V R Krishna Iyer
-
వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు పూర్తి
కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. కేరళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఇద్దరు కుమారులు కర్మకాండ నిర్వహించారు. తర్వాత శవదహనశాలలో ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. కేరళ మంత్రి కే బాబు ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు కృష్ణయ్యర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఒమన్ చాంది, మంత్రులు కేఎం మణి, కే బాబు, కేపీ మోహనన్, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి. రవీంద్రన్, క్రైస్తవ మత పెద్దలు శ్రద్ధాంజలి ఘటించారు. -
వీఆర్ కృష్ణ అయ్యర్ ఇక లేరు
కోచి: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, విఖ్యాత న్యాయనిపుణుడు వీఆర్ కృష్ణ అయ్యర్(100) కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణ అయ్యర్ 1957-59 వరకూ మంత్రిగా పనిచేశారు. అంతేకాక న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయ్యర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ నాయకుడిగా సేవలందించిన ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైనారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్‌తో గౌరవించింది. -
మోడీ మంచి ప్రధాని అభ్యర్థి: అయ్యర్
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నరేంద్ర మోడీకి ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ మద్దతు ప్రకటించారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ తగినవారని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 'నమో' విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయత, సౌహార్థం వంటి సానుకూల లక్షణాలు మోడీకి ఉన్నాయని తెలిపారు. మనదేశానికి అణు విద్యుత్ అవసరం లేదని అయ్యర్ అభిప్రాయపడ్డారు. సోలార్ విద్యుత్‌ను సవ్యంగా వినియోగించుకుంటే చాలని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్‌కు మోడీ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. గుజరాత్ స్థాయిలో మరే రాష్ట్రం కూడా సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవడం లేదని తెలిపారు. అవినీతి నిర్మూలనకు గుజరాత్లో నరేంద్ర మోడీ చేసిన కృషిని అయ్యర్ ప్రశంసించారు.