breaking news
Water testing kits
-
గ్రామ స్థాయిలోనే తాగునీటి నాణ్యత పరీక్షలు
సాక్షి, అమరావతి: తాగునీటి వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు గ్రామాల్లో ప్రబలకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రతి గ్రామంలో తాగునీటి పరీక్షలు నిర్వహించనుంది. ప్రమాదకర సూక్ష్మక్రిములు ఆ నీటిలో ఉన్నాయో, లేదో ఎవరైనా తమ సొంత ఊరిలోనే పరీక్షలు చేసి తెలుసుకోవచ్చు. ఈ మేరకు అన్ని గ్రామాలకు నీటి పరీక్షల కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పరీక్షలు చేయడంపై ప్రతి ఊరిలో ఐదుగురి చొప్పున శిక్షణ కూడా ఇవ్వనుంది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో తాగునీటి నాణ్యతను నిర్ధారించేందుకు అన్ని గ్రామాలకు 5 లక్షల హెచ్2ఎస్ వైల్స్ పరీక్ష కిట్లు.. 13,300 ఫీల్డ్ టెస్ట్ కిట్లను సరఫరా చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఫీల్డ్ టెస్ట్ కిట్ ద్వారా ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్, న్రైటేట్, కాల్షియం వంటివి మనం తాగే నీటిలో కలుషితమై ఉన్నాయో, లేదో గుర్తించవచ్చు. ఒక్కొక్క కిట్‌తో వంద దాకా పరీక్షలు నిర్వహించవచ్చు. గ్రామానికి ఒకటి చొప్పున ఈ కిట్‌ను అన్ని గ్రామాలకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. హెచ్2ఎస్ వైల్స్ పరీక్ష కిట్ల ద్వారా మనం తాగే నీటిలో సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) వంటివి ఏమైనా ఉన్నాయో, లేదో తెలుసుకోవచ్చు. ఒక్కో కిట్ ద్వారా ఒక విడత మాత్రమే పరీక్ష నిర్వహించే వీలుంటుంది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ తాగునీటి వనరుల్లో ఒక్కో దానికి రెండేసి హెచ్2ఎస్ వైల్స్ కిట్లను ప్రభుత్వం సరఫరా చేయనుంది. గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో తాగునీటి కోసం ఉపయోగించే మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలన్నీ కలిపి మొత్తం 2,50,000 దాకా ఉన్నాయి. వీటన్నింటికీ రెండేసి కిట్ల చొప్పన రాష్ట్రమంతటా ఐదు లక్షల కిట్లను సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఈ కిట్ల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. ఈ కిట్ల ద్వారా గ్రామ స్థాయిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించాక నీరు కలుషితమైనట్టు గుర్తిస్తే పూర్తి స్థాయి పరీక్షల కోసం సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో ఉండే ల్యాబ్‌కు నీటి నమూనాలను పంపుతారు. ప్రతి గ్రామంలో ఐదుగురికి శిక్షణ గ్రామ స్థాయిలోనే సులువుగా తాగునీటి నాణ్యత పరీక్షలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఐదుగురికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ⇔ ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, గ్రామ సర్పంచ్ లేదా కార్యదర్శి, స్కూల్ టీచర్, ఒక ఎన్జీవో ప్రతినిధికి శిక్షణ ఇస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 66,500 మందికి శిక్షణ అందిస్తారు. ⇔ ఈ నెల 9 నుంచి మండల స్థాయిలో శిక్షణ నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ⇔ తాగునీరు ఎలా కలుషితమయ్యే అవకాశం ఉంది? అలాంటి నీరు తాగడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి గంటన్నర నిడివితో ఒక వీడియోను.. రెండు రకాల కిట్లను ఉపయోగించి తాగునీటికి ఎలా పరీక్షలు చేయాలనే దానిపై మరో 