breaking news
Wages doubled
-
పార్ట్‌టైం లెక్చరర్ల గౌరవ వేతనం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్లుగా, గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న లెక్చరర్ల వేతనాలు రెట్టింపు కానున్నాయి. ఏడో వేతన కమిషన్ సిఫారసుల మేరకు ఇటీవల అధ్యాపకుల వేతనాలను పెంచిన ప్రభుత్వం, గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తాజా పెంపు ప్రకారం గెస్ట్ ఫ్యాకల్టీకి ఒక్కో పీరియడ్‌కు (లెక్చర్) రూ.1,500 చెల్లించాలని, లేదా నెలకు రూ.50 వేల వరకు చెల్లించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం/గెస్ట్ ఫ్యాకల్టీకి నెట్/సెట్/పీహెచ్డీ ఉన్న వారికైతే ఒక పీరియడ్‌కు రూ.700, ఆ అర్హతలు లేనివారికి రూ.600 చొప్పున వర్సిటీలు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో నిర్ధేశిత అర్హతలున్న ఫ్యాకల్టీకి ఇకపై ఒక్కో పీరియడ్‌కు రూ.1,500 వేతనం లభించనుంది. వర్సిటీల్లో ఖాళీల మేరకు గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి ఆమోదం తెలిపింది. రెగ్యులర్ పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకునే అర్హతలనే ఈ నియామకాల్లోనూ పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. వైస్ ఛాన్స్లర్ చైర్‌పర్సన్‌గా ఈ నియామకాలకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, డీన్, హెచ్‌వోడీ, సబ్జెక్టు నిపుణులతోపాటు ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ మైనారిటీ/ వికలాంగుల కేటగిరీలకు చెందిన అకడమిషియన్ ఉండాలని వివరించింది. గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు గరిష్ట వయస్సు 70 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా!
వేతనాల రెట్టింపునకు ప్రభుత్వానికి పురపాలక శాఖ ప్రతిపాదన ♦ మున్సిపాలిటీ స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాలకు సిఫార్సు ♦ పబ్లిక్ హెల్త్ వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 14,170కు ... ♦ నాన్‌పబ్లిక్ హెల్త్‌వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 17,380కు పెంచాలని సూచన ♦ ఆర్థికశాఖ ఆమోదిస్తే 13,955 మంది కాంట్రాక్టు వర్కర్లకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. ఇకపై మున్సిపాలిటీల స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాల కోసం పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.14,170 (స్థూల వేతనం రూ.19,586)కు, పారిశుద్ధ్యేతర కార్మికులకు రూ.17,380 (స్థూల వేతనం రూ.24,023)కు పెంచాలని కోరింది. ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ యథాతథంగా ఆమోదిస్తే వేతనాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లోని కార్మికులకు కనీస వేతనం రూ.8,300 (స్థూల వేతనం రూ.11,473) చెల్లిస్తుండగా, నగర పంచాయతీల్లోని కార్మికులకు రూ.7,300 (స్థూల వేతనం రూ.10,091) చెల్లిస్తున్నారు. 9వ పీఆర్సీ 4వ తరగతి ఉద్యోగుల కోసం సిఫారసు చేసిన కనీస వేతనాన్ని ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రకటించిన 10వ పీఆర్సీ 43 శాతం ఫిట్‌మెంట్‌ను తమకు సైతం వర్తింపజేయాలని మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే నిరసనలు, సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో వారి డిమాండ్‌కు అనుగుణంగానే పురపాలకశాఖ వేతన పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 13,955 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా అందులో 9,953 మంది పారిశుద్ధ్య (పబ్లిక్ హెల్త్) కార్మికులు, 4,002 మంది పారిశుద్ధ్యేతర (నాన్ పబ్లిక్ హెల్త్) కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం పురపాలికలు చెల్లిస్తున్న వేతనాలకు ఏటా రూ.186.70 కోట్లు ఖర్చవుతుండగా వేతనాలు పెంచితే ఆర్థిక భారం రూ.346.51 కోట్లకు పెరగనుంది. పురపాలికలపై రూ.159.81 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ డిమాండ్ సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. సఫాయివాలాల వేతనాలూ సఫాయి పలు మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు పురపాలకశాఖ పరిశీలనలో తేలింది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటాలను కార్మికుల వేతనాల నుంచి కోత పెట్టినప్పటికీ సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదని నిర్ధారించింది. మున్సిపల్ కమిషనర్లు, లేబర్ కాంట్రాక్టర్లు రూ. 9.04 కోట్ల ఈఎస్ఐ, పీఎఫ్ నిధులను స్వాహా చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో తేల్చింది. ఈ నిధులను తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని పురపాలకశాఖ ఇటీవల మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించింది.