breaking news
Woman delivers
-
రైలు టాయిలెట్లో మహిళ ప్రసవం
భువనేశ్వర్: నాగర్‌కోయెల్–షాలిమార్ గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ రైలు 6వ నంబర్ బోగిలో ఒక ప్రయాణికురాలు టాయిలెట్లో ఆడబిడ్డను ప్రసవించింది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారుకుంది. స్థానిక ఖుర్ధా రోడ్ రైల్వే స్టేషన్లో ఆపరేషన్ మాతృ శక్తి కార్యక్రమం కింద తక్షణ చర్యలు చేపట్టడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఆపరేషన్ మాతృ శక్తి బృందం స్థానిక జట్నీ సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స తర్వాత, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆపరేషన్ మాతృ శక్తి కార్యక్రమం విజయవంతమైంది. మంగళవారం ఉదయం 5 గంటలకు భార్య ప్రసవ వేదన గమనించిన భర్త రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో రైల్వే యంత్రాంగం తక్షణమే స్పందించి ఉదయం 6 గంటల ప్రాంతంలో గురు దేవ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖుర్దారోడ్ స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరే సరికి అంబులెన్స్, వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచింది. మహిళా చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లిల్లీ బరువా, ఇతిశ్రీ మిశ్రా, రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుళ్లు ఎన్.స్వాతి, రీతా దాష్, బి.ఎల్. జెనా, ఒక వైద్య బృందం స్ట్రెచర్ సాయంతో టాయ్‌లెట్ నుంచి బాలింత, శిశువుని సురక్షితంగా కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బీహార్ ముంగేర్ జిల్లా గోబడా నివాసి చంపా దేవి (31) 12659 డౌన్ నాగర్కోఝెల్ – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాలిమార్‌కు ప్రయాణిస్తోంది. మా ర్గమధ్యంలో ఆమె భర్త జితేంద్ర కుమార్ దాష్ ప్రసవ వేదన గమనించి రైల్వే శాఖ ఉద్యోగుల మద్దతుతో తల్లీబిడ్డల్ని ఆదుకోగలిగారు. ఈ సందర్భంగా అతడు రైల్వే సిబ్బంది సేవా స్ఫూర్తిని అభినందించారు. ఆపరేషన్ మాతృ శక్తి బృందంలో ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి ప్రత్యే క అవార్డులతో అభినందించాలని తూర్పు కోస్తా రైల్వే శ్రామిక కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లకీ్ష్మధర మహంతి అధికార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. -
ఆస్పత్రి వద్దంది... అంబులెన్స్‌లో ప్రసవించింది
ముజఫర్ నగర్: పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యాలయం దారి తప్పిన ఉదంతమిది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి కొచ్చిన మహిళకు సేవలు అందించాల్సిందిపోయి.. కనీసం మానవత్వం కూడా లేకుండా లంచం ఇస్తేనే చేర్చుకుంటామని ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన నర్సులు చేసిన వాలకం వల్ల ఆమె అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అమీర్ అనే వ్యక్తి నిండు గర్భవతి అయిన తన భార్యకు ప్రసూతి నొప్పులు రావడంతో సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. అయితే, అందులోని ఆస్పత్రి సిబ్బంది లంచం ఇస్తేనే చేర్చుకుంటామని ఇబ్బందిపెడుతూ ఆలస్యం చేయడంతో అమీర్ భార్య అంబులెన్స్‌లో ప్రసవించింది. అనంతరం ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుల తరుపున బంధువులు, కుటుంబ సభ్యులు సదరు ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నాకు దిగడంతో ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.