breaking news
White topping
-
రోడ్లకు ప్రపంచస్థాయి మెరుగులు
రాష్ట్రమంతటా బీటీ, సీసీ రోడ్లకూ వైట్ టాపింగ్ సిమెంటు కంపెనీలతో మంత్రుల చర్చలు సాక్షి, హైదరాబాద్: మన రోడ్లకు మంచిరోజులు. త్వరలో రాష్ట్రంలోని బీటీ, సీసీ రోడ్లన్నింటినీ వైట్ టాపింగ్ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం రాజధాని నగరం హైదరాబాద్‌లోనే రెండు నెలల వ్యవధిలో 400 నుంచి 500 కి.మీ. మేర అంతర్గత రహదారులను వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేయనుంది. నూతన టెక్నాలజీని వినియోగించేందుకు పెద్దఎత్తున సిమెంటు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. నాణ్యత, మన్నికతో పాటు తక్కువ వ్యయం, తక్కువ వ్యవధిలో రోడ్లు వేసే అవకాశం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుందన్నారు. గతం లో సిమెంటు కొరత, సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఈ టెక్నాలజీ వాడలేకపోయామని తెలిపారు. ప్రస్తుత రోడ్లపైనే కాంక్రీట్, ఫైబర్‌ను కలగలిపి కొత్త విధానంలో రోడ్లు వేస్తామన్నారు. త్వరలో నూతన విధానాన్ని జిల్లాలు, గ్రామాలకూ తీసుకెళ్లి బీటీ, సీసీ రోడ్లన్నింటినీ వైట్ టాపింగ్ రోడ్లుగా మార్చుతామని చెప్పారు. 1,060 కి.మీ. మేర నిర్మించిన యమునా ఎక్స్‌ప్రెస్ వే, ముంబై మెరైన్ డ్రైవ్ తదితరాలను వైట్ టాపింగ్ పద్ధతిలో నిర్మించిన విషయాన్ని ఉదహరించారు. వైట్ టాపింగ్ రోడ్లు కనీసం 25-30 ఏళ్ల పాటు మన్నే అవకాశం ఉన్నందున మరమ్మతుల వ్యయం కూడా పెద్దగా ఉండదన్నారు. రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా సిమెంటు అవసరమని చెప్పగా, ఒక్కో బస్తాను రూ.250 చొప్పున ఇచ్చేందుకు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ధరలపై పునరాలోచించాలని మంత్రులు సూచించగా, మరోమారు కొత్త ప్రతిపాదనతో వస్తామని ప్రతినిధులు చెప్పారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ జర్నీ
ప్రధాన మార్గాల్లో ‘వైట్ టాపింగ్’ 1000 కి.మీ.ల నిర్మాణం టాప్-20లో చోటుకు యత్నాలు సిటీబ్యూరో: ‘స్మార్ట్’ సిటీల జాబితాలో చోటు కోసం జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు వేస్తోంది. అందులోనూ టాప్-20లో ఉండాలని పోటీ పడుతోంది. ‘వైట్‌టాపింగ్’ రోడ్ల మీదుగా గమ్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో ఇటీవల నిర్మించిన వైట్‌టాపింగ్‌తో మంచి ఫలితం కనిపించడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. గ్రేటర్‌లోని మొత్తం రహదారులు 8803 కి.మీ. కాగా... వీటిలో 4052 కి.మీ. బీటీ రోడ్లు. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ.250 కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా అవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. దీంతో ప్రధాన మార్గాల్లోని దాదాపు 1000 కి.మీ. మేర దశల వారీగా వైట్‌టాపింగ్ నిర్మించాలని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీపైఅధిక భారం పడకుండా కాంట్రాక్టర్లకు దశల వారీగా బిల్లులు చెల్లించాలని అనుకుంటున్నారు. ఉదాహరణకు రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తే తొలుత రూ.200 కోట్లు చెల్లిస్తారు. ఏటా రూ.200 కోట్ల వంతున మరో నాలుగేళ్లు చెల్లిస్తారు. మొత్తం ఐదేళ్ల పాటు ఇలా చెల్లిస్తారు. వైట్‌టాపింగ్ రోడ్లు 20 ఏళ్లకు తగ్గకుండా... 30 ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయి కాబట్టి... ఈ విధానం అనువైనదని భావిస్తున్నారు. ఎక్కడైనా నిర్మాణ లోపాలుంటే.. సరిచేశాకే బిల్లులు చెల్లిస్తారు. ఏటా 100 నుంచి 200 కి.మీ.ల మేర పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. తొలిదశలో ఎంపికయ్యే స్మార్ట్‌సిటీల జాబితాలో గ్రేటర్‌కు స్థానం కోసం దీని ద్వారా కొంత స్కోర్ లభించే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం. ఎంపిక చేసిన మార్గాల్లో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఈ పనులు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్మార్ట్‌సిటీలపై హెచ్ఐసీసీలో జరిగిన రీజినల్ వర్క్‌షాప్‌లో విలేకరులకు ఈ విషయం చెప్పారు. అందరిదీ అదే టార్గెట్ మొదటి దశలో ఎంపిక చేయనున్న 20 నగరాల్లో చోటు కోసం వివిధ రాష్ట్రాల వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వర్క్‌షాపునకు హాజరైన వారు తమ వంతుగా పోటీ పడుతున్నట్టు కనిపించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ, చండీగఢ్, అహ్మదాబాద్, గ్రేటర్ ముంబై, అమృత్సర్, చెన్నై, కోయంబత్తూరు, వారణాసి తదితర నగరాలు మొదటి దశ కోసం పోటీలో ఉన్నాయి. స్మార్ట్‌సిటీ లుగా ఎంపికైన వంద నగరాలకు డీపీఆర్‌ల కోసం రూ.2 కోట్ల వంతున కేంద్రం కే టాయించడంతో ఆ దిశగా వారు పనులు ప్రారంభించారు. పరుగులో హైదరాబాద్.. టాప్-20లో చోటు కోసం జీహెచ్ఎంసీ కూడా యత్నిస్తోంది. డీపీఆర్‌ల త యారీ కోసం కన్సల్టెంట్ల ఎంపికకు టెండర్లు పిలిచింది. ఇప్పటికే ప్రారంభించిన ఈ-ఆఫీస్, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక యాప్, 24 గంటల కాల్‌సెంటర్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఈ లైబ్రరీలు, రెండు చెత్త డబ్బాల విధానం, డెబ్రిస్ రీసైక్లింగ్ , మెట్రో రైలు వంటివి స్మార్ట్‌సిటీగా ఎంపికకు కొంతవరకు ఉపకరిస్తాయి. ఇతర అంశాలపైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. డీపీఆర్ రూపకల్పనతోనే తొలిదశలో ఎంపికయ్యేందుకు వీలుండటంతో ఆ వివరాలు వెల్లడించడం లేదు. విద్యుత్, నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీరు, మల్టీమోడల్ రవాణా, సైబర్ కనెక్షన్, రహదారులు, ఎయిర్పోర్ట్, రైల్వేల కనెక్టివిటీ, హౌసింగ్, డిజాస్టర్, హెల్త్‌కేర్, వేగంగా సేవలు, నిఘా, భద్రత, పన్నులు, పారదర్శకత, జవాబుదారీతనం, స్కిల్ డెవలప్మెంట్, పౌర సలహా కమిటీలు వంటి వాటిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా... జీహెచ్ఎంసీ ఏటా దాదాపు రూ.5 వేల కోట్ల బడ్జెట్‌ను ఆమోదిస్తున్నప్పటికీ అధ్వానపు రహదారులు.. వర్షం కురిస్తే రోడ్లపై వెలిసే చెరువులు.. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని సమస్యలు...అలాగే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదికి రూ. 100 కోట్లు కేటాయిస్తే నగరాలు స్మార్ట్‌గా మారతాయా? అంటే మారవనే అభిప్రాయపడుతున్నారు నిపుణులు. రాత్రికి రాత్రే నగర ముఖచిత్రం మారకపోయినా.. ఈ నిధులతో నిర్ణీత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే... మరి కొంతమంది నుంచి తమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. దశల వారీగా నగరం మొత్తం అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏటా రూ.వంద కోట్ల వంతున ఐదేళ్లకుకేంద్రం రూ. 500 కోట్లు ఇస్తుంది. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను కేటాయిస్తే రాబోయే రోజుల్లో స్మార్ట్‌గా మారేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 కి.మీ.ల పరిధి లేదా ఒక సర్కిల్ లేదా రెండు, మూడు డివిజన్లు.. ఒక నియోజకవర్గం ఇలా కొంత ప్రాంతాన్ని ‘స్మార్ట్’గా తీర్చిదిద్దితే క్రమంగా మిగతా ప్రాంతాలూ ఈ బాటలో నడిచే అవకాశం ఉందని అధికారుల యోచన. -
ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!