breaking news
village politics
-
ఏపీ: గ్రామ పాలనలో 55 శాతం వారే..
►ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల చిల్లా అనూష ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాజకీయాల పట్ల తనకు ఉన్న ఆసక్తి, ప్రజాసేవ చేయాలనే కోరిక తనను ఈ దిశగా నడిపించాయని అనూష అంటున్నారు. ఆ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడం తనకు కలిసి వచ్చిందని ‘సాక్షి’తో అన్నారు. ఈమెతో పాటు రాష్ట్రంలో ఎంతో మంది ఔత్సాహిక యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాలకు కొత్త కళను తీసుకొచ్చారు. గ్రామాల్లో మారుతున్న పరిస్థితులపై కథనం ►అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లజెరువు సర్పంచ్‌గా ఎంకాం చదివి.. రెండేళ్ల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన దాసరి శ్రీనాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అతడి తల్లిదండ్రులు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులే. వాళ్లిద్దరూ పెద్దగా చదువుకున్న వాళ్లు కూడా కాదు. శ్రీనాథ్‌రెడ్డి మాత్రం రాజకీయాలపై ఆసక్తితోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌రెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయన సర్పంచ్‌గా ఎన్నిక కావడానికి దోహదపడ్డాయి. సర్పంచ్ అయ్యాక శ్రీనాథ్‌రెడ్డి గ్రామంలో కరోనా బారిన పడినవారి కోసం స్థానిక పాఠశాల భవనంలో 10 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: రాజకీయ రంగం నూతన జవసత్వాలు పుంజుకుంటోంది. గ్రామీణ రాజకీయ రంగంలో పాత నీరు దాదాపు పోయింది. బాగా చదువుకున్న నవతరం రాజకీయాల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం మంది తొలిసారి సర్పంచ్‌లుగా ఎన్నికైన వారే ఉన్నారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 13,097 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీరిలో 13,070 సర్పంచ్ల పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి అందాయి. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. సర్పంచ్‌లుగా ఎన్నికైన 13,070 మందిలో 11,008 మంది (84 శాతం) తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిగ చోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులే గెలుపొందిన నేపథ్యంలో.. రాష్ట్రంలో డైనమిక్ రాజకీయాలకు నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కొత్త తరం వారికి మెండుగా అవకాశాలు దక్కాయి. రిజర్వుడు స్థానాల్లోనూ చదువుకున్న వారే.. తొలినాళ్లలో చదువు వచ్చినా.. రాకపోయినా ఊళ్లో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే వారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేవారు. అప్పట్లో సర్పంచ్‌లుగా గెలిచే వారిలో 90 శాతం వరకు నిరక్షరాస్యులే ఉండేవారు. గడచిన 30 ఏళ్ల కాలంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వు అయ్యే స్థానాల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే సర్పంచ్‌లుగా గెలుపొందే వారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మొత్తం 13,070 మంది సర్పంచ్‌లలో కేవలం 2,276 మంది మాత్రమే నిరక్షరాస్యులు ఉన్నారు. 10,794 చోట్ల చదువుకున్న వారే గెలిచారు. వీరిలో చార్టెడ్ అకౌంట్ (సీఏ), ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, సీఏ, బీటెక్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. మొత్తం సర్పంచ్‌లలో 525 మంది పెళ్లి కాకమునుపే సర్పంచ్‌లుగా గెలుపొందటం విశేషం. రిజర్వేషన్లకు మించి మహిళలకు పదవులు జనరల్ రిజర్వుడు స్థానాల్లో మహిళలు సర్పంచ్ స్థానాలకు పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాల్లో 55 శాతం మంది మహిళలు సర్పంచ్ పదవులు దక్కించుకోగా.. పురుషులకు కేవలం 45 శాతం సర్పంచ్ స్థానాలే దక్కించుకోగలిగారు. సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలో 50 శాతం స్థానాలు మహిళలకు రిజర్వు చేశారు. కానీ, రిజర్వు స్థానాలకు అదనంగా మరో 5 శాతం సర్పంచ్ స్థానాలను మహిళలు దక్కించుకున్నారు. -
బెళ్లూరులో విద్యార్థుల ఆకలి కేకలు
కోలారు, న్యూస్‌లైన్ : గ్రామ రాజకీయాల కారణంగా చిన్నారులు ఆకలితో అలమటించి పోతున్నారు. పస్తులతోనే చదువులు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందక..క్షీరభాగ్య పథకానికి నోచుకోక విద్యార్థులు అల్లాడి పోతున్నారు. తాలూకాలోని నరసాపురం ఫిర్కా బెళ్లూరు గ్రామంలో ప్రముఖ యోగా సాధకుడు బీకేఎస్ అయ్యంగార్ తన భార్య పేరుపై నిర్మించిన భవనంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు. 189 మంది విద్యార్థులు ఉండగా ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం మధ్యాహ్న భోజనంలో బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురై ఎట్టకేలకు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వంటసిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించాలని కొందరు, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలని మరికొందరు పట్టుబట్టారు. దాంతోఅధికారులు మధ్యాహ్న భోజనాన్ని ప్రైవే ట్ ఏజెన్సీకి అప్పగించి కొద్ది రోజులు పట్టణం నుంచే భోజనం సరఫరా చేశారు. తర్వాత నరసాపురం పాఠశాలలో భోజనం తయారు చేయించి బెళ్లూరుకు ఆటోల్లో తరలించే వారు. తర్వాత ఉపాధ్యాయులే వంటలు తయారు చేసి వడ్డించేవారు. అయితే స్వాతంత్ర దిన వేడుకల అనంతరం ఉన్నఫళంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేశారు. దీనికితోడు క్షీరభాగ్య పథకం కూడా అమలు కావడం లేదు. పాఠశాలకు సరఫరా చేసిన పాల పొడి ప్యాకెట్లను కనీసం తెరచిన పాపాన పోలేదు. దీంతో విద్యార్థులు వారం రోజులుగా మధ్యాహ్న సమయంలో పస్తులుంటున్నారు. మధ్యాహ్న భోజనం ఆగిన విషయాన్ని పాఠశాల అభివృద్ధి సమితి అధ్యక్షుడు, బీఈఓ, ఇతర అధికారుల దృష్టికి తెచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణకుమారి పేర్కొంటున్నారు. ఈ విషయంపై బీఈఓ శివలింగయ్య వివరణ ఇస్తూ ఈ విషయం ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. వంటవారి నియమించే అధికారం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, ఎస్డీఎంసీ అధ్యక్షుడు , పీడీఓ, ప్రధానోపాధ్యాయులకు ఉందన్నారు. చిన్న చిన్న విషయాలతో వివాదాలు సృష్టించి విద్యార్థులను పస్తులుంచవద్దని పాఠశాల అభివృద్ది కమిటీకి సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఎన్డీఎంసీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ త్వరలో వంటవారిని నియమించి సమస్యను పరిష్కరిస్తామనిచెప్పారు.