breaking news
varsha dongre
-
ఫేస్బుక్లో కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తారా?
రాయ్‌పూర్: ‘వారు నలుగురు ఆదివాసి అమ్మాయిలు. వారికి 14 నుంచి 16 ఏళ్లు ఉంటాయి. వారి మణికట్లపై, రొమ్ములపై ఎలక్ట్రిక్ షాకులిచ్చిన గుర్తులున్నాయి. ఆ గుర్తులను చూసిన నేను భయకంపితురాలయ్యాను. ఎందుకు ఈ పోలీసులు మైనర్ బాలికలపై థర్డ్ డిగ్రీ హింసను ప్రయోగిస్తారని ఆందోళనకు గురయ్యాను’ అంటూ గత నెల ఏప్రిల్ 26వ తేదీన ఫేస్బుక్లో వర్షా డోగ్రి చేసిన కామెంట్ అప్పడు సంచలనం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జైలు డిప్యూటి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల వర్షా డోంగ్రే మాత్రం కామెంట్ చేసినందుకు ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. ఆ తర్వాత ఇక్కడికి 350 కిలోమీటర్ల దూరంలోని అంబికాపూర్ జైలుకు ఆమెను బదిలీ చేశారు. ఆమె 1964 నాటి కేంద్ర పౌర సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ జైళ్ల డైరెక్టర్ జనరల్ గధారి నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాను అధికార రహస్యాలనో, ప్రభుత్వ డాక్యుమెంట్లనో బయట పెడితే సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లుగాని, తన కళ్లారా చూసిన చిత్రహింసల తాలూకు గుర్తుల గురించి ఫేస్బుక్లో కామెంట్ చేస్తే శిక్ష ఎలా విధిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరులందరితో పాటు తనకూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని ఆమె వాదిస్తున్నారు. మావోయిస్టుల కేసులకు సంబంధించి ఆదివాసి ఆడపిల్లలను అరెస్ట్ చేయడం, వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఇలా దారుణంగా హింసించడం భద్రతా దళాల దృష్టిలో మామూలు విషయంగా మారిందని ఆమె చెబుతున్నారు. 2008 నుంచి 2010 మధ్య జగదల్పూర్ జైల్లో మహిళా ఖైదీల ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు వర్షాకు ఈ ఆదివాసి పిల్లలను ఎలా పోలీసులు హింసిస్తారో తెల్సింది. ‘2010లో ఓ రోజు జైల్లో మహిళా ఖైదీల గదులను తనిఖీ చేస్తున్నప్పుడు ఓ గదిలో నలుగురు ఆదివాసి బాలికలు కనిపించారు. వారు విపరీతంగా భయంతో వణకిపోతున్నారు. నోరు విప్పి ఏం జరిగిందో చెప్పడానికి కూడా వారికి మాట రావడం లేదు. వారు నలుగురు తమ మణికట్లను చూపిస్తే చూడగా ఒక్కొక్కరి చేతులపై తొమ్మిది, పదిసార్లు కరెంట్ షాకులిచ్చిన గుర్తులు కనిపించాయి. వారి రొమ్ములపై ఏడెనిమిది కరెంట్ షాకులిచ్చిన గుర్తులున్నాయి. వెంటనే జైలు డాక్టర్‌ను పిలిపించి ఆ గుర్తులను నమోదు చేసి వారికి చికిత్స అందించాల్సిందిగా సూచించాను. ఇంకా అప్పటికీ జైలుకొచ్చిన ఖైదీల మెడికల్ రికార్డును నమోదు చేయాలనే నిబంధన అమల్లోకి రాలేదు (జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశం మేరకు ఖైదీల మెడికల్ రికార్డును తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన 2010, మే నెల నుంచి అమల్లోకి వచ్చింది). ఆ మరుసటి రోజు డ్యూటీకి వచ్చేసరికి ఆ గిరిజన బాలికలు జైల్లో లేరు. బెయిల్‌పై విడుదలయ్యారని సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత పని ఒత్తిడిలో ఆ బాలికల పరిస్థితి గురించి నేను పట్టించుకోలేదు’ అని వర్షా మీడియాకు వివరించారు. అందరిలా అన్యాయాలను చూస్తూ తలవంచుకుపోయే తత్వం కాదు వర్షాది. ఆమెది పోరాడేతత్వం. 2006లో జరిగిన పోలీసుల నియామకాల్లో అన్యాయాలు, అక్రమాలు జరిగాయని, దాని వల్ల తాను కూడా నష్టపోవాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోకపోతే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపించమని కోరారు. అందుకు ఆయన కోపగించుకొని గార్డులను పిలిపించి బయటకు పంపించారు. అయినప్పటికీ ఆమె నిరుత్సాహపడకుండా కోర్టుకెక్కి పోరాటం కొనసాగించారు. దాదాపు పదేళ్ల అనంతరం రాష్ట్ర హైకోర్టు ఇటీవల వర్షా తరఫున తీర్పు చెప్పింది. ఆ నాటి పోలీసు అధికారుల నియామకాలపై సమగ్ర విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద వర్షా డోగ్రికి ఐదులక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 26వ తేదీన ఫేస్బుక్లో వర్షా చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ప్రముఖ సామాజిక కార్యకర్త హిమాంషు కుమార్ ఆమె పోస్ట్‌ను షేర్ చేస్తూ దానికి కొన్ని ఫొటోలను కూడా జోడించడంతో పోలీసు అధికారులకు కోపం వచ్చింది. వివరణ ఇవ్వాలంటూ 36 పేజీల నోటీసును వర్షాకు పంపారు. తాను చేసిన పోస్ట్‌కు బాధ్యత వహిస్తానని, ఇతరులు చేసిన పోస్ట్‌కు తాను బాధ్యత వహించలేనంటూ ఆమె సమాధానం ఇచ్చారు. ఎలాంటి చార్జిషీటు దాఖలు చేయకుండానే ఆమెను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. ('దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను') -
'దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను'