45 నిమిషాల వీడియోను రూపొందించారు. శిక్షణ కార్యక్రమాల్లో ప్రదర్శించేందుకు ఈ వీడియోల సీడీలను మండలాలకు పంపారు. ⇔ అలాగే తాగునీరు కలుషితం కావడానికి కారణాలు, ఈ నీటిని తాగడం వల్ల సంభవించే సీజనల్, దీర్ఘకాలిక వ్యాధులపై గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద సంఖ్యలో వాల్ పెయింట్లు వేయించడంతోపాటు కరపత్రాల ద్వారా ప్రచారం చేయనున్నారు. ⇔ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి పరీక్షలు చేపట్టేందుకు సబ్ డివిజనల్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న 125 ల్యాబ్‌లను ఆధునికీకరించనున్నారు. వీటితోపాటు గ్రామ స్థాయిలో పరీక్షల నిర్వహణకు కిట్ల కొనుగోలు, శిక్షణ, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు మొత్తం రూ.48 కోట్లను ఖర్చు చేయనున్నారు. వ్యాధులను ముందే అరికట్టే వీలు రెండు రకాలుగా తాగునీరు కలుషితమవ్వడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతుంటారని ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కోలిఫామ్, ఈ–కోలి అనే రెండు సూక్ష్మక్రిములు తాగునీటిలో కలుషితమై ఉండి ఉంటే.. ఆ నీటిని తాగేవారు డయేరియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. తద్వారా చిన్న పిల్లలు కొద్ది సమయంలోనే పూర్తిగా నీరసపడి మరణించవచ్చు. ఈ స్థితికి కారణమయ్యే ఆ రెండు సూక్ష్మక్రిములు తాగునీటిలో ఉన్నాయో, లేదో హెచ్2ఎస్ వైల్స్ పరీక్ష కిట్ల ద్వారా తెలుసుకోవచ్చు. రెండో రకంలో.. ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్, న్రైటేట్, కాల్షియం వంటివాటితో తాగునీరు కలుషితమైతే కీళ్ల నొప్పులు, పళ్లు దెబ్బతినడంతోపాటు దీర్ఘకాలిక అనార్యోగ సమస్యలు తలెత్తుతాయని అధికారులు తెలిపారు. ఈ రసాయన కలుషితాలను ఫీల్డ్ టెస్ట్ కిట్ల ద్వారా తెలుసుకుంటారు. గ్రామ స్థాయిలోనే ఈ తాగునీటి పరీక్షల నిర్వహణకు నిర్ణయించడం వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా అరికట్టవచ్చన్నారు. అలాగే దీర్ఘకాలిక అనార్యోగ సమస్యలను కూడా చాలా వరకు రాకుండా చూడొచ్చని తెలిపారు. రక్షిత మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం తాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా మారుమూల కుగ్రామాలతో సహా ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. జలజీవన్ మిషన్ కింద గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాగే నీరు కలుషితమైందో, లేదో తెలుసుకోవడానికి గ్రామాల్లో సైతం నీటి పరీక్షలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో సీజనల్ వ్యాధులను పూర్తిగా అరికట్టాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. –పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కలుషిత నీటికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కలుషిత నీటికి ఆస్కారం లేకుండా, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తాగునీటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురికి శిక్షణ అందించనున్నాం. ఈ నెల 9 నుంచి మండలాల స్థాయిలో శిక్షణ ప్రారంభం కానుంది. తద్వారా గ్రామ స్థాయిల్లోనే ఎక్కడికక్కడ తాగునీటి పరీక్షలు చేసుకోవచ్చు. - గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కరపత్రాల ద్వారా ప్రచారం.. కలుషిత నీటి కారణంగా కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు