మరో 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లాలోని ఎన్‌సీసీ కంపెనీలో ఘోర ప్రమాదం
బాధితులంతా ఇతర రాష్ట్రాలవారే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంకర్‌పల్లి: మూవబుల్ క్రేన్లు (గ్యాంట్రీ క్రేన్లు) ఢీకొన్న ఘటనలో ఐదుగురు కార్మీకులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారే. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన ముఖేష్ (20), నాగేందర్ మాథూర్ (38), అలీ హుస్సేన్ (37), సాజిద్(36), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనుచౌదరి (26) మరణించారు. సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అప్పటి వరకూ ఎండలో పనిచేసిన కార్మీకుల్లో సుమారు 18 మంది పక్కనే ఉన్న షెడ్డులోకి చేరుకున్నారు. దీనికి సమీపంలో నిలిపి ఉన్న రెండు మూవబుల్ క్రేన్లు, ఈదురు గాలులకు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఒక క్రేన్‌కు మూవింగ్ లాక్ లేకపోవడం, మరో క్రేన్‌కు లాక్ వేయకపోవడంతో భారీ ఈదురు గాలులకు ఒక క్రేన్ మరో క్రేన్‌ను ఢీకొని రెండూ కార్మీకులు ఉన్న షెడ్డును ఢీకొని పడిపోయాయి. అందులోని కార్మీకులు క్రేన్లు, షెడ్డు శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. విషయం తెలిసిన వెంటనే చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతం, చేవెళ్ల ఏసీపీ కిషన్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. క్షతగాత్రులందరినీ పట్టణంలోని లలిత, గాయత్రి ఆస్పత్రులకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి.
కనీస ప్రమాణాలు పాటించలేదని...
మహాలింగాపురంలోని ఎన్‌సీసీ కంపెనీలో ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలకు సంబంధించిన మెటీరియల్ (విడిభాగాలు) తయారు చేస్తారు. ఫ్లైఓవర్లు, వంతెనలకు సంబంధించిన దెబ్బతిన్న భాగాలను ఇక్కడికి తీసుకొచ్చి మరమ్మతులు కూడా చేస్తారు. ఫ్యాక్టరీలో నిత్యం వంద మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. వీరిలో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అధికం. యాజమాన్యం కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని అంటున్నారు. ఇంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ విషయం బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యత ప్రదర్శించింది. కంపెనీ ప్రతినిధులపై డీసీపీ యోగేష్‌గౌతం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రేన్లకు ఉన్న లాకులు గాలి దుమారానికి ఎలా ఊడిపోతాయని మండిపడ్డారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కార్మీకులకు న్యాయం జరిగేలా చూస్తానని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా ఇచ్చారు.


