ట్రిపుల్‌ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన

Mar 18 2026 8:10 AM | Updated on Mar 18 2026 8:10 AM

భైంసా/బాసర: బాసర ఆర్జీయూకేటీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మెదక్‌ జిల్లా రా మచంద్రపురానికి చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని (17) సోమవారం మృతి చెందిన ఘటనతో క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగింది. తేజస్విని మార్చి 13న జ్వరం, నోటి పుండ్లతో క్యాంపస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆమెకు లుకేమియా (రక్త క్యాన్సర్‌)గా నిర్ధారించారు. చికిత్స పొందుతూ చివరికి ఆమె కన్నుమూశారు.

వీసీ కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు

తేజస్విని మృతి వార్తతో క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఏకమై వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలి.. మాకు న్యాయం చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రి వరకు ఈ నిరసన కొనసాగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రాణాల మీదకు తెస్తున్న సదుపాయాల లేమి!

క్యాంపస్‌లోని ఆరోగ్య కేంద్రం కేవలం నామమాత్రంగానే ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయంలో ఆధునిక డయాగ్నస్టిక్‌ సదుపాయాల కొరత ఉందన్నారు. నిపుణులైన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేరన్నారు. ప్రాథమిక దశలో వ్యాధులను గుర్తించడంలో వైఫల్యం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నా రు. చిన్న ఆరోగ్య సమస్యతో వెళ్తే మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారని, పరిస్థితి విషమించిన తరువాతే పెద్ద ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. డాక్టర్లు క్యాంపస్‌ ఆసుపత్రిలో రక్త సంబంధిత తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించేపరికరాల కొరత ఉందని చెప్పినట్లు సమాచారం.

నిర్లక్ష్యమే కారణమా?

క్యాంపస్‌ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని తేజస్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు పలు డిమాండ్లు ముందుకు తెచ్చారు మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, క్యాంపస్‌ ఆసుపత్రిని అత్యాధునిక పరికరాలతో వెంటనే అభివృద్ధి చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత కోసం సమగ్ర ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement