breaking news
union helth ministry
-
అరకోటి దాటాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య ఏకంగా అరకోటి దాటేసింది. గత 24 గంటల్లో ఏకంగా 90,123 కొత్త కరోనా కేసులు భారత్‌లో నమోదయ్యాయి. ప్రపంచ పట్టికలో ఒకటో స్థానానికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు. కరోనా కేసుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికాకి, మనకి మధ్య కేసుల సంఖ్యలో తేడా క్రమేపీ తగ్గిపోతోంది. మంగళవారం రాత్రికి అమెరికా కేసుల సంఖ్య 68.77 లక్షలు ఉంటే, మన దేశంలో 50.20 లక్షలుగా ఉంది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 10 లక్షల కేసులకు చేరుకోవడానికి 169 రోజులు పడితే, 40 నుంచి 50 లక్షలకు చేరుకోవడానికి కేవలం 11 రోజులు మాత్రమే పట్టింది. దీనిని బట్టి దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రత అర్థమవుతుంది. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఆయన హోం ఐసొలోషన్లో ఉన్నట్లు ట్వీట్‌చేశారు. భారత్‌లో సెకండ్ వేవ్ ? 1918లో ప్రపంచాన్ని వణికించిన ఫ్లూ ఏడాదిలో మూడు దశల్లో విజృంభిం చింది. కరోనా అలా ఎన్ని దశల్లో విజృంభిస్తుందో నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ నడుస్తోందన్న అనుమానాలున్నట్టుగా కోవిడ్‌పై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ వెల్లడించారు. ‘కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకున్నాక మళ్లీ తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. అక్కడ సెకండ్ వేవ్ అని అనుకోవచ్చు’ అని చెప్పారు. కేసుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ రేటు కూడా ఉంటోంది. గత 24 గంటల్లో.. గత 24 గంటల్లో 82,961 మంది రికవరీ కాగా, 1,290 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82,066 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39,42,360 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,95,933 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 78.53 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
ఇక సరికొత్తగా నిరోధ్
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనసంఖ్యకు అడ్డుకట్టవేసేందుకు భారత ప్రభుత్వం 50 ఏళ్ల కిందటే రూపొందించిన కుటుంబ నియంత్రణ మంత్రం.. నిరోధ్. హిందుస్థాన్ లాటెక్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన తొలి తరం కండోమ్ అప్పట్లో విశేష ఆదరణను చురగొంది. ఇటు జనాభా నియంత్రణకేకాక సుఖవ్యాధుల వ్యాప్తిని కూడా అడ్డుకుంది. అయితే కండోమ్‌ల తయారీలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించడంతో నిరోధ్ నెమ్మదిగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. రకరకాల ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకున్న ప్రైవేట్ సంస్థలకు ధీటుగా నిరోధ్ను మార్కెట్లో మళ్లీ నంబర్ వన్‌గా కేంద్ర ప్రభుత్వం నిలబెట్టాలనుకుంటోంది . ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటయింది. సరికొత్త నిరోధ్ను ఏ ఫ్లేవర్లలో, ఎలాంటి రూపంలో తయారుచేయాలో ఈ కమిటీ నివేదించనున్నది. 'నామామాత్రపు ధరకు అందించేదే కదా ఎలా ఉంటే ఏముందిలే!' అనుకోకుండా నిరోధ్ కు మరింత ప్రాధాన్యత కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్యులు స్వాగతిస్తున్నారు.