కరపత్రాలు, వాల్ పెయింటింగ్‌ల ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తాం. గ్రామ స్థాయిలోనే తాగునీటి పరీక్షలకు కిట్ల పంపిణీతోపాటు సబ్ డివిజన్ స్థాయిలో ఉండే నీటి పరీక్షల ల్యాబ్‌లను సైతం జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నిధులు అందజేసింది. ఇటీవలే రాష్ట్రంలో ఐదు ల్యాబ్‌లకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఏబీల్) గుర్తింపు కూడా దక్కింది. మిగిలిన 120 ల్యాబ్‌లకు కూడా ఈ గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణారెడ్డి, ఈఎన్సీ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం. -
మంచినీటికి ‘పరీక్ష’
గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేసిన నీటి పరీక్ష కిట్లు చాలా చోట్ల వినియోగించడంలేదు. దీంతో సర్కార్ లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కిట్లు చాలావరకు మూలన చేరాయి. చేవెళ్ల గ్రామీణ నీటి సరఫరా సబ్ డివిజన్ పరిధిలో చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, నవాబుపేట మండలాల పరిధిలో 126 గ్రామ పంచాయతీలు, వాటికి అనుబంధంగా 124 గ్రామాలున్నాయి. మొత్తమ్మీద 1560 చేతి పంపులుండగా, వాటిలో 80 వరకు పనిచేయటం లేదు. 269 చేతి పంపులు కే వలం వర్షాకాలంలోనే పనిచేస్తాయి. 203 ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు, 36 మినీ ట్యాంకులు, 106 సంపులున్నాయి. నియోజకవర్గంలో సుమారుగా రెండున్నర లక్షల జనాభా ఉంది. శంకర్పల్లి మండలంలో మాత్రమే మంజీరా జలాలను అందిస్తుండగా, విగిలిన మండలాల్లో బోరు బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో సరఫరా చేసే నీటిని ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు వీలుగా అన్ని గ్రామాలకు ప్రభుత్వం నీటి పరీక్ష కిట్లను పంపిణీ చేసింది. నీటి పరీక్షలు ఎలా చేయాలన్నదానిపై అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి పరీక్షలు ప్రహసనంగా మారాయి. నీటి శుద్ధత కిట్లను పంపిణీ చేసిన అధికారులు వాటిని గ్రామాల్లో సక్రమంగా వినియోగిస్తున్నారా.. లేదా.. అనే అంశాలపై పర్యవేక్షించకపోవడం మూలంగా చాలా గ్రామాల్లో నిరుపయోగంగా పడిఉన్నాయి. నెలకోసారి పరీక్ష చేయాలి.. జనాభా ఆధారంగా ప్రతి 500 మందికి నీరు అందించే వనరులను గుర్తించి వాటి నుంచి కనీసం నెలకోసారి నీటిని సేకరించి పరీక్ష చేయాలి. చేతి పంపుల నీటిని నెలకోసారి, బావుల్లోని నీటిని నెలకు రెండు సార్లు, కుళాయి నుంచి సరఫరా చేసే నీటిని నెలకు రెండు సార్లు, అంతర్గత క్లోరిన్ పరీక్ష నెలకోసారి చేయాలి. వర్షాకాలానికి ముందు, తర్వాత రసాయన పరీక్ష నిర్వహించాలి. నీటి నాణ్యతా కిట్ల సాయంతో నాణ్యత పర్యవేక్షణ, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నీటి వనరుల వద్దే పరీక్షలు నిర్వహించాలి. విశ్లేషణ ఫలితాలను నిర్ణీత పట్టికలో నింపి ప్రతినెలా జిల్లా, డివిజన్ స్థాయి ప్రయోగశాలలకు పంపించాలి. క్షేత్రస్థాయిలో కిట్లతో నీటి నమూనాలను రసాయనిక, బ్యాక్టీరియాలాజికల్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. గ్రామస్థాయిలో నాణ్యతను తెలుసుకోవడానికి సాధారణ పరీక్షలు సరిపోతాయి. నీటి పరీక్షల్లో ఫ్లోరైడ్‌శాతం, కలుషిత నీటి శాతం, బ్యాక్టీరియా శాతం లాంటి నమూనాలు బయటపడితే నివారణ చర్యలను తీసుకోవచ్చనేది పరీక్షల ప్రధాన ఉద్ధేశం. దీనికి ప్రభుత్వం సరఫరా చేసిన కిట్లను వినియోగిస్తే చాలు. కాగా అధికారులెవరూ పట్టించుకోకపోవడం మూలంగా ఈ విధానం సత్ఫలితాలనివ్వడంలేదు. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించి, రక్షిత మంచినీటిని అందించాలని కోరుతున్నారు. వర్షాకాలం త్వరలో ప్రారంభమవుతున్నందున నీటి నాణ్యతా పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తే కలుషిత నీటి నుంచి ప్రజలను కాపాడవచ్చంటున్నారు. -
అటకెక్కిన నీటి పరీక్ష కిట్లు
ప్రజలకు కలుషిత నీరే దిక్కు - వేసవిలో కృష్ణపట్టె గ్రామాల్లో పొంచి ఉన్న ముప్పు - చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం - నెరవేరని ప్రభుత్వ లక్ష్యం రక్షితనీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసే నీరు కలుషితం కాకుండా తద్వారా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆరు నె లల క్రితం జిల్లాలోని ప్రతి గ్రామానికి నీటి పరీక్ష కిట్లు అందజేసింది. గ్రామీణ నీటిసరఫరా శాఖ ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బందికి పలుమార్లు శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణపొందిన ఫీల్డ్ అస్టెంట్లు గ్రామాలను సందర్శించాలి. ఆయా గ్రామాలకు చెందిన ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది సాయంతో స్థానికంగా ఉన్న చేతి పంపులు, బావులు, బోర్లలోని నీటిని పరీక్షించాలి. వాటి ఫలితాన్ని బట్టి ఆనీటిని గ్రామస్తులు వాడవచ్చా.. లేదా అనేది నిర్ధారించాలి. నీటిని పరీక్ష చేయగా వచ్చిన ఫలితాలను రికార్డు చేయాలి. నీరు కలుషితం, ఫ్లోరిన్‌శాతం అధికంగా ఉంటే ఆబోరుపై రెడ్ కలర్‌తో మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసిన బోర్లలో నీటిని వాడకానికి నిషేధిస్తారు. ఇది నిత్యం జరగాల్సిన పని. కానీ ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. మూలనపడ్డ నీటి పరీక్ష కిట్లు నీటి పరీక్ష విధానం క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్రమంగా అమలైన దాఖలాలు లేవు. నీటి పరీక్ష కిట్లు గ్రామ పంచాయతీల్లోనే, ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే మూలకు పడి దర్శనమిస్తున్నాయి. గ్రామస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది ఇటువైపు చూసిన పాపాన పోలేదు. వీరిపై ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ కూడా లేకపోయింది. గ్రామ పంచాయతీ కార్మికులే రక్షిత నీటి పథకాల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. పొంచి ఉన్న అంటువ్యాధులు దామరచర్ల మండలంలోని కృష్ణపట్టె గ్రామాల్లో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఇర్కిగూడెం, తాళ్ల వీరప్పగూడెం, ముదిమాణిక్య, చిట్యాల, నడిగడ్డ, కల్లెపల్లి, వర్లీపలాలెం గ్రామాల ప్రజలు తాగునీటి కోసం కృష్ణా నదిపైనే ఆధారపడతారు. వేసవికాలం కావడంతో నదిలో నీటి మట్టం పడిపోతుంది. అదే నీటిని గ్రామాలకు నేరుగా పంపింగ్ చేస్తుంటారు. దీంతో కలుషిత నీటిని ఆయా గ్రామాల ప్రజలు తాగడం వల్ల డయోరియా, కలరా తదితర వ్యాధులకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అదే నీటిని పరీక్షల కిట్టుతో టెస్ట్ చేసి సురక్షితమని గుర్తిస్తే వాటిని తాగకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్, ఆరోగ్యశాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పని చేసి నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోతున్నారు.