breaking news
west delta project
-
యువర్ అటెన్షన్ ప్లీజ్!
నరసాపురం: పశ్చిమ డెల్టాపై రైల్వేశాఖ కినుక వహించింది. ప్రయాణికులను ఇబ్బందులు పాలుచేసే నిర్ణయాలతో టెన్షన్ పెడుతోంది. డెల్టా నుంచి రైల్వేశాఖకు వచ్చే ఆదాయం తక్కువేమీ కాదు. ఆక్వా ఉత్పత్తులు, కొబ్బరి, లేసు వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగడంతో రైలు ప్రయాణాలపై ఇక్కడి ప్రజలు ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో నరసాపురం, భీమవరం ప్రాంతాల నుంచి పలు కొత్తరైళ్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే వీటిగురించి పట్టించుకోని రైల్వేశాఖ ఉన్న రైళ్లకే ఎసరుపెట్టింది. దీంతో ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. మన జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నా.. వారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సింహాద్రి లింక్ రద్దు నరసాపురం –విశాఖపట్నం మధ్య 30 ఏళ్లుగా సింహాద్రి లింక్ ఎక్స్ప్రెస్ నడిచేది. ఉదయం 9.45 గంటలకు నరసాపురం నుంచి ఆరు బోగీలతో ఈ రైలు బయలుదేరి ఉదయం 11 గంటలకు నిడదవోలుకు వెళ్లేది. నిడదవోలులో గుంటూరు నుంచి విశాఖపట్టణం వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్కు ఈ ఆరుబోగీలను లింక్ చేసేవారు. అయితే మంగళవారం నుంచి లింక్ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. దీనిస్థానంలో నిడదవోలుకు డెమో రైలు ప్రవేశపెట్టారు. ఇకపై విశాఖపట్నం వెళ్లాలంటే ఈ డెమోరైలులో నిడదవోలు వెళ్లి అక్కడ దిగి గుంటూరు నుంచి వచ్చే సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. తిరిగి వచ్చేటప్పుడు కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్ నుంచి నిడదవోలులో దిగి, నరసాపురం డెమో రైలు ఎక్కాలి. దీనివల్ల ప్రయాణికులు ఆదుర్దా పడి అవస్థలు పాలయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే ఆస్కారమూ ఉంది. అయినా రైల్వేశాఖ ప్రయాణికుల సౌలభ్యాన్ని పట్టించుకోలేదు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, అత్తిలి ప్రాంతాల వారు ఈరైలులో నిత్యం విశాఖపట్నం వెళుతుంటారు. ముఖ్యంగా అన్నవరం పుణ్యక్షేత్రానికి, శ్రీకాకుళానికి తక్కువ చార్జీతో పగటిపూట నడిచే ప్రధాన రైలు ఇదే. అంతేకాకుండా నరసాపురం ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల వారూ ఈ రైలులోనే ప్రయాణం చేస్తారు. అయితే రైల్వే శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. లింక్ ఎక్స్ప్రెస్ను నడపడం కష్టంగా ఉందని వారు చెబుతున్నారు. తిరుపతి ప్రయాణికులకూ షాక్ మరోవైపు తిరుపతి ప్రయాణికులకూ రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రోజూ సాయంత్రం 5.20 గంటలకు నరసాపురం–తిరుపతి మధ్య నడిచే తిరుపతి ఎక్స్ప్రెస్ను ఈనెల 13 నుంచి ధర్మవరం వరకూ పొడిగించింది. ఇది ఉపయోగమే అయినా.. తిరుపతి రిజర్వేషన్ కోటాలో 60 సీట్లకు కోత పెట్టింది. ప్రస్తుతం ఈరైలులో నాలుగు స్లీపర్, రెండు ఏసీ, రెండు జనరల్ బోగీలు ఉన్నాయి. 30శాతం తత్కాల్ కోటా ఉండటంతో ఇప్పుడు ఈ రైలులో రిజర్వేషన్ దొరకాలంటే గగనం. ధర్మవరం వరకూ పొడిగించడంతో 60 బెర్తులను ధర్మవరం వరకూ కోటాగా నిర్ణయించారు. తిరుపతి వెళ్లేవారు రిజర్వేషన్ దొరక్కపోతే, ధర్మవరం వరకూ లేదా పాకాల వరకూ రిజర్వేషన్ చేయించుకోవాలి. తిరుగుప్రయాణంలోనూ అలాగే రిజర్వేషన్ చేయించుకోవాలి. దీనివల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుంది. దీనిపై ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైల్వే సమస్యలను మన జిల్లా ఎంపీలు పట్టించుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. లింక్ ఎక్స్ప్రెస్ రద్దు దారుణం సింహాద్రి లింక్ ఎక్స్ప్రెస్ను రద్దు చేయడం దారుణం. నిడదవోలులో దిగి మళ్లీ వేరే రైలు ఎక్కాలంటే కష్టం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ఉండేవారికి మరీ ఇబ్బంది. –తోట శ్రీధర్, నరసాపురం -
నీటి కష్టాలపై కస్సుబస్సులు
