ఉత్కంఠభరితంగా సాగిన టాంటెక్స్ వాలీబాల్ టోర్నమెంట్
డాలస్ : క్రీడల పట్ల మన దేశీయులకున్న ఆసక్తి చూస్తే చాలా గర్వంగా ఉందని డాలస్‌లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రమణ్యం అన్నారు. డాలస్‌లోని స్పోర్ట్స్ ప్లెక్స్ సెంటర్లో ఆదివారం (మే 1వ తేదీ) వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఉదయం 8.00 గంటలకు ఈ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమై... సాయంకాలం 7.00 గంటల వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్‌కు డాలస్తోపాటు ఫోర్ట్‌వర్త్ నగరం నుంచి 25 జట్లు పాల్గొన్నాయి.
వాటిని నాలుగు పూల్స్‌గా విభజించి... ఆట మొదలుపెట్టారు. ఇందులో గెలిచిన 16 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇక్కడ నుంచి 8 జట్లు లెవెల్-1 కప్ కోసం ఆడగా మిగతా 8 జట్లు లెవెల్-2 కప్ కోసం ఆడారు. ఫైనల్స్ చేరుకున్న 4 జట్ల మధ్య ఆట హోరాహోరీగా సాగింది. లెవెల్-1 కప్‌లో అంబ్లిక్స్vs కేయాస్ మధ్య జరిగిన ఫైనల్స్‌లో కేయాస్ జట్టు విజేతగా నిలిచింది. లెవెల్-2 కప్‌లో స్నయిపర్స్-2 vs పంజాబ్ లయన్స్ మధ్య జరిగిన ఫైనల్స్ లో పంజాబ్ లయన్స్ విజేత గా నిలిచింది.
టోర్నమెంట్ అనంతరం టాంటెక్స్ క్రీడల సమన్వయకర్త బ్రహ్మదేవర శేఖర్ మాట్లాడుతూ... వాలీబాల్ టోర్నమెంట్‌కి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ టోర్నమెంట్ కోసం కష్టపడి ఏర్పాట్లు చేసినందుకు ఫలితం దక్కిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడా విభాగం సభ్యులైన డా.కొండ తిరుమలయ్య,తోట పద్మశ్రీ, పూర్వ రాజ్వడే,రాజ వైశ్యరాజు, మధుమతి వైశ్యరాజు, శరత్ ఎర్రం తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
టాంటెక్స్ పుర్వాధ్యక్షులు డా.ఉరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు రొడ్ద రామకృష్ణ, కోశాధికారి దండవెంకట్, కార్యనిర్వాహక సభ్యులు కోడూరు కృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్లుకు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, బ్రహ్మదేవర శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.