ఫిష్‌ఫామ్ వద్దగల రైల్వే గేటును మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.


