గిరిజన సంప్రదాయాలు కాపాడుకుందాం
గంగవరం: గిరిజన సంప్రదాయాలను కాపాడుకుందామని ఏజెన్సీ గిరిజన సంఘ గౌరవ అధ్యక్షుడు ఇల్లా రామిరెడ్డి పిలుపునిచ్చారు. గంగవరం మండలం కొత్త కొండమొదలు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. విలువిద్య, రేల పాటలు, కబడ్డీ, వాలీబాల్, పరుగు, స్కిప్పింగ్, త్రోబాల్ తదితర క్రీడల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఐక్యంగా ఉండి గిరిజన సంస్కృతిని నేటితరానికి అందిద్దామని పిలుపునిచ్చారు. రేల పాటలు, డోలు కొయ్యల ఆటలు, భాషను మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి యువజన సంఘం (ఏఐవైఎస్‌ఓ) జాతీయ నాయకుడు పి.సురేష్ మాట్లాడుతూ యువత, ప్రజలను చైతన్యపర్చే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటలు అంటే బెట్టింగ్‌లు కాదని, వీటికి దూరంగా ఉండాలన్నారు. మద్యం, మత్తు పానీయాలు, జూదాలతో అనేక అనర్థాలు జరుగుతాయనేది యువత గ్రహించాలన్నారు. కొండమొదలు సర్పంచ్, ఏజెన్సీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షురాలు వేట్ల విజయ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి తాతి బుల్లబ్బాయి, నాయకులు వేట్ల సత్యనారాయణ, వంజం జోగారావు, పీసా కమిటీ కార్యదర్శి కోండ్ల రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మడి ముత్తమ్మ, నవయువ సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు కడబాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు,


