breaking news
Unique Identification Authority
-
ఆధార్ సమాచారం భద్రం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆధార్ కార్డుల్లో నిక్షిప్తమై ఉన్న ప్రజల సమాచారం భద్రంగా ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ(యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నిలేకని స్పష్టం చేశారు. ఆధార్ అనేది వ్యక్తులను ధ్రువీకరించే విధానం మాత్రమేనని, కార్డుల్లో ఉన్న సమాచారం ఎక్కడికీ బదిలీ కాదని శుక్రవారమిక్కడ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు సృష్టించిన వ్యక్తులకు సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఏటా ఇచ్చే వి.కృష్ణమూర్తి అవార్డును తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిలేకని మాట్లాడుతూ 67 కోట్ల కార్డులు ఇప్పటి వరకు జారీ అయ్యాయని చెప్పారు. అయిదవ దశ నమోదుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ చేరికతో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఆధార్ నమోదులో ఆంధ్రప్రదేశ్(తెలంగాణ, సీమాంధ్ర) ముందుందని గుర్తు చేశారు. ఆధార్ ఒక ధ్రువీకరణ మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే వివరాలు తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశిష్ట గుర్తింపుతోనే.. సబ్సిడీల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని నిలేకని అన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని చెప్పారు. ‘విశిష్ట గుర్తింపు ద్వారా అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ లబ్ధి చేకూరుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఏటా కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లు ఆదా అవుతుంది. ఆధార్ సమాచారంలో 99.99% ఖచ్చితత్వం ఉంటుంది. పేరు నమోదులో భాగంగా చేతి వేళ్లు, రెండు కనుపాపల చిత్రాలను తీసుకుంటారు. నకిలీలకు తావు లేదు. పన్ను చెల్లింపు ప్రక్రియలో ఆధార్ అనుసంధానంతో పారదర్శకత ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన ధన యోజన ప్రాజెక్టుకు ఆధార్ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’ అని అన్నారు. ఆధార్ ఫలాలు భవిష్యత్‌లో కనపడతాయని చెప్పారు. కాగా, మారుతీ ఉద్యోగ్ ఫౌండర్ చైర్మన్‌గా, బీహెచ్ఈఎల్, సెయిల్‌కు చైర్మన్‌గా వి.కృష్ణమూర్తి సేవలందించారు. -
ప్రధాని మోడీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కేంద్ర కేబినెట్ కమిటీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ కార్డుల కోసం ఉద్దేశించిన కమిటీని కూడా రద్దు చేశారు. రద్దు చేసినవాటిలో మేనేజ్మెంట్ ఆఫ్ నేచరల్ కేలామటీస్, ధరల కమిటీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మేటర్స్ కమిటీ ఉన్నాయి. మరి కొన్ని కమిటీలను పునర్వవస్థీకరించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అపాయింట్మెంట్స్, ఎకనామిక్ ఎఫైర్స్, పార్లమెంటరీ ఎఫైర్స్, పొలిటికల్ ఎఫైర్స్, భద్రత కమిటీలను పునర్వవస్థీకరించే ఆలోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది.