breaking news
Valmidi
-
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
ఆ 6 ఊళ్లకు పర్యాటక శోభ
- బమ్మెర, పాలకుర్తి, ఖిలా షాపూర్, జఫర్గడ్, పెంబర్తి, వల్మిడితో ప్రత్యేక ప్రాజెక్టు - ఫైలుపై సీఎం సంతకం.. తొలి దశలో రూ.40 కోట్లతో అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: మహాకవి బమ్మెర పోతనది వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట అని కొందరు చేస్తున్న ప్రచారం తప్పని నిరూపించి, పూర్వపు ఓరుగల్లు జిల్లా బమ్మెరకు చెందిన వ్యక్తిగా ప్రపంచం ముందు నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జనగామ జిల్లా పరిధిలో ఉన్న బమ్మెర గ్రామంలోనే ఆయన జన్మించి, తెలంగాణ గడ్డపై మహాకవిగా చెరగని ముద్రవేసుకున్నా డని చాటబోతోంది. ఇందుకు ఉన్న సాక్ష్యాలను కళ్లముందు ఉంచటంతోపాటు ఆ మహాకవి తిరగాడిన బమ్మెర గడ్డను అభివృద్ధి చేసి పర్యాటక శోభ అద్దనుంది. అలాగే ఆదరణ కోల్పోతున్న పెంబర్తి హస్తకళలకు ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించాలని సంకల్పించింది. పర్యాటకులు స్వయంగా వచ్చి హస్త కళాకారుల నైపుణ్యాన్ని పరిశీలించేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతోంది. ఈ పర్యాటక ప్రాజెక్టులో మొత్తం ఆరు చారిత్రక గ్రామాలను చేర్చారు. బమ్మెర, పెంబర్తి, ఖిలా షాపూర్, జఫర్గడ్, వల్మిడి, పాలకుర్తి ఇందులో ఉన్నాయి. తొలి విడతలో ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల బమ్మెర గ్రామ పర్యటనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే. సంబంధిత ఫైలుపై బుధవారం ఆయన సంతకం చేశారు. ఈ ఆరు గ్రామాల అభివృద్ధి పనులకు పర్యాటక శాఖ త్వరలో శ్రీకారం చుట్టనుంది. బమ్మెర: పోతన నడయాడిన నేల భాగవతాన్ని తేట తెలుగులో మనకందిం చిన పోతన జీవించిన నేల బమ్మెరలో ఆయన సమాధి ఉంది. ఆయన సాగు చేసినట్టుగా చెప్తున్న పొలాలు, దిగుడుబావి పోతన మడ్లు గా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని సుంద రంగా మార్చి పోతన జీవిత చరిత్రను మ్యూజి యం రూపంలో అందుబాటులోకి తెస్తారు. ఆయన జీవిత విశేషాలు, ఆధారాలను పొందుపరుస్తారు. ఇక్కడి త్రికూటాలయాన్ని అభివృద్ధి చేస్తారు. రింగురోడ్డు నిర్మిస్తారు. జఫర్గడ్: చరిత్రకు సజీవ సాక్షం రాష్ట్రకూటుల సామంతుడు శంకరగండడు నిర్మించిన నరసింహస్వామి దేవాలయం ఈ గ్రామ ప్రత్యేకత. దానికి సంబంధించి కోనేరుపై శాసనం చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. గుట్ట మీద ఈ ఆలయం, దిగువన త్రికూటాలయం, గంటల గుడి– దాని ఎదుట ఒకప్పుడు గంటలు వేలాడిన 30 అడుగున రాతి స్తంభం ఆకట్టుకుంటాయి. కుతుబ్‌షాహీలకు సామంతుడిగా ఉండి స్వతంత్రుడిగా ప్రకటించుకునే ఆలోచనతో జాఫరుద్దౌలా మూడు దర్వాజాలతో నిర్మించి న భారీ కోట, ఫిరంగులు అప్పటి చరిత్రను కళ్లకు కడుతున్నాయి. గుట్ట చుట్టు రోడ్డు, ఆలయాల వద్ద పర్యాటకులకు వసతులు, లాన్లు, రెస్టారెంట్లు నిర్మిస్తారు. కోట దర్వాజాలను బాగు చేసి సుందరీకరిస్తారు. ఖిలా షాపూర్: సర్వాయి పాపన్న పరాక్రమానికి సాక్ష్యం అత్యంత బలమైన మొగల్ సామ్రాజ్యాన్ని గెరిల్లా పోరాట పటిమతో ముప్పుతిప్పలు పెట్టి సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న సొంతూరు ఖిలా షాపూర్. నేటికీ నిలిచి ఉన్న గడీలు, బురుజులను అభివృద్ధి చేస్తారు. పెంబర్తి: హస్తకళల కాణాచి పెంబర్తి అనగానే లోహపు రేకులపై కళాకృ తులు గుర్తొస్తాయి. రేకులపై నగిషీలు చెక్కి అందంగా తీర్చిదిద్దటంలో పెంబర్తి కళాకారు లది అందెవేసిన చేయి. వారు రూపొందించిన కళాకృతులకు విదేశాల్లో మం చి డిమాండ్ ఉంది. ఆ కళాకారులకు పూర్వపు ఆదరణను పునరుద్ధరించేందుకు పర్యాట కులే ఆ ప్రాంతానికి తరలివచ్చేలా ఏర్పా ట్లు చేస్తారు. ఇందుకోసం అక్కడ కల్చర ల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. సరైన వసతు లు కూడా లేని ఇరుకు ఇళ్లలోనే కళాకారులు వస్తువులను రూపొందిస్తు న్న తీరును మార్చి వారికి ప్రత్యేక వేదికలు సిద్ధం చేస్తారు. పాలకుర్తి: సోమనాథకవి పెరిగిన ప్రాంతం బసవపురాణం, బసవ శతకం రచించిన కవి సోమనాథుని స్వగ్రామం. 12వ శతాబ్దంలో నిర్మించిన సోమేశ్వరాలయం అద్భుతంగా ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేయటంతో పాటు భక్తులు, పర్యాటకులకు వసతులు కల్పిస్తారు. వల్మిడి: నాటి వాల్మీక పురమేనట రామాయణాన్ని రాసిన వాల్మీకి ఈ ప్రాంతానికి చెందినవాడనే ప్రచారముంది. సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది ఇక్కడేనంటా రు. రాములవారితో లవకుశుల పోరాటం జరిగినట్టు గుట్టల్లో ఆధారాలున్నాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది. దీనికి గుర్తుగానా అన్నట్టు గుట్టపై నిర్మించిన రామాలయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ గుట్టను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మారుస్తారు.