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఆ రాష్ట్రానికే చెందిన ఓ ప్రభుత్వాధికారిణి ఎండగట్టింది. నక్సల్ సమస్యను చూపుతూ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ రాయ్‌పూర్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ వర్షా డొంగ్రే చేసిన ఫేస్బుక్ పోస్టు సంచలనం సృష్టించింది. ఛత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీలపై సాయుధబలగాల ప్రయోగానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వ అధికారి గళం విప్పడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 24వ తేదీన సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్ దాడి తర్వాత ఆమె ఈ పోస్టు చేశారు. హిందీలో సాగిన ఆమె పోస్టులో ఏముందంటే.. ‘అందరూ ఒకసారి ఆత్మపరిశోధన చేసుకుంటే నిజం నిగ్గు తేలుతుందని నమ్ముతాను. నక్సల్ పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నక్సల్స్, జవాన్లు ఇద్దరూ.. భారతీయులే. వీరిలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినా దేశం మొత్తం బాధపడుతుంది. ఆదివాసి ప్రాంతాల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని భూమిని సొంతం చేసుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టేందుకు వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గ్రామాలను తగలబెడుతున్నారు. ఆదివాసి మహిళలను మానభంగం చేస్తున్నారు. పులుల ప్రాజెక్టుల పేరుతో రాజ్యాంగంలో ఐదో షెడ్యూలు ఆదివాసీలను తమ భూముల నుంచి పంపించడాన్ని నిరోధిస్తున్నా.. దాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. నక్సలిజాన్ని రూపుమాపుతున్నామనే పేరుతో అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే ఖనిజసంపద కోసం.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, తమ సొంతగూటిని వదులుకునేందుకు ఇష్టపడని అడవిబిడ్డలు ఆ ప్రాంతాన్ని వదిలేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వ బలగాల దాష్టీకానికి బలవుతున్నారు. నక్సలిజం అంతరించిపో్వాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. కానీ, పోలీసు బలగాల చేతుల్లో నలిగిపోతున్న తమ కూతుళ్లను, కాలిపోతున్న తమ గుడిసెలను కాపాడుకోలేకపోతున్నారు. నిరక్షరాస్యత వల్ల తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు ఎవరు న్యాయం చేస్తారు?. సీబీఐ, సుప్రీం కోర్టులు ఆదివాసీలపై జరగుతున్న అఘాయిత్యాల గురించి వ్యాఖ్యానిస్తాయంతే. ఇంకా ఎవరైనా మానవహక్కుల కార్యకర్తో లేక ఓ విలేకరో సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. ఆదివాసీ ప్రాంతాల్లో అంతా బావుంటే.. ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది?. నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్లేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదు. 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను. ఒకరిని హింసించేందుకు మన రాజ్యాంగం ఒప్పుకోదు. రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు (రాజ్యాంగంలోని ఐదు షెడ్యూలు పంచాయితీ రాజ్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్డ్ ఏరియా-1996ను తెలుపుతుంది. దీన్ని రాష్ట్రపతి సూచించిన ప్రాంతాల్లో అమలు చేస్తారు) ను వెంటనే అమలు చేయాలి. ఆదివాసీలు ప్రకృతిలో ఒక భాగం. మనం ప్రకృతిని సంరక్షించాలే తప్ప నాశనం చేయకూడదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ రెండు పార్శ్వాలను అర్ధం చేసుకోవాలి. రైతులు, జవానులు సోదరులు లాంటి వారు. వీరు ఇరువురు ఒకరినొకరు చంపుకోవడం అభివృద్ధికి, శాంతికి ఆటకం కలుగజేయడమే. రాజ్యాంగం అందరికీ కోసం. అందరికీ న్యాయం జరగాలి. నేను కూడా వ్యవస్ధ బాధితురాలినే. కానీ, అన్యాయాన్ని ఎదిరించి నిలిచాను. కుట్రలతో నన్ను బలిపశువును చేయాలని చూశారు. నాకు లంచాలు ఇవ్వజూపారు. కానీ, నిజమే గెలిచింది. మనకు ఇంకా సమయం ఉంది. సత్యం వైపు మనం నిలబడకపోతే.. పెట్టుబడీదారులు మన దేశం నుంచి మానవత్వాన్ని నశింపజేస్తారు. అన్యాయం ఎక్కడ జరిగినా సహించనని మనకు మనమే మాట ఇచ్చుకుందాం. రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత్ వర్ధిల్లాలి.’ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమకాల్లో అవినీతి జరిగిందని 2006లో వర్షా ఛత్తీస్‌గఢ్ కోర్టులో కేసు వేశారు. కేసులో నెగ్గిన తర్వాత ఆమె డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఫేస్బుక్లో పోస్టు చేసిన కొద్దిరోజుల తర్వాత ఆమె దాన్ని తొలగించారు. కాగా, వర్షా పోస్టుపై స్పందించిన రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ కేకే గుప్తా.. వర్షాను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె పోస్టుపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. వర్షా ఆ పోస్టును రాశారా? లేదా? అనే విషయంపై విచారణ జరుగుతుందని తెలిపారు. దీనిపై వర్షా వాయిస్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.