కోచ్‌లు లేని క్రీ‘డల్’!
ఆదిలాబాద్: క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు క్రీడా విధానాలను ప్రకటిస్తూనే క్షేత్రస్థాయిలో శీతకన్ను వేస్తున్నాయి. క్రీడాకారులకు ఆడాలనే ఆసక్తి ఉన్నా పలు ప్రాంతాల్లో మైదానాలు అందుబాటులో లేవు. మైదానాలు అందుబాటులో ఉన్న చోట శిక్షకులు లేరు. అరకొర నైపుణ్యాలతో క్రీడల్లో రాణించలేని దుస్థితిలో క్రీడాకారులున్నారు. దీంతో ఎంతోమంది ఎన్నో క్రీడాంశాల్లో తడబాటుకు గురై క్రీడలను అర్ధంతరంగా వదిలేస్తున్నా రు. క్రీడారంగాన్ని ఎంచుకుంటే భవిష్యత్ ఉంటుందో, లేదోనని తల్లిదండ్రులు కూడా చాలామందిని క్రీడల వైపు పంపించేందుకు సంశయిస్తున్నారు.
నామమాత్రంగా డీఎస్‌ఏ..
జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ)నామమాత్రంగా తయారైంది. క్రీడల అభివృద్ధికి నామమాత్రంగా నిధులు వస్తున్నాయని, కార్యాలయాల నిర్వహణకే ఉద్యోగులు పరిమితమవుతున్నారనే అభిప్రాయం క్రీడాకారుల్లో వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలో విశాలమైన ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉంది. ఈ క్రీడా మైదానానికి నిత్యం ఎంతోమంది క్రీడాకారులు వస్తుంటారు. అయితే వీరికి నేర్పించడానికి శిక్షకులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. తాము స్వయంగా ఎంత సాధన చేసినా ఫలితం ఉండడంలేదని వాపోతున్నారు. శిక్షకులుంటే నైపుణ్యాలు అలవర్చుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలని భావిస్తున్నారు. తాత్కాలిక శిక్షకులను ఏర్పాటు చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం కూడా భవిష్యత్ క్రీడాకారులకు శాపంగా మారుతోంది. క్రీడా పాఠశాలలో ఉన్న శిక్షకులు క్రీడా పాఠశాల విద్యార్థులకే శిక్షణ ఇస్తున్నారు. దీంతో క్రీడాభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ప్రైవేట్ సంస్థల వైపు చూపు
అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు తాము ఇష్టపడే క్రీడలో రాణించేందుకు ప్రైవేట్ శిక్షణ సంస్థల వైపు దృష్టిస్తారిస్తున్నారు. నిరుపేద క్రీడాకారులు మా త్రం స్టేడియంలోనే ఎవరికి వారే పట్టుదలతో సాధ న చేస్తున్నారు. ఎగువ మధ్యతరగతి, ధనిక కుటుంబాల నేపథ్యం నుంచి వస్తున్న కొంతమంది క్రీడాకా రులు డబ్బులు చెల్లిస్తూ ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో త ర్ఫీదు పొందుతున్నారు. పిల్లల ఆసక్తిని ప్రోత్సహించడానికి కొందరు నిరుపేద తల్లిదండ్రులూ అప్పు చేసి ప్రైవేట్ శిక్షణ కేంద్రాలకు పంపుతున్నారు.
ఆదాయ వనరులపైనే ఫోకస్
స్టేడియంలో శిక్షకుల నియామకంలో వెనుకడుగు వే స్తున్న డీఎస్‌ఏ ఆదాయం సమకూర్చుకోవడంలో మాత్రం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. స్వి మ్మింగ్ పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ చేతికిచ్చి ఆ దాయం పొందుతోంది. దుకాణాసముదాయం నుంచి వస్తున్న అద్దె, జిమ్, ఇండోర్ స్టేడియం నుంచి వస్తున్న ఫీజులతో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇక స్విమ్మింగ్, ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ సాధ న చేయాలనుకునే క్రీడాకారులు వాటికి దూరమవుతున్నారు. కనీసం తాత్కాలిక శిక్షకులను నియమించి తమను ప్రోత్సహించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.


