breaking news
The Vaccine War Movie
-
ఓటీటీకి వివేక్ అగ్నిహోత్రి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అదే జోరుతో వివేక్ ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొవిడ్ టైంలో వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 24న తేదీ నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దక్షిణాది భాషల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్‌ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్‌ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్‌గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్‌లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్‌లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్‌కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్‌తో వచ్చే సీన్లు అంతగా హైలెట్‌గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్‌గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్‌పై నెగిటివ్ ఇమేజ్‌ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్‌గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్‌గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: స్టార్ డైరెక్టర్
డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఉన్నదంతా ఒకటే టెన్షన్. 'సలార్' ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇలాంటి టైంలో డార్లింగ్ అభిమానులపై ఓ స్టార్ డైరెక్టర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. తనని వాళ్లు బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా దర్శకుడు? ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తీసిన సినిమా 'సలార్'. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ శుక్రవారం.. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ లేట్ కావడం వల్ల వాయిదా పడింది. అదే రోజున 'ద వ్యాక్సిన్ వార్' అనే హిందీ సినిమా రిలీజ్ అవుతోంది. కనీసం ఇది వస్తున్నట్లు ఎవరికీ తెలియట్లేదు. పట్టించుకోవట్లేదు కూడా. దీంతో ఈ చిత్ర డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటా! పిచ్చి కామెంట్స్‌తో హైప్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. (ఇదీ చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. అసలు నిజమేంటి?) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని, తన కూతురిపైనా అసభ్యకర రీతిలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. గతంలో ఇదే దర్శకుడు.. ప్రభాస్‌కి అస్సలు యాక్టింగే రాదని, సలార్ టీజర్ చెత్తలా ఉందని పిచ్చి కూతలు కూశాడు. 'సలార్' పోటీగా తమ సినిమా రిలీజ్ చేస్తున్నామని, భయపడేది లేదని అన్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి మండింది. ఆ ఊపులోనే డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిపై ట్రోల్ చేసినట్లు ఉన్నారు. దాన్ని ఇన్ని రోజులు బయటపెట్టకుండా.. తన సినిమాకు హైప్ లేకపోయేసరికి ఇప్పుడు చెబుతున్నాడు. తన మూవీ రిలీజ్‌కి మరో రెండు రోజుల ఉందనగా చెప్పడం విడ్డూరంగా అనిపించింది. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు.. 'ద వ్యాక్సిన్ వార్'తో ఏం చేస్తాడనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుందిలే! అలానే ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ చెడగొట్టేందుకు ఈ దర్శకుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడా అనే డౌట్ కూడా వస్తోంది. (ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!) -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటించారు. పల్లవి జోషి నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి బయో–సైన్స్ చిత్రమిది. కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ‘వ్యాక్సిన్ వార్’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది.