breaking news
Women court
-
అన్నా వర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన అన్నా వర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసులో(Anna University Sexual Assault Case) సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటించిన చెన్నై మహిళా కోర్టు.. సోమవారం జీవితఖైదును ఖరారు చేసింది. దోషి మీద న్యాయస్థానం ఎలాంటి కనికరం చూపించబోదని.. కనీసం 30 సంవత్సరాలైనా అతను జైలు శిక్ష అనుభవించాల్సిందే అని శిక్ష సందర్భంగా జడ్జి ఎం రాజలక్ష్మి వ్యాఖ్యానించారు.కిందటి వారమే 11 అభియోగాల మీద అతన్ని కోర్టు దోషిగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.90 వేల జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ క్రమంలో.. తనకు జబ్బుపడిన తల్లి, 8 ఏళ్ల కూతురు ఉన్నారని.. కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని జ్ఞానశేఖరన్ చేసిన అభ్యర్థనను చెన్నై మహిళా కోర్టు(Chennai Mahila Court) తిరస్కరించింది. తల్లి, బిడ్డ ఉన్నారని నేరం చేసే టైంలో గుర్తుకు రాలేదా? అని జ్ఞానశేఖరన్‌ను జడ్జి సూటిగా ప్రశ్నించారు. దీంతో కోర్టులో అతను మౌనంగా తలదించుకున్నాడు.👉కిందటి ఏడాది డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. అతనిపై దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనతో విద్యార్థులు భగ్గుమన్నారు. క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లి తీవ్ర నిరసనలు తెలిపారు. విద్యార్థుల ఆగ్రహం, రాజకీయ విమర్శల నేపథ్యంలో కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు(madras High Court on Anna University Incident) ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు..👉ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే స్థానికంగా బిర్యానీ అమ్ముకునే వ్యాపారి జ్ఞానశేఖరన్(Gnanasekaran)ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడికి గాయాలు కూడా అయ్యాయి. అయితే యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా.. వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడని విచారణలో తేలింది. విచారణలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు కూడా తేలింది. అతని నుంచి 100 సవర్ల బంగారం, ఓ లగ్జరీ ఎస్‌యూవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 👉ఇంకోవైపు.. ఈ ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. నిందితుడు అధికార డీఎంకే పార్టీ సభ్యుడని, ఇంకొంతమంది నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.👉అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం ఈ కేసులో ముందుకు కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఈలోపు.. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని తెలిపింది. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.👉మరోవైపు నిందితుడు అధికార పార్టీ సభ్యుడనే ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. నిందితుడు డీఎంకే మద్దతుదారుడే తప్ప.. పార్టీ సభ్యుడు కాదంటూ స్వయానా సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు. కేసు తీవ్రత దృష్ట్యా కేవలం ఐదు నెలల్లోనే విచారణ ముగిసింది. ఈ కేసులో పోలీసులు 100 పేజీల ఛార్జీషీట్‌ను దాఖలు చేశారు. మొత్తం 29 మంది సాక్షులను మహిళా కోర్టు విచారించి శిక్ష విధించింది. అయితే.. కోర్టు తీర్పుపై రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతిపక్ష నేత పళనిస్వామి.. ‘సర్’ అంటూ జ్ఞానశేఖరన్ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కేసు నుంచి ఇంకా ఎవరినో రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ పోలీసుపైనా ఆరోపణలకు దిగారాయన. ఈ కేసులో మరో వివాదం.. బాధితురాలి పేరు, వివరాలు బయటకు రావడం. ఏకంగా ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో అంతా కంగుతున్నారు. అయితే అది కేంద్రం పర్యవేక్షణలో ఉన్న వెబ్సైట్ ద్వారా బయటకువచ్చిందని తమిళనాడు పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు.ఇదీ చదవండి: బ్రిటన్ గాట్ టాలెంట్‌లో మన చిన్నారి ప్రతిభ -
లైంగిక దాడి కేసు.. యువకుడికి జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్ 19, 20వ తేదీల్లో 22 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి కేసులో దారా శ్రీకాంత్ (ఏ–1) అనే యువకుడికి జీవిత ఖైదు.. రూ.7 వేల జరిమానా, చెన్నా బాబూరావు (ఏ–2), జరాంగుల పవన్ కళ్యాణ్ (ఏ–3) అనే యువకులకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ ఐదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఐ.శైలజాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ‘దిశ’ చొరవ కారణంగా సరిగ్గా ఏడాదిలోనే దోషులకు శిక్ష పడటం గమనార్హం. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో నిందితులు శ్రీకాంత్, బాబురావులు ఆస్పత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు. మూడో నిందితుడు పవన్‌కల్యాణ్.. బాబురావుకు స్నేహితుడు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన బాధిత యువతిని శ్రీకాంత్ ప్రేమించానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి 19వ తేదీ రాత్రి శ్రీకాంత్ పని చేసే ఆస్పత్రికి వచ్చింది. ఆ రాత్రి ఆస్పత్రిలోని ఓ గదిలో ఆ యువతిపై శ్రీకాంత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 20వ తేదీ ఆ యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన బాబురావు, పవన్కల్యాన్లు యువతిపై అత్యాచారం చేశారు. అయితే 19వ తేదీ రాత్రి తన కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని ఓ గదిలో యువతి ఉందన్న విషయం తెలుసుకుని ఆమె తల్లి, బంధువులు 20వ తేదీ రాత్రి 8 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో గదిలో యువతితో పాటు పవన్‌కల్యాణ్ ఉన్నాడు. వీరిని చూసి అతను అక్కడ నుంచి పారిపోవడంతో యువతిని ఇంటికి తీసుకెళ్లారు. 