అడ్డుకట్టలు వేయాలనే ప్రతిపాదనలపై వాదోపవాదాలు వాడీవేడిగా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ సమావేశం తణుకు టౌన్ : సాగునీటి సరఫరాలో వంతులవారీ విధానం వల్ల ఏర్పడుతున్న సమస్యలు.. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తణుకు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. కాలువలకు, డ్రెయిన్లకు అవసరమైన చోట్ల అడ్డుకట్టలు నిర్మించాలనే ప్రతిపాదనలపై డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల నుంచి విభిన్న వాదనలు వినిపించాయి. వాదోపవాదాల నడుమ సమావేశం వేడెక్కింది. కాలువలపై అడ్డుకట్టలు నిర్మించాలని కొందరు.. అడ్డుకట్టలు వేస్తే తమ ప్రాంత రైతులు నష్టపోతారని మరికొందరు వాదులాడుకున్నారు. అత్తిలి, భీమవరం ప్రాంతాల్లో నీటి ఎద్దడి పొంచివుందని, అత్తిలి కాలువలో నీటిమట్టాలను పెంచాలంటే.. ఏలూరు కాలువకు నందమూరు అక్విడెక్ట్ వద్ద అడ్డుకట్ట నిర్మించాలని అత్తిలి, భీమవరం నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు కోరారు. అక్కడ అడ్డుకట్ట నిర్మించేందుకు ఎక్కువ కాలం పడుతుందని, దానివల్ల ప్రయోజనం ఏముంటుందని తాడేపపల్లిఽగూడెం, గుండుగొలను నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు ప్రశ్నించారు. దీంతో దిగువ డెల్టా, ఎగువ డెల్టా ప్రాంతాలకు చెందిన అధ్యక్షుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీనిపై పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పొత్తూరి రామాంజనేయరాజు మాట్లాడుతూ నందమూరు వద్ద ఏలూరు కాలువ వెడల్పు 36 మీటర్లు ఉందని, ఇందులో 14 మీటర్ల మేర మాత్రమే రింగ్ బండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ఏడాది తలెత్తిన నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత సీజన్లో ఆ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించేందుకు అడ్డుకట్టలు నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు తాడేపల్లిగూడెం, గుండుగొలను నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులు చైర్మన్లు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. ఇది సాంకేతిక అంశం కాబట్టి అధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ప్రకటించారు. గుండుగొలను నీటి పంపిణీ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ అడ్డుకట్ట వేసినా.. వేయకపోయినా గుండుగొలను వద్ద కాలువ నీటిమట్టం 5 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువలకు సీలేరు జలాలతో పాటు కర్ర నాచు కూడా చేరిందని, ఈ కారణంగా ప్రవాహం సాఫీగా సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలువలలో పడవల ప్రయాణం జరిగితే కర్ర నాచు దానంతట అదే తొలగిపోతుందని, సాగునీటి కాలువలల్లో పడవలు తిరిగేలా చూడాలని కోరారు. పశ్చిమ డెల్టాకు అదనంగా మరో 3 వేల క్యూసెక్కుల నీటిని అందించాలని కోరుతూ తీర్మానం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావు, ఇరిగేషన్ ఎస్ఈ కె.శ్రీనివాస్, నిడదవోలు ఈఈ జి.శ్రీనివాస్, డీఈఈ కె.శివప్రసాద్ పాల్గొన్నారు. అడ్డుకట్టల వల్ల నష్టపోతాం అత్తిలి, ఏలూరు కాలువ మధ్యలో అడ్డుకట్ట వేస్తే ఏలూరు కాలువకు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. దాళ్వా పంటకు పూర్తి స్థాయిలో సాగునీరందిస్తామని, వంతుల వారీ విధానం, అడ్డుకట్టలు ఉండవని కలెక్టర్ మొదట్లో చెప్పారు. ఏలూరు కాలువ నందమూరు వద్ద వెడల్పు 36 మీటర్లు ఉన్నప్పటికీ.. కిలోమీటరు దిగువన 14 మీటర్లుకు తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఇక్కడ అడ్డుకట్ట వేస్తే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. అడ్డు కట్ట వేస్తే ఏలూరు కాలువపై ఆధారపడిన సాగు భూములకు సాగు నీటికి ఇబ్బందులు తప్పవు. కేపీఎస్వీ ప్రసాదరావు, తాడేపల్లిగూడెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ 4,500 క్యూసెక్కుల నీరు పెంచాలి దాళ్వాకు 4,500 క్యూసెక్కులకు నీటి ప్రవాహాన్ని పెంచాలి. ఇప్పటివరకూ ఇస్తామన్న నీటిని అధికారులు చెప్పిన ప్రకారం విడుదల చేయలేదు. గుండుగొలను వద్ద ఏలూరు కాలువలో నీటిమట్టం 5 అడుగులు ఉండేలా చూస్తే ఈ ప్రాంత రైతులకు ఇబ్బందులు తీరతాయి. గంధం లక్ష్మణరావు, గుండుగొలను డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అడ్డుకట్ట నిర్మించాల్సిందే ఏలూరు కాలువకు అడ్డుకట్ట వేస్తేనే అత్తిలి కాలువ శివారున ఉన్న ఈడూరు, కంచుమర్రు, కొండేపాడు, కొమ్మర గ్రామాల్లోని పొలాలకు సాగునీరందుతుంది. ఏలూరు కాలువపై నందమూరు వద్ద రింగ్ బండ్ నిర్మించాలి. దీనిని ఏర్పాటు చేస్తేనే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందుతుంది. నల్లూరు చిన్ని, అత్తిలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కర్రనాచు తొలగించాలి కాలువల్లో పేరుకుపోయిన కర్ర నాచు కారణంగా నీటి ప్రవాహం తగ్గిపోతోంది. సీలేరు జలాల కారణంగా డెల్టా కాలువల్లో కర్ర నాచు పెరిగిపోయింది. దీనిని తొలగించేందుకు ఉపాధి హామీ పథకం నిబంధనలు సడలిస్తే నీటి సంఘాలకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. జంక్షన్ కెనాల్లో కర్రనాచు కారణంగా దిగువన 7 వేల ఎకరాలు, మధ్యలో 14 వేల ఎకరాలకు సాగు నీరు అందడం కష్టంగా ఉంది. బూరుగుపల్లి వెంకట త్రినాథరావు, పెంటపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్