
ఖాళీ ప్లాట్లపై బల్దియా దృష్టి
కై లాస్‌నగర్: పిచ్చిమొక్కలు, మురుగునీటి నిల్వతో అపరిశుభ్రత నెలకొని సీజనల్ వ్యాధుల ప్రబలతకు కారణమవుతున్న పట్టణంలోని ఓపెన్‌ప్లాట్లపై బ ల్దియా దృష్టి సారించింది. ఆయా కాలనీల్లో గల ఖా ళీ ప్లాట్లను ఇప్పటికే గుర్తించిన అధికారులు వాటిలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. యజమానులు స్పందించకుంటే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఇదీ పరిస్థితి...
ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం 49 వార్డులున్నాయి. వీటి పరిధిలో వందలాది ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచడం, నిర్వహణ లేకపోవడంతో అందులో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. దీనికి తోడు చుట్టుపక్కల వారు చెత్తాచెదారం వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత నెలకొంటుంది. మరికొన్ని ప్లాట్లలో మురుగునీరు ప్రవహించే అవకాశం లేకపోగా అక్కడే నిల్వ ఉంటుంది. కొన్ని చోట్ల వర్షపునీరు బయటకు వెళ్ల లేక చిన్నపాటి కుంటలుగా మారుతున్నాయి. అందులో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధుల ప్రబలతకు కారణమవుతున్నాయి. వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ పరిస్థితిని అధిగమించేలా బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.
శుభ్రత పాటించని వారికి హెచ్చరిక
స్పందించకుంటే చర్యలకు సిద్ధం
ప్రతీ ప్లాట్‌లో హెచ్చరిక బోర్డు..
ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు పెరగకుండా, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్లాట్ల యజమానులదేనని స్పష్టం చేస్తూ బల్దియా అధికారులు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయించారు. శుభ్రత పాటించని పక్షంలో మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన ఖాళీ ప్లాట్లన్నింటిలో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. బల్దియా అధికారుల ఆలోచన స్వాగతించదగినదే అయినప్పటికీ ఎంత మంది స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.
మూడు రోజుల్లోగా స్పందించాలి
అపరిశుభ్రంగా ఉండే ఖాళీ ప్లాట్లతో చుట్టుపక్కల ఉండే వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవి కారణమవుతున్నాయి. ఖాళీ ప్లాటును శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత యజమానిదే. దాన్ని గుర్తు చేసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నాం. మూడు రోజుల్లోగా స్పందించాలి. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– బైరి శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఖాళీ ప్లాట్లపై బల్దియా దృష్టి