breaking news
Yogam Traders
-
యోగం ట్రేడర్స్ లెసైన్స్‌ల్లో గందరగోళం?
ఉయ్యూరు : పట్టణంలో యోగం ట్రేడర్స్ మాయాజాలం ఘటనతో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వామినాథన్ ట్రేడర్స్ ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అంతా మాయ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్, వాణిజ్య పన్నుల అధికారుల నుంచి తీసుకున్న లెసైన్సులపైనా విచారణ కొనసాగుతోంది. వ్యాపార లెసైన్సులపై ఆరా తీస్తే మరో కొత్త కోణం బయటపడింది. పట్టణంలో సగానికి పైగా దుకాణాలకు చట్టప్రకారం లెసైన్సులు లేనట్లు తెలిసింది. జనం డబ్బుతోనే ! తమిళనాడుకు చెందిన స్వామినాథన్ జనం డబ్బుతోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు. ముందుగా తన వ్యాపారానికి జిల్లాలో అనువైన ప్రాంతాలను ఎంచుకున్నాడు. హనుమాన్‌జంక్షన్, కంకిపాడు, ఉయ్యూరు ప్రాంతాలను ముందుగా ఎంచుకున్నాడు. ఎక్కడ వ్యాపారం ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుందో పరిశీలించాడు. ముందుగా ఉయ్యూరు పట్టణాన్ని ఎంచుకుని కాకాని గిరిజన కాలనీలో యోగం ట్రేడర్స్‌కు శ్రీకారం చుట్టాడు. ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించాలంటే ట్రేడ్ లెసైన్స్, వృత్తి లెసైన్సును వాణిజ్య పన్నుల శాఖ, వ్యాపారం నిర్వహించే చోట సంబంధిత గ్రామ అధికారి నుంచి తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం దుకాణం ఏర్పాటు చేసే భవనం యజమాని ఆమోదంతో లీజ్ అగ్రిమెంట్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ సమర్పించాలి. నిబంధనల ప్రకారం ఇవేమీ సమర్పించకుండానే యోగం ట్రేడర్స్ వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు తెలిసింది. మునిసిపల్ అధికారులకు స్వామినాథన్ వృత్తి పన్ను చలానా కట్టినట్లు సమాచారం. ఈ అంశంపై కమిషనర్ శ్రీనివాసరావును ‘సాక్షి’ వివరణ కోరగా, వ్యాపారానికి సంబంధించి స్వామినాథన్ అనే వ్యక్తి తమకు దరఖాస్తు చేసుకోలేదని, ఎలాంటి లెసైన్సు ఇవ్వలేదని చెప్పారు. వృత్తి పన్ను కోసం చలానా కట్టారని వివరణ ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి పొందిన లెసైన్సుపై పోలీసులకే స్పష్టత దొరకలేదు. చట్టంలో ఉన్న లొసుగులను, అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకునే యోగం ట్రేడర్స్ లాంటి మాయగాళ్లు అక్రమమార్గంలో వ్యాపార సంస్థలను స్థాపించి జనం నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ.. కాదు ఇక్కడంటూ.. యోగం ట్రేడర్స్ నిర్వాహకుడు పోలీసులనే ముప్పు తిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు స్వామినాథన్ నుంచి సొమ్ము రికవరీ చేసి వచ్చిన మొత్తాన్ని బాధితులందరికీ సర్దే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే రూ.4 లక్షలకుపైగా విలువ చేసే సరుకు ఉన్నట్లు నిర్ధారించారు. మరో రూ.7 లక్షలు ఎక్కడుందో తేలాల్సి ఉంది. ఈ సొమ్ము రాబట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు. ఒంగోలు, నెల్లూరు, తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చానని స్వామినాథన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారు ఆ ప్రాంతాలకు అతడిని తీసుకువెళితే అక్కడ చుక్కెదురైనట్లు సమాచారం. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అక్కడ కాదు ఇక్కడ అంటూ పోలీసులనే తికమకపెడుతున్నాడని తెలిసింది. కొందరు బాధితుల తీరు ఇలా.. బాధితుల్లో కొందరు టౌన్ స్టేషన్‌కు వెళ్లి స్వామినాథన్‌ను వదిలేయాలని పోలీసులతో వాదనకు దిగడం కొసమెరుపు. అతడిని వదిలేస్తే ఉన్న వస్తువులు తమకు ఇచ్చేస్తాడని వారు వాదిస్తున్నారు. ఈ పరిణామాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. స్వామినాథన్‌ను వదిలేస్తే బాధితులందరికీ న్యాయం జరగదనేది పోలీసుల వాదన. -
యోగం ట్రేడర్స్ మాయాజాలం..
ఉయ్యూరు : పట్టణంలోని యోగం ట్రేడర్స్ మాయాజాలంపై జనం తిరగబడ్డారు. సగం రేట్లకే గృహోపకరణాల వస్తువులు ఇస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు సొమ్ము వసూలు చేసి నిర్వాహకుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు తాము కట్టిన సొమ్ము చెల్లించాలంటూ మంగళవారం సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో టౌన్, రూరల్ ఎస్ఐలు జానకిరామయ్య, యువకుమార్లు సిబ్బందితో వచ్చి బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రూ.12 లక్షలకు టోకరా ! తమిళనాడు రాష్ట్రం వెంపంగుడి ప్రాంతానికి చెందిన స్వామినాధన్ ఉయ్యూరులోని కాకాని గిరిజన కాలనీలో రెండు వారాల క్రితం యోగం ట్రేడర్స్ ఏర్పాటు చేశారు. రూ.100 విలువైన వస్తువును రూ.55కే ఇస్తానని ప్రకటనలు గుప్పించాడు. 650 మంది వద్ద నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. స్కీమ్‌లో చేరిన వారిలో ఒక్కొక్కరూ వెయ్యి నుంచి రూ.30 వేల వరకు కట్టారు. తొలుత కొంతమందికి వస్తువులు అందజేసి ఖాతాదారుల నమ్మకం పొందాడు. సగం ధరకే వస్తువులు వస్తున్నాయన్న ప్రచారం ఆ నోట, ఈ నోట పట్టణమంతా పాకడంతో స్కీం కింద డబ్బులు కట్టి వస్తువులు పొందేందుకు జనం బారులు తీరారు. షాప్ పెట్టిన తొమ్మిది రోజులకే 650 మంది వద్ద రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడం.. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది యోగం ట్రేడర్స్‌పై నిఘా ఉంచారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం తో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులో స్వామినాధన్ ? స్వామినాధన్ గత ఐదు రోజుల నుంచి పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం గిరిజన కాలనీకి చెందిన యోగం ట్రేడర్స్ బాధితులు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై ఆయన పోలీసు అధికారులతో మాట్లాడి న్యా యం చేయాల్సిందిగా కోరారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టౌన్ పోలీసులు స్వామినాధన్‌తో విచారణ జరిపి, అతడి గుట్టును రట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. బాధితుల్లో ఇప్పటి వరకు 105 మందికి రూ.1.10 లక్షలు విలువ చేసే వస్తువులను అందజేసినట్లు స్వామినాధన్ పోలీసులకు చెబుతున్నాడు. మరో రూ.4 లక్షలు విలువ చేసే గృహోపకరణాలు దుకాణంలో ఉన్నాయి. రూ.7 లక్షల వరకు సొమ్ము ఏమైందో తేలాల్సి ఉంది. న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ యోగం ట్రేడర్స్ మాయాజాలంపై స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పందించారు. మంగళవారం సంస్థ కార్యాయలం వద్దకు వచ్చి, బాధితులతో మాట్లాడారు. కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించేలా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.