Workers killed Tragedy
-
గ్యాంట్రీ క్రేన్లు ఢీకొని ఐదుగురు మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంకర్పల్లి: మూవబుల్ క్రేన్లు (గ్యాంట్రీ క్రేన్లు) ఢీకొన్న ఘటనలో ఐదుగురు కార్మీకులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారే. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన ముఖేష్ (20), నాగేందర్ మాథూర్ (38), అలీ హుస్సేన్ (37), సాజిద్(36), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనుచౌదరి (26) మరణించారు. సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అప్పటి వరకూ ఎండలో పనిచేసిన కార్మీకుల్లో సుమారు 18 మంది పక్కనే ఉన్న షెడ్డులోకి చేరుకున్నారు. దీనికి సమీపంలో నిలిపి ఉన్న రెండు మూవబుల్ క్రేన్లు, ఈదురు గాలులకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక క్రేన్‌కు మూవింగ్ లాక్ లేకపోవడం, మరో క్రేన్‌కు లాక్ వేయకపోవడంతో భారీ ఈదురు గాలులకు ఒక క్రేన్ మరో క్రేన్‌ను ఢీకొని రెండూ కార్మీకులు ఉన్న షెడ్డును ఢీకొని పడిపోయాయి. అందులోని కార్మీకులు క్రేన్లు, షెడ్డు శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. విషయం తెలిసిన వెంటనే చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతం, చేవెళ్ల ఏసీపీ కిషన్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. క్షతగాత్రులందరినీ పట్టణంలోని లలిత, గాయత్రి ఆస్పత్రులకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. కనీస ప్రమాణాలు పాటించలేదని... మహాలింగాపురంలోని ఎన్సీసీ కంపెనీలో ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలకు సంబంధించిన మెటీరియల్ (విడిభాగాలు) తయారు చేస్తారు. ఫ్లైఓవర్లు, వంతెనలకు సంబంధించిన దెబ్బతిన్న భాగాలను ఇక్కడికి తీసుకొచ్చి మరమ్మతులు కూడా చేస్తారు. ఫ్యాక్టరీలో నిత్యం వంద మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. వీరిలో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అధికం. యాజమాన్యం కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని అంటున్నారు. ఇంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యత ప్రదర్శించింది. కంపెనీ ప్రతినిధులపై డీసీపీ యోగేష్‌గౌతం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రేన్లకు ఉన్న లాకులు గాలి దుమారానికి ఎలా ఊడిపోతాయని మండిపడ్డారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కార్మీకులకు న్యాయం జరిగేలా చూస్తానని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా ఇచ్చారు. -
కూలిన కుటుంబాలు
కూలిపనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు దిమిలి గ్రామంలో విషాదం రాంబిల్లి: పొలం పనికి వెళుతున్నాం.. సాయంత్రానికి కూలి డబ్బులతో తిరిగొస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి ఆనందంగా బయలుదేరారు.. వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాద వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఇక తమ వారు తిరిగిరారని తెలిసి వారంతా కుప్పకూలిపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి బతుకుల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన నలుగురు కూలీలు ఆదివారం ఉదయమే కూలి పని కోసం ట్రాక్టర్‌పై బయలుదేరారు. వీరితో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇదే మండలం రాజుకోడూరులో వరి నూర్పిడి పనులకు వీరంతా వెళుతుండగా ఉదయం 6 గంటల ప్రాంతంలో పంచదార్ల సమీపంలో కోనేరు చెరువు దాటుతుండగా ప్రమాదకరమైన మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బండి రాము(50), శానాపతి సత్యనారాయణ(40) అనే కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సుందరపు వెంకటరమణారావు(45) అనే కూలి మార్గ మధ్యలో మృతి చెందాడు. మరో కూలి బండి అప్పారావుతో పాటు ట్రాక్టర్ డ్త్రెవర్ జి.నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వీరిద్దరినీ పోలీసులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు స్పందించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యలమంచిలి సీఐ వెంకటరావు, రాంబిల్లి ఎస్ఐ కె.కుమారస్వామి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించారు. డ్త్రెవర్ నాయుడు యలమంచిలికి చెందిన వ్యక్తి కాగా, మిగిలినవారంతా దిమిలి గ్రామానికి చెందిన వారని ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యలమంచిలి మార్చురీ వద్ద ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, దిమిలిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మృతదేహాలను సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. దిమిలిలో విషాదం.. రోజులాగే పనుల కోసం వెళ్లిన ముగ్గురు కూలీలు విగత జీవులుగా తిరిగి రావడంతో దిమిలి గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడు సత్యనారాయణ నిరుపేద. ఆయన మృతితో భార్య, ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. అలాగే మృతుడు సుందరపు వెంకటరమణరావు భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్ద కుమారుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా చిన్నవాడు చదువుకుంటున్నాడు. ఇదివరకే తల్లిని కోల్పోయిన వీరు ఇప్పుడు తండ్రిని కోల్పోవడం గ్రామస్తులను కలిచివేసింది. మరో మృతుడు బండి రాముకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశారు. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే.


