witchcraft allegation
-
‘మంట’గలిసిన మానవత్వం
చైబాసా (జార్ఖండ్): ఆమె గుండెలకు హత్తుకున్నది తన ప్రాణాన్ని.. ఆ గుంపు నిప్పు పెట్టింది ఆ ప్రేమనే.. ముక్కుపచ్చలారని ఏడాది పసికందును, గుండెల్లో హత్తుకున్న తల్లిని.. మూఢత్వం రగిలించిన మంటలు బూడిద చేశాయి. చేతబడి అనే ఒక అబద్ధపు ముద్ర.. కన్నపేగును, అమ్మ ఒడిని నిలువునా దహించివేసిన వేళ, అక్కడ కాలిపోయింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. ఈ సమాజపు మానవత్వం.. నాగరిక సమాజం తలదించుకునేలా జార్ఖండ్‌లో మంత్రగత్తె నెపంతో ఒక మహిళను, ఆమె ఏడాది వయసున్న పసికందును సజీవ దహనం చేసిన ఘోరం వెలుగు చూసింది.మంత్రగత్తె నెపంతో..పశ్చిమ సింగ్భూమ్ జిల్లా కుమారదుంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనమిది. మృతురాలి బంధువు ఒకరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. అయితే, ఆ మహిళ చేసిన చేతబడి వల్లే అతను చనిపోయాడని స్థానికులు కొందరు నమ్మారు.ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 12 మంది వ్యక్తులు ఆమె ఇంటిపై దాడి చేశారు. భార్యాభర్తలిద్దరినీ బయటకు లాగి ఘర్షణకు దిగారు. గందరగోళం మధ్య, ఆమె చేతిలో ఏడాది బాబు ఉండగానే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లి, బిడ్డ అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ దాడిలో భర్త కూడా గాయపడగా, అతను ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని రాత్రంతా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.చదవండి: కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకుని..బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు జగన్నాథ్‌పూర్ ఎస్డీపీవో రాఫెల్ ముర్ము తెలిపారు. కేవలం మూఢనమ్మకాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడిలో పాల్గొన్న ఇతర మహిళలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం కుమారదుంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రెండేళ్ల బాలుడిని మాంత్రికుడంటూ..
ఇది హృదయవిదారక దృశ్యం. కఠినాత్ములకు కూడా కన్నీళ్లు తెప్పించే చిత్రం. అన్న పానీయాలు లేకుండా అలమటిస్తూ గత 8 నెలలుగా వీధుల్లో తిరుగుతున్న రెండేళ్ల బాలుడి దైన్యం. వీధికుక్కలా చెత్తకుప్పల్లో దొరికే ఎంగిలి మెతుకులు తింటూ బక్కచిక్కిన బాలుడికి ఓ సామాజిక కార్యకర్త నీళ్లు తాగిస్తున్న దృశ్యం. పిల్లాడిలో మాంత్రికుడి లక్షణాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఈ బాలుడిని రోడ్డున పడేశారు. స్థానికులు కూడా పట్టించుకోలేదు. వీధిలో దొరికే కుళ్లిన ఎంగిలి మెతుకులు తినడం వల్ల పిల్లాడి కడుపులో పురుగులు కూడా పుట్టుకొచ్చాయి. 'ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు, డానిష్ మహిళ అంజ రింగ్రెన్ లవెన్కు జనవరి 31వ తేదీన ఈ పిల్లాడు తారసపడ్డాడు. పిల్లాడి పరిస్థితిని గమనించిన ఆమె వెంటనే బాలుడికి నీళ్లు తాపించి, కొంత తాజా ఆహారం అందించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్చింది. ఆస్పత్రిలో పిల్లాడి కడుపు నుంచి పురుగులను తొలగించిన వైద్యులు ప్రతిరోజు పిల్లాడికి రక్తమార్పిడి చేస్తున్నారు. ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందేవరకు ఇలా చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చులు భారీగా ఉంటుండంతో డానిష్ మహిళ లవెన్ విరాళాల కోసం సోషల్ వెబ్సైట్ 'ఫేస్బుక్'ను ఆశ్రయించారు. పిల్లాడి పరిస్థితిని వివరించేందుకు వరుస ఫొటోలను పోస్ట్ చేశారు. ఆదివారం నాటికి ఆమెకు ఆరున్నర కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. వాటిని పిల్లాడి వైద్యం కోసం ఖర్చు చేస్తానని, మిగిలిన డబ్బులను పిల్లల వైద్యశాలను నిర్మించడం కోసం వెచ్చిస్తానని లవెన్ వివరించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నారని, ముఖాన నవ్వు కూడా విరిసిందని, తన కుమారుడితో ఆడుకుంటున్నాడని అమె తెలిపారు. నైజీరియాలో వేలాదిమంది పిల్లలను క్షుద్రపూజలు చేసే మాంత్రికులుగా భావించి హింసిస్తారని, వీధిల్లో వదిలేస్తారని ఆమె చెప్పారు. అలాంటి అనాథ పిల్లలను ఆదుకొని, వారికి విద్యాబుద్ధులు చెప్పించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఆమె భర్త డేవిడ్ ఇమాన్యుయేల్ కూడా ఫౌండేషన్ పనులను చూసుకోవడంలో ఆమెకు సహకరిస్తున్నారు.


