breaking news
Wrong Photo Tweet
-
కేరళ-కొరియా.. తేడా తెలీదా?
సాక్షి, తిరువనంతపురం : నిర్ధారణ చేసుకోకుండా మన నేతలు చేస్తున్న తప్పిదాల్లో ఇప్పుడు మరొకటి జత చేరింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి ఎంఎం మణి తన సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసిన ఫోటోతో విమర్శల పాలయ్యారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట పొరపాటున కొరియాకు చెందిన ఫోటోను గురువారం ఆయన షేర్ చేశారు. వాయానాద్లో ఉన్న బాణసుర సాగర్ ప్రాజెక్టులో కేరళ ప్రభుత్వం నీటిపై తేలే సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. ఇది పూర్తయితే దేశంలోనే ఇది పెద్దదిగా గుర్తింపు పొందుతుంది. నవంబర్ 1న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఇంతలో ప్రాజెక్టు పూర్తయ్యిందంటూ ఓ ఫోటోను తన అఫీషియల్ ఫేస్బుక్, ట్విట్టర్(బ్లూటిక్ మార్క్ లేదు) లోపోస్ట్ చేశాడు. అయితే గూగుల్ ఇమేజ్‌లో అది దక్షిణ కొరియాలోని ఓటె-జిప్యాంగ్ రిజర్వాయర్‌లో ఉన్న ప్రాజెక్టుదని తేలింది. ఫేక్ న్యూస్‌లను వెలుగులోకి తెచ్చే ఎస్ఎం హోక్స్ స్లెయర్ అనే వెబ్సైట్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో తన తప్పును గమనించి మంత్రి ఆ ట్వీట్, పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి వైరల్ అయిపోయాయి. మంత్రిని ఏకీపడేస్తూ పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తున్నారు. గొప్పలకు పోయి మంత్రి తొందరపడి చేసిన తప్పిందంతో ఆయనకు ఇలా తిప్పలు తెచ్చిపెట్టిందన్న మాట. -
పథకం ఇండియాది.. ఫోటో రష్యాది...
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగస్వామిగా మారిపోయింది. ఏ విషయాన్నైనా సరే క్షణాల్లో వ్యాపింపజేసేందుకు వేదికలుగా మారుతున్నాయి. ఇక ప్రజలతో నేరుగా కలిసే వీలులేని కొందరు నేతలు, తమ అభివృద్ధిని ప్రచారం చేసుకునేందుకు సంధానకర్తగా వీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో దొరితే తప్పులు వారి పరువును తీసిపడేస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పీయూష్ ఘోయల్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆయన్ని ట్రోల్ చేసి పడేస్తోంది. జాతీయ వీధి దీపాల మిషన్ కార్యక్రమంలో భాగంగా , కేంద్ర ప్రభుత్వం 50,000 కిలోమీటర్ల రహదారి గుండా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్లు పేర్కొంటూ ఆయన పోస్ట్ చేశారు. ఎక్కడో రష్యా దేశానికి చెందిన ఓ ఫోటోను మన దేశానికి చెందిందిగా పేర్కొంటూ ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. అంతే ముందు వెనకా చూడకుండా ఆయన్ని పలువురు ఏకీపడేశారు. వెంటనే తన తప్పును గమనించిన పీయూష్ తర్వాత ఆ ఫోటోను డిలీట్ చేసి మన వీధులకు చెందిన ఫోటోను తిరిగి ట్వీట్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియా వల్ల ఇలాంటి తప్పులు కూడా సవరించుకునే వీలు కలుగుతుందంటూ తన తప్పును సర్దిపుచ్చుకునే యత్నం చేశారు. గతంలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజ్ కోట్ లోని ఓ బస్‌స్టాప్ ఫోటోను అప్పుడే ఆవిష్కరించినట్లు తప్పుడు ట్వీట్ చేయగా, బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఓ ఫోటోను బెంగాల్ అల్లర్లకు చెందిందంటూ షేర్ చేసి విమర్శలపాలయ్యాడు.