22వ తేదీన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చకచకా.. మెరుగైన దర్యాప్తు కోసం కేసును నున్న పోలీస్ స్టేషన్ నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా బదిలీ చేశారు. ఏప్రిల్ 22వ తేదీనే కేసు నమోదు చేసి, అదే రోజు నిందితులను కోర్టులో హాజరు పర్చారు. సెప్టెంబర్‌లో కేసు ట్రయిల్ ప్రారంభమైంది. విచారణ అధికారి, దిశ ఏసీపీ వి.వి.నాయుడు, ఎస్ఐ రేవతి, కోర్టు మానిటరింగ్‌సెల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు సేకరించిన ఆధారాలు పక్కాగా ఉండటంతో త్వరగా ట్రయిల్ పూర్తయింది. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. ఈ కేసులో 25 మంది సాక్షులను కోర్టు విచారించింది. బాధితురాలి తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చద్రగిరి విష్ణువర్ధన్ కోర్టుకు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే కేసు త్వరగా ట్రయిల్ పూర్తి చేసుకుందని ఏపీపీ విష్ణువర్ధన్ తెలిపారు. దిశ పోలీసులు సమర్థవంతంగా తగిన సాక్ష్యాధారాలను సేకరించడంతో ఏడాదిలోనే తీర్పు వచ్చిందన్నారు. కాగా, అప్పట్లోనే బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షల చెక్కును అందజేయడంతో పాటు అన్ని విధాలా అండగా నిలిచింది. -
మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ: భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కృష్ణలంకలో 2019లో గర్భవతి అయిన భార్యపై పెట్రోల్ పోసి హతమార్చిన భర్త సుజిత్‌కు ఉరిశిక్ష విధించింది. 2019, జూన్ 15న ఫకీర్‌గూడెంలో జరిగిన ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కోర్టు.. భర్త బత్తుల సంబియార్ సుజిత్‌కు ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పు పట్ల బాధితురాలి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అమ్మా .. ఎందుకిలా చేశావ్.. మేయరమ్మా... ఇదేంటమ్మా! -
లైంగికదాడి కేసులో నిందితుడికి ఉరి
⇒ కోవై మహిళా కోర్టు తీర్పు చెన్నై: మహిళా ప్రొఫెసర్ పై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు మహేష్ (30)కి కోయంబత్తూరు మహిళా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు.. కోయంబత్తూరు జిల్లా కారమడై సమీపం ఆశిరియర్ కాలనీకి చెందిన రమ్య(24) కనుత్తుకడవులోని ప్రయివేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2014 నవంబరు 3న కళాశాలలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించాడు. అనంతరం ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి రమ్య, ఆమె తల్లి మాలతిలపై దుడ్డుకర్రతో దాడి చేయడంతో వారు స్పృహ తప్పి పడిపోయారు. ఇదే అదనుగా ఇంటిలోని బంగారు నగలను దోచుకున్నాడు. స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్న రమ్యపై లైంగికదాడికి పాల్పడడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ కేసులో తిరునెల్వేలీ జిల్లా తెన్కాశీకి చెందిన మహేష్‌ను గత ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అతడి నేరం రుజువు కావడంతో కోయంబత్తూరు మహిళా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. హత్య చేసినందుకు ఉరిశిక్ష, లైంగికదాడి జరిపినందుకు యావజ్జీవ శిక్ష, అనుమతి లేకుండా వారి ఇంటిలోకి ప్రవేశించినందుకు 8 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
కిరాతక భర్తకు పదేళ్ల జైలు
మహిళా కోర్టు తీర్పు విశాఖ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను కిరాతకంగా హింసించి ఆమె మృతికి కారణమైన భర్తకు నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక నాయమూర్తి ఎ. వరప్రసాదరావు పదేళ్ల కఠిన కారాగార శిక్ష,రూ. 1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అలాగే అదనపు కట్నం కోసం వేధించినందుకు సెక్షన్ 498ఎ కింద మూడేళ్ల జైలు, రూ. 500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజుల సాధారణ జైలు అనుభవించాలని తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్. రామ్మూర్తి నాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు నల్ల అప్పలరాజు గాజువాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని భానోజీతోట నివాసి. 2006లో జి.లావణ్య (20)తో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిన తర్వాత లావణ్యకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె 2011 ఏప్రిల్ 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మే 29న తుది శ్వాస విడిచింది. ఆమె తల్లి దేవి ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. గాజువాక 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జి.రామకృష్ణ లావణ్య మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు
సాక్షి, హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ నాంపల్లిలోని మహిళా కోర్టు న్యాయమూర్తి వై.సోమేశ్వరరావు సోమవారం తీర్పునిచ్చారు. తిరుమలగిరికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదివేది. 2012 ఏప్రిల్ 17న ఇంటి సమీపంలో ఉన్న దుకాణం వద్దకు వెళ్లగా అక్కడకు వచ్చిన విక్కీ మీ సమీప బంధువునే అంటూ బాలికతో మాటలు కలిపాడు. ఇంటికి తీసుకువెళతానంటూ మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుడిని అరెస్టు చేయడం తో పాటు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశా రు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన అదనపు పీపీ పద్మలతారెడ్డి వాదనలతో ఏకీభవిం చిన న్యాయస్థానం విక్కీకి జీవితఖైదుతో పాటు రూ.1500 జరిమానా విధించింది.