బాధితులను నమ్మించి రూ.కోట్లలో మోసం రాష్ట్రవ్యాప్తంగా 96 కేసులు నమోదు ఆరు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న వైనం వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: చిట్‌ఫండ్స్ పేరుతో వందలాది మందిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. హన్మకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన అక్షర చిట్‌ఫండ్స్ ఎండీ పేరాల శ్రీనివాస్ తన సంస్థ ద్వారా అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మబలికి రాష్ట్రవ్యాప్తంగా చిట్ స్కీముల ద్వారా డిపాజిట్లు సేకరించాడని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడని తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్‌లో నిందితుడిపై 12 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. జిల్లాకు చెందిన బాధితులు రూ.99 లక్షలు చెల్లించారని, వీరికి వడ్డీతో కలిపి సుమారుగా రూ.1.11 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘరానా మోసగాడు ఆరు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా, సోమవారం ప్రత్యేకబృందం సాంకేతిక ఆధారాలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 5 మొబైల్ ఫోన్లు, ఒక ఐపాడ్, డొంగల్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ప్రజలు అధిక లాభాల ఆశతో ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేట్ చిట్‌ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. అనుమానాస్పద పథకాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కె. నాగరాజు, ఎస్సై అఖిల్, ఆర్‌ఎస్సై గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


