breaking news
UPA -2
-
రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
యూపీఏ- 2 హయాంలో హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రిటైర్మెంట్ ప్రకటించారు. తన బదులు తన కుమార్తె ప్రణితి షిండే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. సుశీల్ కుమార్ శంభాజీ షిండే 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షిండే కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. 2003లో తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2006 వరకు ఈ పదవిలో కొనసాగారు. సుశీల్ కుమార్ షిండే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. 2014 వరకు ఈ పదవిలో ఉన్నారు. 1971లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో క్రియాశీల రాజకీయాల్లో షిండే కెరీర్ ప్రారంభమైంది. 1974 నుండి 1992 వరకు మహారాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఉన్నారు. 1992 నుండి మార్చి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రచార నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహించారు. షిండే రిటైర్మెంట్ ప్రకటనతో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి సంప్రదాయ సీటు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్నారు. ఈసారి షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని ప్రణితి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: డబుల్ ఇంజిన్ సర్కారులో డబుల్ అనారోగ్యం: ఖర్గే -
మెరుపులు.. మరకలు..
‘అచ్ఛేదిన్’(మంచి రోజులు) వచ్చేశాయా? ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరినీ కలుపుకొని అందరి అభ్యుదయం కోసం) అనే నినాదం అమలు జరుగుతోందా? నరేంద్రమోదీ ఉపన్యాస కేసరేనా, కార్యశూరుడు కూడానా? అంతకు ముందు సమాజం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజల బతుకులు బాగుపడినాయా? ‘న ఖావూంగా, న ఖానేదూంగా’(తిననూ, తిననివ్వనూ) అంటూ మోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన భీకర ప్రతిజ్ఞ మాటలకే పరిమితమైనదా? చేతలలో ఏమైనా కనిపించిందా? శాంతిభద్రతలు మెరుగైనాయా, క్షీణిం చాయా? నల్లధనం ప్రభావం తగ్గిపోయిందా? అన్నట్టు, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వాపసు తీసుకొని వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షల వంతున జమచేశారా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవలసిన సందర్భం ఇది. మోదీ ప్రధానిగా 2014 మే 26న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చగలిగారో, ఎన్ని అమలు చేయలేకపోయారో సమీక్షించుకోవలసిన సమయం. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశించారు కనుక మోదీ వాగ్దానం చేసినట్టు ప్రజ లకు నివేదించడానికి సాఫల్యవైఫల్యాల పట్టికను సిద్ధం చేసుకోవాలి. మోదీ సాధించిన విజయాలు ఏమిటి? ఆయనకు ఎదురైన అపజయాలు ఏమిటి? ప్రయత్నించి విఫలమైనవి ఎన్ని? అసలు ప్రయత్నం కూడా చేయని శుష్కవాగ్దానాలు ఎన్ని? సమీక్షాసమయం నాలుగేళ్ళ ఎన్డీఏ పాలనపైన కొన్ని రోజులుగా వార్తాపత్రికలలో, టీవీ న్యూస్ చానళ్ళలో చర్చ జరుగుతోంది. అద్భుతమైన విజయాలంటూ ఆకాశానికి ఎత్తేవారూ, దారుణమైన వైఫల్యాలు అంటూ తీసిపారేసేవారూ కనిపించారు. సహేతుకంగా, బాధ్యతాయుతంగా వక్రీకరించని వాస్తవాలు మాత్రమే మాట్లాడేవారి సంఖ్య తక్కువ. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశం నాలుగు చెరగులా అత్యంత ప్రభావవంతమైన ప్రచారం చేసి లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత మోదీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన అంశాలలో ప్రధానమైనది సుస్థిర ప్రభుత్వం, పారదర్శక పరిపాలన అందించడం. అవినీతి ఆరోపణలు లేకుండా కేంద్ర ప్రభు త్వం నిలబడటం కూడా విశేషమే. 2004 నుంచి 2009 వరకూ మన్మోహన్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంపైన కూడా చెప్పుకోవలసిన అవినీతి ఆరోపణలు లేవు. 2009–2014లో కుంభకోణాలు ఒకదాని వెంట ఒకటి వెలుగులోకి వచ్చి యూపీఏ–2ని భ్రష్టుపట్టించి బీజేపీ విజయానికి సోపానాలైనాయి. ఆర్థికంగా అద్భుతాలు సాధించకపోయినా మోదీ హయాంలో ప్రగతి కుంటుబడలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరుగుదల 7.5 శాతం. అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇంతవరకు ఏ ప్రధానీ పర్యటించనన్ని దేశాలను మోదీ నాలుగేళ్ళలో చుట్టివచ్చారు. విదేశాలలో స్థిరబడిన భారతీయులను ఉద్దేశించి (న్యూయార్క్ స్క్వేర్ వగైరాలు) ప్రసంగించడం ద్వారా కొత్తరకం దౌత్యనీతిని ఆరంభిం చారు. అంతర్జాతీయరంగంలో భారత్ ప్రతిష్ఠ పెరిగిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికపైన మోదీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం, అగ్రశ్రేణి ప్రపంచ నాయకులకు సమఉజ్జీగా కనిపించడం, వారిని ఆలింగనం చేసుకోవడం చూస్తున్నాం. అయితే, క్షేత్రంలో మాత్రం గుణాత్మకమైన మార్పులు కనిపించడం లేదు. చైనాతో సంబంధాలు వృద్ధి చెందకపోగా క్షీణించాయి. చైనాకు ఒక్క భారత్‌తోనే సరిహద్దు వివాదాలు ఉన్నాయి. రష్యా, వియత్నాం, తదితర దేశాలతో సమస్యలు పరిష్కరించుకున్నది. భారత్‌తో విరోధం కొనసాగిస్తున్న పాకిస్తాన్‌కు అన్నివేళలా సైనికంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా అండగా నిలబడుతోంది. భారత్, పాక్‌ల మధ్య విభేదాలను పరిష్కరించడానికి అవసరమైన శక్తి, మధ్యవర్తిత్వం నెరపగలిగిన పెద్దరికం ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్యా పగల కుంపటిని రగిలిస్తున్నదే కానీ ఆర్పివేసే ప్రయత్నం చేయడంలేదు. కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపుతున్న పాకిస్తాన్‌పైన సర్జికల్ స్ట్రయిక్స్ (మెరుపుదాడులు) నిర్వహించామని మోదీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటనలు చేసింది. పాక్ మాత్రం అటువంటి దాడులేవీ జరగలేదని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంమీద పాకిస్తాన్‌కు చైనా దగ్గరైనకొద్దీ ఇండియా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో రక్షణ సంబంధాలు విస్తరించుకుంటున్నది. చైనాతో సఖ్యత ఉంటే ప్రాక్, పశ్చిమ దేశాలతో అంతటి వ్యూహాత్మక స్నేహం ఇండియాకు అక్కర ఉండదు. పొరుగున ఉన్న చైనాతోనూ, పాకిస్తాన్‌తోనూ సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీ తలపెట్టిన గట్టి చర్య అంటూ ఏదీ లేదు. వాజపేయిలాగా విశేషమైన చొరవ, రాజనీతిజ్ఞత మోదీ ప్రదర్శించలేకపోయారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలు మెరుగుపడినట్టు భావించవచ్చు. శుక్రవారం కోల్‌కతా శాంతినికేతన్లో సమావేశమైన బంగ్లా ప్రధాని హసీనా, మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీల మధ్య కని పించిన స్నేహపూరిత వాతావరణమే అందుకు నిదర్శనం. నేపాల్, శ్రీలంకలపైన చైనా ప్రభావాన్ని తగ్గించడంలో మోదీ చెప్పుకోదగిన విజయం సాధించలేకపోయారు. కానీ నెహ్రూ తర్వాత విదేశీ వ్యవహారాలలో అత్యంత ఆసక్తి, చొరవ ప్రదర్శించిన ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలూ జరిగాయి. చాలా రాష్ట్రాలలో బీజేపీ గెలుపొందింది. స్పష్టమైన మెజారిటీ రాని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పాగా వేసింది. కర్ణాటకలో సైతం అతిపెద్ద పార్టీగా అవతరించింది. సర్వేలు ఏమంటున్నాయి? ప్రస్తుతం దేశప్రజల నాడి ఎట్లా ఉన్నదో కనుక్కోవడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లోని తొమ్మిది సంస్థలు కలసి మెగా టైమ్స్ ఆన్లైన్ సర్వే చేశాయి. జనహృదయం ఏమంటున్నదో తెలుసుకునేందుకు లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వే జరిపింది. రెండు సర్వేల ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అది వేరే విషయం. టైమ్స్ గ్రూప్ సర్వేక్షకులు ప్రశ్నించినవారిలో 73 శాతం మందికి పైగా ఎన్డీఏని 2019లోనూ గెలిపిస్తామని చెప్పారు. మోదీని 71.9 శాతం మంది ఆమోదిస్తున్నారనీ, రాహుల్ నాయకత్వాన్ని కేవలం 11.93 శాతం మంది అపేక్షిస్తున్నారనీ తేల్చింది. లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వే ప్రకారం మోదీకి ఆమోదం రేటు 39 శాతానికి పడిపోయింది. 47 శాతం మంది మోదీని నిర్ద్వం ద్వంగా వ్యతిరేకిస్తున్నారు. 2014లో కేవలం 16 శాతం మంది రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటే ఇప్పుడు అటువంటివారి శాతం 24కి పెరిగింది. కాంగ్రెస్‌కు మద్దతు పెరిగింది. మోదీ ప్రాబల్యం తగ్గుతోందని రాజ కీయ ప్రవీణులందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎక్కువ జనాకర్షణశక్తి కలిగిన నాయకుడు మోదీ అన్న విషయం కూడా నిజమే. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించడానికి మోదీ ప్రచారమే కారణం. మోదీతో, బీజేపీతో సైద్ధాంతిక విభేదాలు కలిగినవారు సైతం కాదనలేని వాస్తవం ఇది. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రప్రథమంగా పార్లమెంటు భవనంలో అడుగుపెడుతున్న సమయంలో మెట్లకు మోదీ ప్రణమిల్లారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం చాటుకున్నారు. కానీ ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి ఆయన చేసింది ఏమీ లేదు. నాలుగేళ్ళ కిందట లోక్‌పాల్ చట్టం చేసినప్పటికీ ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. పార్లమెంటు సమావేశాలలో ప్రతిష్టంభనను పరిష్కరించే అవకాశం ఉన్నా అటువంటి ప్రయత్నమే చేయలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించినా, అలాంటివారికి మంత్రిపదవులు కట్టిపెట్టినా, తెలంగాణ ఎంఎల్ఏని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున టీడీపీ శాసనసభ్యుడు నగదు చెల్లించి కొనుగోలు చేస్తూ పట్టుబడినా, తెలంగాణ ఎంఎల్ఏతో చంద్రబాబు మొబైల్లో మాట్లాడుతూ దొరికిపోయినా ప్రధాని మిన్నకున్నారే కానీ ఆక్షేపించలేదు. ఈ విషయాలు తనకు సంబంధం లేనివి అన్నట్టు వ్యవహరిం చారు. ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్టీ ఫిరాయించారనీ తెలుపుతూ, వారిపైన అనర్హత వేటు వేయాలని అర్థిస్తూ దాఖలు చేసిన అర్జీలు దాదాపు నాలుగేళ్ళుగా సభాపతి సుమిత్రామహాజన్ వద్దనే మగ్గుతున్నాయి. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను యూపీఏ ప్రభుత్వం దుర్విని యోగం చేసినట్టే ఎన్డీఏ సర్కార్ కూడా చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గవర్నర్ల వ్యవస్థను స్వప్రయోజనాలకోసం వాడుకోవడానికి సంకోచించరని చెప్పడానికి తాజా ఉదాహరణ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకై మొదటి అవకాశం బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు ఇవ్వడం, భంగపడటం. అంతకు ముందు గోవా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ మెజారిటీ లేకపోయినా కూటముల సహాయంతో ప్రభుత్వాలు జయప్రదంగా ఏర్పాటు చేయడం. ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకంపైన సుప్రీంకోర్టు కొలేజీయం సిఫార్సులను ఆమోదించకుండా అడ్డుతగలడం. గోరక్షకుల అరాచకాలను అరికట్టకపోవడం. ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్నూ, ఇతర పౌరహక్కుల నాయకులనూ హత్య చేసిన సందర్భాలలోనూ మోదీ మౌనంగా ఉండటం దారుణం. వైఫల్యాలు అనేకం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాలలో చాలా వరకూ నెరవేరకుండానే మిగిలిపోయాయి. ఉద్యోగ కల్పనలో విఫలమైనారు. ధరలు అదుపు చేయలేకపోయారు. పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అవినీతి నిర్మూలనలోనూ చేసింది ఏమీ లేదు. బ్యాంకులకు వేలకోట్లు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు ఉడాయించిన మాల్యాలనూ, నీరవ్మోదీలనూ, లలిత్మోదీలనూ మోదీ ప్రభుత్వం అసమర్థతకు సాక్షులుగా చూపించవచ్చు. నిర్మలా సీతారామన్‌ను రక్షణ మంత్రి చేయడం ప్రశంసనీయమే. అంతమాత్రాన మహిళా సాధికారతకు చేయవలసిందంతా చేసినట్టు కాదు. యూపీఏ హయాంలో 2010 లోనే రాజ్యసభ ఆమోద ముద్ర వేసిన మహిళారిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో మెజారిటీ ఉండి కూడా బీజేపీ ప్రవేశపెట్టలేదు. బీజేపీ పూనుకొని ఉంటే కాంగ్రెస్ కూడా సహకరించేది. బిల్లు చట్టమై 2019 ఎన్నికలలోనే చట్టసభలలో 33 శాతం స్థానాలను మహిళలకు ప్రత్యేకించే అవకాశం ఉండేది. అరాచకశక్తులపైన ఉక్కుపాదం మోపడంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. కూటమి రాజకీయాలకు దేశ ప్రజలు అలవాటు పడ్డారు. ఏదో ఒక జాతీయ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పర్వాలేదు. యూపీఏ సర్కార్ పదేళ్ళు అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వాలను వాజపేయి ఆరేళ్ళకు పైగా నడిపించారు. మోదీ అయిదేళ్ళు పూర్తి చేయబోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో ప్రమేయం లేకుండా ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రస్తుతానికి పగటి కల. రెండు సర్వేలలో ఒక్కటి కూడా ప్రాంతీయ పార్టీలకు 150 స్థానాల కంటే మించి వస్తాయని చెప్పలేదు. ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ప్రాంతీయ పార్టీలకు ఉండదు. బీజేపీని నిరోధించేందుకు కాంగ్రెస్ మద్దతుతో మమతా బెనర్జీనో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)నో గద్దెమీద కూర్చోబెట్టినా అది మూణ్ణాళ్ళ ముచ్చటే. ఈ సంగతి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్, బీజేపీ సహకారంతో ప్రధాని పదవిని సాధించిన వీపీ సింగ్ నిరూపిం చారు. బీజేపీని ఎట్లాగైనా ఓడించాలనే సంకల్పంతో సిద్ధాం తపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి అత్యవసర కూటమి ఏర్పాటు చేయడం అనర్థదాయకం. బీజేపీ భావజాలానికీ, ఆ పార్టీ వెనుక ఉండి నడిపిస్తున్న సంస్థల కార్యాచరణకూ ప్రత్యామ్నాయంగా నిర్మాణాత్మకమైన భావజాలంతో, పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికతో కాంగ్రెస్ సహా భావసారూప్యం కలిగిన ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా అడుగులేస్తే అర్థవంతంగా ఉంటుంది. ఈ పని ఎన్నికలకు ముందే జరిగితే ఓటర్లకు స్పష్టత ఉంటుంది. అప్పుడైనా, ‘సాఫ్ నియత్, సహీ వికాస్’ (స్వచ్ఛమైన సంకల్పం, నిజమైన అభివృద్ధి) అన్న నినాదంతో రంగంలో దిగుతున్న బీజేపీని ఓడించడం సాధ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం బీజేపీ, ప్రతిపక్షాలు వచ్చే ఏడాదిలో వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది. కె. రామచంద్రమూర్తి -
