లెక్క చెప్పాల్సిందే..
కైలాస్‌నగర్: జిల్లాలో ఇటీవల మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చు వివరాలు విధిగా ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించారు. నిబంధనల మేరకు పోటీ చేసిన సమయం నుంచి 45రోజుల్లోగా ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు ఇవ్వాల్సి ఉండగా చాలామంది అభ్యర్థులు ఇంకా ఇవ్వలేదు.
సమీపిస్తున్న గడువు
జిల్లాలో 473 గ్రామపంచాయతీలకు సర్పంచులు గా 833 మంది, 3,870 వార్డులకు 6,258 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తొలివిడత ఎన్నికల్లో పో టీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు అందించే గడువు ఈనెల 24తో ముగియనుంది. రెండో విడత అభ్యర్థులు ఈనెల 27, మూడో విడత అభ్యర్థులు ఈనెల 30లోపు అందించాల్సి ఉంది. ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామపంచా యతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వా ర్డు అభ్యర్థులు రూ.30వేలు, ఐదువేల జనాభాకు మించి ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50వేల వరకు మాత్రమే ప్ర చార ఖర్చు చేయాల్సి ఉంది. నిర్ణీత గడువు సమీపిస్తున్నా జిల్లాలోని చాలామంది అభ్యర్థులు వివరా లు అందజేయలేదు. గడువులోపు ఇవ్వకుంటే పదవిలో ఉన్నవారు అనర్హతకు గురికానున్నారు. ఓట మి పాలైన అభ్యర్థులు భవిష్యత్‌లో మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశముండదు.
తప్పకుండా వివరాలివ్వాలి
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తన ప్రచార వ్యయ వివరాలు అందించాలి. గడువు సమీపిస్తున్నందున బ్యాంక్ ఖాతాల ఆధారంగా వివరాలు ఎంపీడీవోకు ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయే అవకాశముంది.
– జీ రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి


