breaking news
Uttarakhand Forest Fire
-
అగ్గి ఎందుకింతగా రాజుకుంటోంది?
న్యూఢిల్లీ: మున్నెన్నడు లేని విధంగా ఉత్తరాది పర్వత రాష్ట్రాల్లో అడవులు తగులబడి పోతున్నాయి. ఇతర రాష్ట్రాలలోనూ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఢిల్లీ నగరంలో ఒక్క ఏప్రిల్ మాసంలోనే గతేడాదితో పోలిస్తే అగ్ని ప్రమాదాల సంఖ్య ఏకంగా 500 శాతం పెరిగింది. ఏప్రిల్ 26వ తేదీన నేచురల్ హిస్టరీకి సంబంధించిన నేషనల్ మ్యూజియంలో అగ్ని ప్రమాదం సంభవించి అపార నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనే కాకుండా కశ్మీర్లో కూడా అడువులు ఎక్కువగా ఎందుకు తగలబడి పోతున్నాయి? 2013లో అడవులు తగులబడిన సంఘటనలు 18, 451 రికార్డుకాగా, 2014లో 19,054, 2015లో 15,937 సంఘటనలు చోటుచేసుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీ నాటికే 20,667 సంఘటనలు రికార్డయ్యాయి. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఇతర అగ్ని ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా వందలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వారమే అడవుల్లో రేగిన కార్చిచ్చువల్ల సాంస్కతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. బీహార్‌లోని ఆరు గ్రామాల్లో ఈ మూడు నెలల కాలంలో సంభవించిన అగ్ని ప్రమాదాల్లో 66 మంది మరణించగా, 1200 జంతువులు మరణించాయి. ఈ కారణంగానే బీహార్ ప్రభుత్వం ఉదయం తొమ్మిది తర్వాత సాయంత్రం ఆరు లోపల పొయ్యి వెలిగించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ఇంతలా అగ్ని ప్రమాదాలు సంభవించడానికి కారణాలేమిటి? అధికారులు ఫైర్ ట్రయాంగిల్‌గా పిలిచే ఆక్సిజన్, ఇంధనం, వేడి కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఆక్సిజన్, ఇంధనం అన్ని కాలాల్లో అందుబాటులో ఉండేవే. వేడి మాత్రం ఎండాకాలంలోనే ఉంటుంది. ఈ సారి వివిధ రాష్ట్రాల్లో 42 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా వేడి గాలులు కూడా తీవ్రంగా వీచడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేశంలో నెలకొన్ని కరవు పరిస్థితులు కూడా మంటల వేగంగా వ్యాపించేందుకు దోహదపడుతున్నాయి. అడువుల్లో, ప్రజల పరిసర ప్రాంతాల వాతావరణంలో తేమ ఎక్కువగా లేక పోవడం వల్ల అగ్ని ప్రమాదాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అడువుల్లోగానీ, గ్రామాల్లో గానీ అగ్ని ప్రమాదాలు వాటంతట అవ్వే సంభవించవని, అటవి ప్రాంతాల్లో గూడెం ప్రజల వంటింటి నుంచి రేగిన నిప్పు రవ్వ కారణంగాగానీ, అటవి ప్రాంతాల్లో ఎవరైన సిగరెట్ తాగి దాన్ని ఆర్పకుండా పారిసినాగానీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని గాంధీనగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ సంస్థలో వాటర్ అండ్ క్లైమేట్ లాబరేటరీలో సైంటిస్టుగా పని చేస్తున్న విమల్ మిశ్రా తెలియజేశారు. రైతులు పొలాల్లో వరి, గోధుమ దుబ్బను తగులబెట్టడం కూడా అగ్ని ప్రమాదాలకు దారితీస్తోందని ఆయన తెలిపారు. అటవి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ అగ్ని ప్రమాదానికైన నిప్పురవ్వే కారణం అవుతుందని ఉత్తరాఖండ్ ఫైర్ సర్వీసెస్ ఇనిస్పెక్టర్ జనరల్ జీసీ పంత్ చెప్పారు. ఇక పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాటిని పరిసరాల్లో ఉన్న పొడి వాతావరణం తోడవడంతో అగ్ని కీలలు వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కరెంట్ వైర్లపై లోడ్ ఎక్కువగా వేయడం వల్ల, పాలిమర్‌తో తయారు చేసిన వైర్లను ఉపయోగించడం వల్ల అవి వేడికి కరిగి షార్ట్ సర్క్యూట్‌కు కారణం అవుతున్నాయి. -
కార్చిచ్చుపై హెలికాప్టర్లతో నీళ్లు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును మూడు, నాలుగు రోజుల్లో పూర్తిగా అదుపు చేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దావానలంను పూర్తిగా ఆర్పివేసేందుకు 10 వేల మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఆర్డీ, అటవీ శాఖ సిబ్బందితో పాటు హోం గార్డులు శ్రమిస్తున్నారని చెప్పారు. పీఎంఓ, ఎన్డీఆర్ఎఫ్, ఐఏఎఫ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు. కాగా, స్థానిక అధికారులతో టచ్ లో ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరాఖండ్ గవర్నర్ తో కూడా మాట్లాడానని చెప్పారు. మంటలు అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తమ అధికారులు చర్చలు జరిపారని వెల్లడించారు. ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు కలిసికట్టుగా మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఐదు జిల్లాల్లోని 2270 హెక్టార్లలో అడవులకు మంటలు వ్యాపించాయి. వీటిని అదుపు చేసేందుకు ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లతో ప్రయత్నిస్తున్నాయి. మూడు ఎంఐ 17 హెలికాప్టర్లతో నైనిటాల్, పౌరీ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వేల లీటర్ల నీళ్లు గుమ్మరించి మంటల్ని కొంతమేర అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం భీమ్టల్ సరస్సు, శ్రీనగర్ ఆన కట్ట నీటిని వినియోగించారు. ఆదివారం రోజంతా తీవ్రంగా శ్రమించి 75 శాతం మంటలను ఆర్పివేశామని అధికారులు తెలిపారు.