‘వజ్ర’గా మినీ ఏసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ త్వరలో ప్రవేశపెట్టనున్న ఏసీ మినీ బస్సు సర్వీసు పేరును ‘వజ్ర’గా ఖాయం చేశారు. దీపావళి నాటికి ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్-వరంగల్, నిజామాబాద్ మధ్య నడిచే ఈ బస్సులు బస్టాండ్లలో కాకుండా ఆయా కాలనీలకు చేరువగా ఉండే పాయింట్ల వద్దకే వస్తాయి. ఒకేచోట ఎక్కువ మంది ప్రయాణికులుంటే ఆ ప్రాంతానికి కూడా వస్తాయి.
టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు రూ.350, హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ.300 చొప్పున ధరలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వరంగల్‌కు 4 రూట్లలో, నిజామాబాద్‌కు 3 రూట్లలో నడిచే ఈ బస్సుల కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో 150 బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సీట్లు అందుబాటులో ఉంటే బస్సు బయల్దేరడానికి అరగంట ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. సమాచారాన్ని వెంటనే ప్రయాణికుల ఫోన్‌కు చేరవేస్తామని, 45 ఏళ్లలోపు వయసున్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి అన్ని అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. వాలెట్ విధానంలో డబ్బు డిపాజిట్ చేస్తే సాధారణ ఫోన్ నుంచి కూడా బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.