breaking news
untakallu
-
అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!
బొమ్మనహాళ్: ఈ కాలంలో చుక్కేసుకోవడానికి కారణం కావాలా? ఉద్యోగం వచ్చిందని... ప్రమోషన్ వచ్చిందని... పెళ్లాం ఊరెళ్లిందని.. బాబు పుట్టాడని... ఇంకేదీ దొరక్కపోతే.. బుర్ర చెడిందని.. పేరుకే సందర్భం! పెగ్గు వేసుకునేందుకు సాకులు ఎన్నో. ఇక మందు కొట్టేందుకు కూర్చోవడం వరకే వారి పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత కిక్కుతలకెక్కెంత వరకూ మందు కడుపులోకి దిగాల్సిందే. మత్తు నోట్లో తలపెట్టి.. బయటికి రాలేక గిజగిజలాడుతూ ఎన్నో బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. పెళ్లాం మెడలో పుస్తెలు తెంపుకుని తాగినోళ్లు.. పిల్లలను అమ్ముకున్న దౌర్భాగ్యులు.. ఆస్తులు, భూములు అమ్ముకుని రోడ్డున పడ్డ దీనులు.. ఇలా ప్రతి తాగుబోతు వెనుక కథా కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే మత్తు సంకెళ్లను తెంచి.. కొత్త జీవితాన్ని ప్రసాదించే మార్గమూ ఒకటుందని బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వాసులు అంటున్నారు. ఆ మార్గమేమిటో తెలుసుకోవాలంటే ఉంతకల్లును సందర్శించాల్సిందే. ఆంధ్ర పండరీపురంగా.. ఉంతకల్లులో వెలసిన రుక్మిణీపాండురంగస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితంగా ఖ్యాతి గడించింది. ఆంధ్ర పండరీపురంగా ఈ గ్రామాన్ని భక్తులు పిలుస్తుంటారు. మహారాష్ట్రలోని పండరీపురాన్ని తలపించేలా ఇక్కడి పూజాదికాలు నిర్వహిస్తుంటారు. గ్రామంలోని అందరూ పాండురంగ విఠలుడి భక్తులు కావడం మరో విశేషం. శతాబ్దాల క్రితం ఆ గ్రామానికి చెందిన కొందరు తీర్థయాత్రలకు వెళుతూ పండరీపురాన్ని దర్శించుకున్నారు. అక్కడి పాండురంగడి ఆలయం వారిని విశేషంగా ఆకట్టుకుంది. మనసారా ఆ దేవుడిని కొలిస్తే కోర్కెలు తీరుతాయని భావించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అచంచల భక్తిభావంతో గ్రామంలో పాండురంగడి ఆలయాన్ని నిర్మించి, ఇలవేల్పుగా కొలవడం మొదలు పెట్టారు. చెడుని దూరం చేసే భగవంతుడిగా.. వ్యక్తిలోని చెడు గుణాలను దూరం చేసే దేవదేవుడిగా పాండురంగడిని భక్తులు కొలుస్తుంటారు. ఈ నమ్మకాన్ని రుజువు చేస్తూ.. మద్యానికి బానిసైన వారు ఉంతకల్లులోని రుక్మిణీపాండురంగ స్వామి ఆలయాన్ని దర్శించుకుని మాల ధరిస్తే మళ్లీ మద్యం జోలికి వెళ్లలేదు. స్వామి మీద అచంచల విశ్వాసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేవలం మద్యం అలవాటు మాన్పించడం ఒక్కటే కాదు... వ్యక్తిలోని దుర్గుణాలను పాండురంగడు దూరం చేస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. దీంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేణ పెరుగుతూ వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. 26న రథోత్సవం.. జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంతకల్లులో ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రథోత్సవానికి పండరీపుర పీఠాధిపతి గోపాల్‌రాజ్ మహారాజ్ హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి ఏకాదశి ప్రత్యేకమే.. ప్రతి ఏకాదశి పర్వదినాన్ని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం. ఆ రోజున స్వామి మాల ధరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామిని నిష్టగా కొలిచి మాల ధరించిన వారు ఎందరో తిరిగి మద్యం జోలికి వెళ్లలేదు. వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. – రామాంజినేయులు, ఆలయ ప్రధాన అర్చకులు (చదవండి: పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....) -
ఉంతకల్లుకు పచ్చజెండా!