ప్రధాని పీఠానికి మన్మోహన్ వీడ్కోలు
-
పీఎంవోకు ప్రధాని వీడ్కోలు
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మన్మోహన్ 17న కేబినెట్ చివరి భేటీ, రాష్ర్టపతి విందు మన్మోహన్ మంచి వ్యక్తి: అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: యూపీఏ-2 పాలన ముగింపునకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రధాని మన్మోహన్సింగ్ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉండటానికి ఇల్లు వెతుక్కొని పెట్టుకున్న మన్మోహన్.. మంగళవారం తన కార్యాలయ సిబ్బంది నుంచి సెలవు తీసుకున్నారు. ఇంతకాలం తనకు సాయపడినందుకు ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని కార్యాలయంలోని 110 మందికి విడివిడిగా అభినందనలు తెలిపినట్లు అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పరిపాలనా విభాగమైన సౌత్‌బ్లాక్‌లోని 400 మందికిపైగా ఉద్యోగులు మన్మోహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. సౌత్‌బ్లాక్ కారిడార్లకు చేరుకుని చప్పట్లు కొడుతూ ప్రధానికి అభినందనలు తెలిపారు. 2004 నుంచి ప్రధాని మన్మోహన్‌తో అల్లుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా, శనివారం ఆయన తన కేబినెట్ చివరి భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ర్టపతి భవన్ నుంచి వచ్చిన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడుతారు. అదే రోజు తన సహచర మంత్రులకు ప్రధాని తేనీటి విందు ఇస్తారని సమాచారం. ఇక శనివారం రాత్రి రాష్ర్టపతి వారికి విందు ఇవ్వనున్నారు. శుక్రవారమే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిన్నమొన్నటి వరకు రాజకీయంగా ప్రధానిపై కత్తులు దూసిన బీజేపీ అగ్రనేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ మంగళవారం మన్మోహన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. ఏ పని చేసినా అన్ని వివరాలు పక్కాగా తెలుసుకుని సర్వసన్నద్ధమవుతారని జైట్లీ కితాబిచ్చారు. పదేళ్లపాటు ప్రభుత్వానికి నేతృత్వం వహించి ఆయన హుందాగా వెళ్లిపోతున్నారని, అపార అనుభవం గల మన్మోహన్ భవిష్యత్తులోనూ జాతికి మార్గదర్శకంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి వచ్చిందని తన బ్లాగులో పేర్కొన్నారు. విషయ పరిజ్ఞానం, వ్యక్తిగత నిబద్ధతలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా జైట్లీ గుర్తు చేసుకున్నారు. సోనియా విందు: కాంగ్రెస్ కూడా మన్మోహన్పై ప్రశంసల వర్షం కురిపించింది. అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని బృందానికి మంగళవారం వీడ్కోలు విందు ఇచ్చారు. ఏఐసీసీ తరఫున ఆయనకు పార్టీ నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు సంతకం చేసిన ఓ జ్ఞాపికను మన్మోహన్‌కు బహూకరించినట్లు సమాచారం. ప్రస్తుత ప్రధానికి వీడ్కోలు పలకడమంటే మళ్లీ తాము అధికారంలోకి రాబోమన్నట్లు కాదని, మళ్లీ యూపీఏ ప్రభుత్వమే వస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు.