breaking news
vallabhai patel
-
నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు
అహ్మదాబాద్: స్వాతంత్య్రానంతరం కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చేసింది తప్పనీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది సరైనదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి ప్రధాని మోదీ అలనాటి చారిత్రక తప్పిదాన్ని సరిచేశారన్నారు. ఆర్టికల్ 370 విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభినందించాయన్నారు. భారత్ చర్యని బ్రిటన్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లు అభినందించాయని గుర్తుచేశారు. చివరకు చైనా సైతం భారత్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించలేకపోయిందన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటన్నది ఇప్పటి వరకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారీ బహిరంగ సభ ఏర్పాటుపై చేసిన ప్రకటన పట్ల స్పందిస్తూ ముందు ఆ ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజల ప్రజాస్వామిక హక్కులను గురించి మాట్లాడాలని పాక్ ప్రధానికి సూచించారు. పాక్ఆక్రమిత కశ్మీర్లో నివసిస్తోన్న ప్రజలకు నిజంగా ప్రజాస్వామిక హక్కులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించారా? అని ఇమ్రాన్‌ను ప్రశ్నించారు. -
మాట తప్పిన కేసీఆర్: దత్తాత్రేయ
రామంతాపూర్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత ఆ మాటే మరిచారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం రామంతాపూర్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహావిష్కరణ, తిరంగా యాత్ర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విమోచన దినంపై మాట తప్పిన కేసీఆర్‌కు విద్యార్థులు ఉత్తరాలు రాసి జ్ఞానోదయం కలిగించాలన్నారు. సెప్టెంబర్ 17, 1948లో పటేల్ ఆధ్వర్యంలో భారతసైన్యం నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి కలిగించిందన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఎమ్మెల్యే ప్రభాకర్ తిరంగ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజల్లో జాతీయ భావాన్ని, ఐక్యతను పెంపొందించేందుకే యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. సత్తర్ సాల్ కీ ఆజాదీ, యాద్‌కరో ఖుర్బానీ నినాదంతో ప్రజలు ముందుకు సాగాలన్నారు. అనంతరం దత్తాత్రేయ, డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పటేల్ విగ్రహాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తిరంగయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో గంగాధర్‌శాస్త్రి, సోమ్ల నాయక్, జాజుల గౌరి, గాయకుడు రామాచారి, కీర్తిశేషులు కెప్టెన్ వీరారాజిరెడ్డి తండ్రి కొండల్‌రెడ్డి, దీపిక జగన్యాదవ్, పాల్గొన్నారు.