రెండేళ్లు.. సమావేశం ఒక్కటీ లేదు
● ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల తీరు
● స్పందించని అధికారులు
రంపచోడవరం: సమస్యలపై ప్రస్తావించి.. పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమావేశాల మాటే మరిచారు.. ఎందుకో రెండేళ్లుగా కనీసం పట్టించుకోవడం లేదు.. పాలకవర్గాలు ఉన్నా వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిబంధనల ప్రకారం జరగడం లేదు. ఏడాదిలో కనీసం మూడు సార్లు సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా జరుపలేదు. పాలకవర్గ అనుమతితోనే అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాల్సి ఉండగా, ప్రస్తుతం రంపచోడవరం ఐటీడీఏ ద్వారా జరుగుతున్న పలు సంక్షేమ పనులకు పాలకవర్గం ఆమోదం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొసైటీ నిబంధనల ప్రకారం ఏడాదికి కనీసం మూడు పాలకవర్గ సమావేశాలు జరగాలి. రంపచోడవరం ఐటీడీఏ కూడా సొసైటీ చట్టంలోనే నమోదు కాబడి ఉంది. ఐటీడీఏకు జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా, జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్‌గా ఉంటారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు సభ్యులుగా సమావేశానికి హాజరు కావచ్చు. అలాగే జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలూ పాల్గొనవచ్చు. రెండేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగకపోవడంతో అధికారుల తీరుపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో తమ పదవీ కాలం ముగిసిపోనున్న తరుణంలో కనీసం ఒక్కసారైనా సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే మండల స్థాయిలో అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. అటవీ అభ్యంతరాలతో అనేక రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మారేడుమిల్లి సమీపంలోని కుట్రవాడ వద్ద నిర్మించిన సత్యసాయి వాటర్ స్కీమ్ ద్వారా ఒక్క మండలానికే నీటి సరఫరా జరుగుతుంది. ఇలాంటి అనేక సమస్యలపై చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని చూపాలని డిమాండ్ చేసే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఐటీడీఏకు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులు వంటి పద్దులకు పాలకవర్గం ఆమోదం తెలపాలి. అయితే పాలకవర్గ సమావేశాలు జరగకపోవడంతో అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని వారు విమర్శిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటుతోనైనా రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరుగుతుందేమోనని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