ఉంతకల్లు జలాశయం... హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల కలల ప్రాజెక్టు... ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ కొనసాగించాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్ రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. కన్నడిగుల నీటి విరామ సమయంలో కష్టాలకుచెక్ పడనుంది. కరువు జిల్లా అనంతకు తుంగభద్ర జలాశయం వర ప్రదాయినిగా నిలుస్తోంది. ఈ ఏడాది తుంగ..ఉప్పొంగగా జిల్లాకు గణనీయంగా నీరు వచ్చింది. దామాషా ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా 26.215 టీఎంసీలు వచ్చే అవకాశముంది. ప్రభుత్వాలపై ఎలాంటి భారం లేకుండా గ్రావిటీ ద్వారానే నీరందివ్వడం ఈ ప్రాజెక్టు విశిష్టత. అయితే నీటి సరఫరాలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కన్నడిగులకు నీటి అవసరాలు లేని సమయంలో జిల్లాకు నీటిని తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రైతులు 10 రోజుల పాటు నీటి విరామం ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి జిల్లాకు నీటి సరఫరా ఆగిపోనుంది. కర్ణాటక ప్రాంత రైతులు నీరు వద్దనుకున్నప్పుడు మనం కూడా నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక వేళ నీటిని తీసుకుంటే హెచ్చెల్సీ కర్ణాటకలో 105 కిలో మీటర్లు ప్రవహిస్తుండడంతోజలచౌర్యం జరుగుతుందనే ఆందోళన అధికారుల్లో ఉంది. నీటి చౌర్యం కాకుండా చూడాలంటే అన్ని కిలోమీటర్ల మేర గస్తీ కాయడం అధికారులకు కత్తీమీద సాములా ఉంటుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో జిల్లా అధికారులు కూడా నీటిని వద్దనుకుంటున్నారు. ఉంతకల్లు ప్రాజెక్టుతో సమస్యకు చెక్.. హెచ్చెల్సీ ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హెచ్చెల్సీ కింద దాదాపు 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా... నీటి లభ్యత, వర్షాభావం ఇతరత్రా సమస్యలతో ఏటా సగటున 90 వేల ఎకరాల్లోపు మాత్రమే పంటలకు సాగునీరు అందిస్తున్నారు. దీని వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అధిగమించాలంటే వీలైనంత ఎక్కువ నీటిని తక్కువ కాలంలో తీసుకురావాలి. తుంగభద్ర జలాశయం నుంచి వరద నీరు కిందకు వెళ్లి అటు నుంచి సముద్రంలో కలవకుండా కాపాడుకోవాలి. ఇందుకు జలాశయాల నిర్మాణం, కాలువ వెడల్పు చేయాల్సిన అవసరముందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామ సమీపంలో 5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని ప్రణాళికలు రచించారు. బహుళ ప్రయోజనాలు.. ఉంతకల్లు రిజర్వాయర్ వల్ల జిల్లా రైతులకు చాలా మేలు జరుగుతుంది. 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 1,120 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్టుకు 5 వేల ఎకరాలు అవసరమవుతుంది. ప్రాజెక్టు పొడవు 13 కిలోమీటర్లు వస్తుండడంతో కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశముంది. ఇక తుంగభద్ర కాలువను ఆధునీకరించుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 130 టీఎంసీల సామర్థ్యమున్న తుంగభద్ర జలాశయంలో పూడిక కారణంగా 100 టీఎంసీలకు పడిపోయింది. ఫలింతంగా హెచ్చెల్సీ నికర కేటాయింపుల్లో కోత పడుతోంది. వర్షాలు అధికంగా వచ్చినప్పుడు వరద నీరు కిందకు వెళుతోంది. ఇలాంటి సమయంలో నీటిని ముందే తీసుకోవడానికి జిల్లా రైతులకు ఇబ్బందులున్నాయి. హెచ్చెల్సీ సిస్టంలో హైలెవల్ మెయిన్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రైతులకు స్టోరేజ్ ట్యాంకు లేకపోవడంతో కాలువలో ప్రవహించే సమయంలో పంటలు సాగు చేసుకోవాలి. ఎగువన నీళ్లు నిలిపితే పంటలు ఎండిపోయే ప్రమాదముంది. ఉంతకల్లు రిజర్వాయర్ వల్ల ఈ సమస్యను అధిగమించడానికి వీలుందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు తల భాగాన నిరిస్తుండడం వల్ల అన్ని ప్రాంతాలకు నీటి పంపిణీ సాధ్యమవుతుందంటున్నారు. డీపీఆర్‌కు ఉత్తర్వులొచ్చాయి ఉంతకల్లు ప్రాజెక్టు డీపీఆర్ తయారీ కొనసాగించాలని చీఫ్ ఇంజినీర్(సీఈ) నుంచి ఆదేశాలు వచ్చాయి. ఉంతకల్లు ప్రాజెక్టు, పీఏబీఆర్ డ్యాం గ్రౌటింగ్ పనులకు ఆమోదం వచ్చింది. ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తుంగభద్ర జలాశయానికి వరద వచ్చిన సమయంలో ఎక్కువ నీటిని తీసుకుని ఉంతకల్లులో నిల్వ ఉంచుకోవచ్చు. తద్వారా హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీకి లబ్ధి కలిగితే జిల్లా మొత్తానికి పరోక్షంగా ప్రయోజనం కలుగనుంది. – రాజశేఖర్, ఎస్ఈ, హెచ్చెల్సీ -
డెంగీ లక్షణాలతో బాలిక మృతి
బొమ్మనహాళ్: ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓరుగటి ఇందు (9) డెంగీ లక్షణాలతో మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రత నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.