breaking news
Vijaya milks
-
విజయ డెయిరీలో ఏం జరుగుతోంది.. ప్రత్యేక బృందం పరీశీలన!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)లో జరుగుతున్న అక్రమాలపై ఐదుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు వేసిన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయిస్తున్నారు. ఈ బృందంలో రాష్ట్ర జనరల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం డెయిరీ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్‌తో పాటు గతంలో ఇక్కడ పనిచేసిన మేనేజర్ కోడిరెక్క రవికుమార్ ఉన్నారు. మూడు రోజులుగా వీరు ఖమ్మంలోనే మకాం వేసి అక్రమాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఖమ్మం డెయిరీలో అక్రమాలపై రెండేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.లక్షల విలువైన వెన్న, రైతులకు విడుదల చేసిన పాల ప్రోత్సాహకాలు కూడా పక్కదారి పట్టించడమే కాక, రెండు జిల్లాల పరిధిలోని బల్‌్కమిల్క్ సెంటర్ల నిర్వహణ, పాడిపశువులు, పనిముట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు 2021 నవంబర్‌లో రాష్ట్ర సంస్థ రాష్ట్ర పాడి పరిశ్రమల డైరెక్టర్ లక్ష్మీ మంజూషతో పాటు మరో ఇద్దరు అధికారుల బృందం ఇక్కడ విచారణ జరపగా, కొందరు ఉద్యోగులను బదిలీ చేశారు. ఇదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ భరతలక్ష్మి కోర్టును ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగుతుండగా.. వర్గవిభేదాలు సద్దుమణగలేదు. దీంతో ఉన్నతాధికారులు ఖమ్మం డెయిరీ డీడీ సత్యనారాయణను మాతృసంస్థకు పంపించి, నల్లగొండకు బదిలీ అయిన మేనేజర్ నరేష్, ప్రస్తుతం ఇక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న భరతలక్షి్మతో పాటు ల్యాబ్ అసిస్టెంట్ నాగశ్రీ ప్లాంట్ ఆపరేటర్ మణిని తాజాగా సస్పెండ్ చేశారు. అక్రమాలపై ప్రత్యేక బృందం పరిశీలన ఖమ్మం పాడి పరిశ్రమలో రూ.40 లక్షలకు పైగా జరిగిన అక్రమాలపై జనరల్ మేనేజర్ మల్లయ్య నేతృత్వంలోనే బృందం మూడు రోజులుగా విచారణ చేస్తోంది. రెండేళ్లకు సంబంధించి ప్లాంట్ నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాక ఇల్లెందు, కొత్తగూడెం సెంటర్లలో తనిఖీ చేశారు. ఇంకా రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరుపై విచారణ చేపట్టి, అక్రమాలకు ఎవరు సహకరిస్తున్నారనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ బృందంలోని అధికారులు సోమవారం కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌ను కలిసి అన్ని అంశాలను వివరించినట్లు తెలిసింది. ఆపై ఉన్నతాధికారులకు ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా విచారణ కోసం ఇంకో కమిటీని నియమించనున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఖమ్మం పాడి పరిశ్రమలో చోటు చేసుకున్న అక్రమాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. ఆ నివేదిక ఆధారంగా విచారణకు కమిటీని నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో త్వరలోనే 5 లక్షల లీటర్ల సామర్ద్యం కలిగిన మెగా డెయిరీ ఏర్పాటవుతోంది. ఈ డెయిరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పాల సమీకరణ కోసం కృషి చేస్తున్నాం. – మల్లయ్య, జనరల్ మేనేజర్. -
‘విజయ’ మాదంటే.. మాదే!
►విజయ పాలు , తెలంగాణ ఆంధ్రప్రదేశ్ , కమలనాథన్ కమిటీ ►రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విజయ బ్రాండ్ కోసం వివాదం ►తెలంగాణ విజయ అమ్మకాలపై రాష్ట్రానికి ఏపీ నోటీసులు ►వివాదాలతో పడిపోయిన తెలంగాణ విజయ పాల అమ్మకాలు ►అనాలోచిత నిర్ణయంతో కాలం తీరుతున్న 3 లక్షల టెట్రాప్యాక్‌లు సాక్షి, హైదరాబాద్: ‘విజయ’బ్రాండ్‌పై రెండు తెలుగు రాష్ట్రాలు పేచీపడు తున్నాయి. అది తమదంటే తమదంటూ గొడవ పడుతున్నాయి. విభజన నేపథ్యంలో విజయ బ్రాండ్ ఎవరికి చెందాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. బ్రాండ్ అనేది వ్యాపారానికి సంబంధించిన అంశం కాబట్టి రెండు రాష్ట్రాలూ తమ రాష్ట్రం పేరును ముందు తగిలించి విజయ బ్రాండ్‌తో పాలు అమ్ముకోవాలని కమలనాథన్ కమిటీ సూచించింది. కానీ అది అమలు కావడంలేదు. ప్రస్తుతం ‘తెలంగాణ విజయ’, ‘ఆంధ్రప్రదేశ్ విజయ’పాల పేరుతో మార్కెట్లో రెండు రకాల పాల విక్రయాలు జరుగుతున్నా ఏపీ మాత్రం తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. తన బ్రాండ్‌తో ఎలా అమ్ముకుంటున్నారంటూ తెలంగాణను నిలదీసింది. దీంతో సమస్య కొలిక్కి రావడంలేదు. ఇదిలావుంటే తెలంగాణలోనూ ‘ఆంధ్రప్రదేశ్ విజయ’పాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా అనేకానేక వివాదాల కారణంగా రాష్ట్రంలో విజయ పాల అమ్మకాలు ఢమాల్ అయ్యాయి. దాదాపు 40 వేల లీటర్ల పాల విక్రయాలు పడిపోయాయి. కాలం చెల్లుతున్న టెట్రాప్యాక్ పాలు.. తెలంగాణ విజయ డెయిరీలో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారులకు, కిందిస్థాయి అధికారులకు మధ్య దూరం పెరిగింది. దీంతో కిందిస్థాయి అధికారుల ఆలోచనలను పట్టించుకోకుండా ఉన్నతస్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఎలాంటి ఇండెంట్ లేకుండా రెండు నెలల క్రితం దాదాపు 15 లక్షల లీటర్ల విజయ టెట్రాప్యాక్ పాలను ప్యాకింగ్ చేశారు. వాటి నిల్వ కాలం 90 రోజులు. కానీ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో అవి అమ్మకానికి నోచుకోలేదు. ఎలా విక్రయించాలో అర్థంగాక చివరకు ఒక కాంట్రాక్టర్‌ను పిలిపించి కొన్ని అమ్మి పెట్టమని కోరినట్లు సమాచారం. అయినా 2 లక్షల లీటర్ల పాలు వృథా అయ్యే ప్రమాదముందని అంటున్నారు. వాటి గడువు 20 రోజుల లోపే ఉందని, దీంతో రూ.40 లక్షల విలువైన పాలు గంగలో పోసినట్లేనంటున్నారు.