
అందరి కృషితోనే ‘ఆస్పిరేషనల్’ సక్సెస్
నార్నూర్: అందరి కృషితోనే నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఖైర్‌డట్వా గ్రామంలో మొహువా లడ్డూ తయారీ యూ నిట్‌ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యాబోధనపై ఆరా తీశారు. భీంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో డిజిటల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. రాజులగూడలోని సుమన్‌బాయి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. నీతి ఆయోగ్ ప్రోగ్రాంకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద ఖైర్‌డట్వా గ్రామంలో మొహువా లడ్డూ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ తయారయ్యే లడ్డూలను కేజీబీవీలతోపాటు ప్రభుత్వ వసతి గృహాలు, మార్కెట్లకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ కింద చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గాను జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రి య అని అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడు తూ, అర్హులందరికీ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలన్నారు. గాదిగూడలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్, జిల్లా రాయి సెంటర్ సార్‌మేడి మెస్రం దుర్గు, సీడీపీవో శారద, ఎంపీడీవో గంగాసింగ్, తహసీల్దార్ రాజలింగు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా