breaking news
Vice-Presidential Election
-
క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ?
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్ ఓటింగ్ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా రాధాకృష్ణన్ వైపు కొందరు విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు మొగ్గుచూపారని వార్తలు ఎక్కువయ్యాయి. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై అంతర్గత విచారణ చేయించాలని కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బిహార్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ అంశం పార్టీల ఐక్యతకు ప్రశి్నస్తోంది. దీంతో ఐక్యత పెద్ద సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో కూటమిలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. మంగళవారం వెల్లడైన ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో సుమారు 20 ఓట్లు రాధాకృష్ణన్‌కు పడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 324 ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు పడ్డాయి. రాధాకృష్ణన్ గరిష్టంగా 436 ఓట్లు సాధించవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన 452 ఓట్లు సాధించారు. మరింత స్పష్టమైన మెజారిటీ ఒడిసిపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అనుకూల ఓట్లపై ఓ అంచనాకు వచి్చన కాంగ్రెస్ సైతం తమకు అనుకూలంగా 315 ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు ఇక్కడే క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. భారీ క్రాస్ ఓటింగ్ దృష్ట్యా ఈ అంశంపై కచ్చితంగా విచారణ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. దీనిని తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగానే పరిగణించాలని, ఇది విపక్షాల అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తివారీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు సైతం ఈ విషయంపై విచారణ కోరుకుంటున్నారని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి రావాల్సిన 12 ఓట్లలో కనీసంగా 3 ఓట్లు, తమిళనాట డీఎంకే నుంచి రావాల్సిన 32 ఓట్లలో కనీసంగా 4 ఓట్లు, ఆర్జేడీ నుంచి రెండు ఓట్లు, శివసేన(ఉద్ధవ్) పార్టీ నుంచి కొన్ని ఓట్లు క్రాసింగ్ జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. మాకు సంబంధం లేదన్న పార్టీలుఅయితే క్రాస్ ఓటింగ్ వివాదంపై విపక్ష పార్టీల వాదన భిన్నంగా ఉంది. తమ సభ్యులెవరూ రాధాకృష్ణన్‌కు ఓటేయలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు కరాఖండీగా చెప్పాయి. దీనిపై ఇప్పటికే ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు తమ ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ప్రకటనలు సైతం ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓట్లు నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థికే బలంగా పడ్డాయని చెబుతున్నాయి. అయితే బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికల దృష్ట్యా కూటమిలో ఐక్యత కొనసాగి ఎన్నికల్లో పోరాడాలంటే క్రాస్ ఓటింగ్‌పై విచారణ జరపాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థికి 40 శాతం ఓట్ల వాటాను ‘నైతిక విజయం‘గా కాంగ్రెస్ నాయకులు అభివరి్ణస్తున్నారు. 2022 ఎన్డీఏకు చెందిన జగదీప్ ధన్‌ఖడ్‌పై పోటి చేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు వచి్చన ఓట్లతో పోలిస్తే ఈసారి తమకుæ దాదాపు 14 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక వీటిని తిప్పికొడుతున్న బీజేపీ 15 మంది ప్రతిపక్ష ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని, మరో 15 మంది ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్లు వేశారని కౌంటర్లు ఇస్తోంది. -
ఉపరాష్ట్రపతి ఎన్నికలు: ఆ ఓట్లు వెంకయ్యకు కాదా?
- ఇంతకు ముందే విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించిన జేడీయూ - శనివారం ఉదయం వరకూ విరుద్ధ ప్రకటన చేయని నితీశ్ కుమార్ న్యూఢిల్లీ: భారతదేశపు 13 ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. ఇప్పటికే లభించిన మద్దతును బట్టి ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు గెలుపు ఖాయమే అయినప్పటికీ.. ఇటీవలే బీజేపీతో పొత్తుపెట్టుకున్న నితీశ్ కుమార్(జేడీయూ పార్టీ) ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారా? లేక ఇంతకు ముందే ప్రకటించినట్లు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి ఓటేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు బేషరతుగా మద్దతు పలికినిన నితీశ్.. ఉపరాష్ట్రపతి విషయంలో మాత్రం యూ టర్న్ తీసుకుని.. విపక్షాల అభ్యర్థి గాంధీకే ఓటేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల బిహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దరిమిలా, బీజేపీతో అంటకాగుతున్న జేడీయూ ఓటును తిరస్కరించాలని కొందరు ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్.. గోపాలకృష్ణ గాంధీకి సూచించారు. కానీ అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ‘మద్దతు వద్దనడం భావ్యం కాదు’ అని సున్నితంగా చెప్పారు. ఒకవేళ నితీశ్ పార్టీ గాంధీకే ఓటువేస్తే ఎన్డీఏ పార్టీల స్పందన ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది. కాగా, శనివారం ఉదయం వరకూ నితీశ్ మరో ప్రకటన చేయకపోవడాన్నిబట్టి ఆయన పార్టీ(జేడీయూ) గాంధీకే ఓటు వేయబోతున్నట్లు అర్థమవుతోంది. మాక్‌పోలింగ్‌లో తడబడ్డ ఎన్డీఏ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు, అంటే శుక్రవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి సభ్యులకు మాక్ పోలింగ్ నిర్వహించగా, 16 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం 17 మంది ఎన్డీఏ సభ్యుల ఓట్లు చెల్లకుండా పోయినా దరిమిలా ఈ సారి ఆ తప్పు జరగకుండా ఉండేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. కాగా, మాక్ పోలింగ్ సందర్భంగా తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు మాట్లాడారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారన్న సగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్‌సభలో 337 సభ్యులు, రాజ్యసభలో 80 మంది సభ్యుల బలం ఉంది. దీనికితోడు ఏఐడీఎంకే, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన 67 మంది కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటువేయనున్నారు. తద్వారా మొత్తం 790 ఎంపీల్లో వెంకయ్యకు 484 మంది మద్దతు లభించినట్లయింది. గెలవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫికర్(395)ను ఆయన ఎప్పుడో అధిగమించారు. దీంతో ఆయన గెపులు లాంఛనమైంది. -
వెంకయ్య అనుభవానికి సరైన పదవి
- వైఎస్సార్ సీపీ ఎంపీల హర్షం - వెంకయ్య ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు - పార్టీ తరపున ఆయనకు సంపూర్ణ మద్దతు సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి వైఎస్సార్సీపీ ఎంపీలు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, బుట్టా రేణుక మంగళవారం వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. వెంకయ్య అపారమైన అనుభవానికి సరైన పదవి దక్కనుందని పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజలందరికీ హర్షదాయకమని, ఆయనకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి మీడియాతో మాట్లాడారు. వెంకయ్యతో తనకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందన్నారు. 1978లో వెంకయ్య నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి పోటీ చేసినప్పుడు తమ తండ్రి పూర్తి మద్దతు ప్రకటించి ఆయనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్య మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని మేకపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్య ఏ పదవిలో ఉన్నా ఏపీ, తెలంగాణ ఆభివృద్ధి విషయంలో ముందుం టారని వైవీ సుబ్బారెడ్డి కితాబిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులకు పోటీ వద్దని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు.. ఎన్నో పదవులు చేపట్టిన వెంకయ్య ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్షాలను కలుపుకొనిపోయి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్ముతు న్నామన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో తాను పీజీ చదివే రోజుల్లో వెంకయ్య విద్యార్థి సంఘానికి నాయకుడిగా వ్యవహరించేవారని వరప్రసాదరావు గుర్తు చేసుకున్నారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవమని బుట్టా రేణుక చెప్పారు. -
వెంకయ్యకు ఓటేయబోమన్న బీజేడీ
భువనేశ్వర్: రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు లభించినట్లే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ భారీ మద్దతు లభిస్తుందని భావించిన ఎన్డీఏకి బిజూ జనతాదళ్(బీజేడీ) షాకిచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీనే తాము బలపరుస్తామని బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ.. ఎన్డీఏ అభ్యర్థిని రామ్‌నాథ్ కోవింద్‌ను సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి పోలింగ్ ముగిసి 24 గంటలైనా గడవకముందే బీజేపీకి మింగుడుపడని నిర్ణయం తీసుకున్నారు నవీన్ పట్నాయక్. మంగళవారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీఏ అభ్యర్థి గాంధీ తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము స్నేహితులమని గుర్తుచేవారు. ప్రస్తుతం బీజేడీకి పార్లమెంట్లో 28 మంది ఎంపీలున్నారు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్‌తో బీజేడీ తెరవెనుక ఒప్పందం కుదుర్చుకుందని ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత పండా ఆరోపించారు. -
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సదాశివం?
నేడో, రేపో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ గడువు (జూలై 18) సమీపిస్తున్న కొద్దీ అధికార ఎన్డీయే తరపున బరిలో దిగే అభ్యర్థిపై ఉత్సుకత పెరుగుతోంది. బీజేపీ అధిష్టానం ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అయితే అభ్యర్థి ఎవరై ఉండొచ్చనే అంశంపై స్పష్టత రాకపోయినా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత కేరళ గవర్నర్ పి. సదాశివంకు అవకాశం లభించొచ్చని పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం. 2014లో తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సదాశివంను ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఓ సీజేఐ గవర్నర్‌గా నియమి తులవటం ఇదే తొలిసారి. అటు, ఓబీసీలకు ఉపరాష్ట్రపతి పగ్గాలు అప్పగించాలని భావిస్తున్న తరుణంలో గౌండర్ వర్గానికి చెందిన సదాశివంకు ఎక్కువ అవశాకాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య, యూపీ గవర్నర్ రాంనాయక్, గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వీరికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా మనసులో ఏముందో నేతలకు అర్థం కావటం లేదని.. ఎవరిని తెరపైకి తెస్తారనేది చివరి నిమిషం వరకు స్పష్టంగా చెప్పలేమని పార్టీ నేతలంటున్నారు. అయితే పార్టీ బలంగా లేని దక్షిణ భారతంలో పాగా వేసేందుకు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయొచ్చని సమాచారం. మరోవైపు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జూలై 23న పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే కార్యక్రమంలో వీడ్కోలు తెలపనున్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది. ఆగస్టు 5న ఎన్నిక జరగనుంది. జూలై 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 19న వాటిని పరిశీలించి పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 21. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసే అభ్యర్థులను 20 మంది ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపరచాలి. ఈ 40 మందీ పార్లమెంటు సభ్యులే అయ్యుండాలి. ఎన్నిక సమయంలో ఓటు వేసేందుకు ఎంపీలకు ప్రత్యేక పెన్‌లను ఇస్తారు. అది కాకుండా వేరే పెన్లతో ఓటు వేస్తే తిరస్కరణకు గురవుతుంది. అయితే ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటివరకు అటు ఎన్డీయే కానీ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఆయన రెండు పర్యాయాలు వరుసగా ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
► జూలై 4న నోటిఫికేషన్... ► ఎన్నికల షెడ్యూల్ విడుదల న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది. ఆగస్టు 5న ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం ఇక్కడ విడుదల చేశారు. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. అలాగే జూలై 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణ గడువు 21తో ముగుస్తుందని తెలిపారు. ఒకవేళ అవసరమైతే ఆగస్టు 5న పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. మార్కింగ్‌కు ప్రత్యేక పెన్ను... గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యం లో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పోలింగ్‌లో ప్రత్యేక పెన్నులు ఉపయో గించనున్నట్టు జైదీ చెప్పారు. ఓటర్లు ఈ పెన్నుతో మాత్రమే తమ అభ్యర్థికి మార్కింగ్ చేయాలన్నారు. వేరే ఏ పెన్ను వాడినా ఓట్లు చెల్లవని జైదీ స్పష్టం చేశారు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయడానికి వీల్లేదన్నారు. రాష్ట్రపతి నామినేషన్ల తిరస్కరణ... రాష్ట్రపతి ఎన్నికలకు అధికార ఎన్డీఏ, ప్రతిపక్షాల అభ్యర్థులైన రామ్‌నాథ్ కోవింద్, మీరాకుమార్ మినహా ఇతర నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాదాపు 95 మంది నామినేషన్ వేయగా... కోవింద్, మీరాకుమార్ మినహా మరెవరూ అవసరమైన బల నిరూపణ చేయలేకపోయినందుకు వాటిని తిరస్కరించినట్టు లోక్‌సభ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసేవారిని ఎలక్టోరల్ కాలేజీలోని 56 మంది సభ్యులు ప్రతిపాదించాలి.


