breaking news
under ground water level
-
ప్రమాద ఘంటికలు
హన్మకొండ / భీమదేవరపల్లి : వర్షాభావ పరిస్థితులు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంట ల్లోకి నీరు చేరక భూగర్భజలాలు వృద్ధి కాలే దు. దీనికి తోడు మానవ అవసరాలకు ఉన్న నీరంతా తోడేస్తున్న ఫలితంగా నెలనెలా భూగర్భజలాలు పడిపోతూ వచ్చాయి. రుతుపవనాలు ముందు మాసం మే నాటికి భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా తాగునీటి అవసరాలు తీర్చుకునే గ్రామాల్లో ప్రజలకు నీరు దొరకక సమస్యలు ఎదుర్కొంటున్నా రు. మిషన్ భగీరథ పథకం కొన్ని గ్రామాల్లో ఆదుకుంటుండంగా మరి కొన్ని గ్రామాల ప్రజలు నీటి అవసరాలకు నానా పాట్లు పడుతున్నారు. సగటున 12.46 మీటర్లు వరంగల్ అర్బన్ జిల్లాలో సగటున 12.46 మీటర్ల లోతుకు వెళ్తే తప్ప నీటి జాడలు కానరావ డం లేదు. 2018 మే మాసం నాటికి 10.11 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది మే మాసాంతం వరకు 12.46 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే మరో 2.84 మీటర్ల లోతుకు పడిపోయాయన్న మాట. జిల్లాలో అత్యధికంగా బీమదేవరపల్లి, ఐనవోలు మండలంలో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ రెండు మండలాల్లో 16 మీటర్ల లోతుకు జలాలు వెళ్లాయి. బీమదేవరపల్లి మండలం వంగరలో 16.15 మీటర్ల లోతులో, గట్లనర్సింగపూర్‌లో 15.22 మీటర్ల లోతులో నీరు ఉంది. వంగరలో గతేడాది మే నాటికి 3.75 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 12.79 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయ న్న మాట. ఇక ఐనవోలు మండలం పంథినిలో 16.46 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాది మాసాంతం వర కు అక్కడ 13.66 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జిల్లా కేంద్రమైన హన్మకొండకు వచ్చే సరికి 13.53 మీటర్ల లోతుకు భూగ ర్భ జలాలు పడిపోయాయి. దీంతో నగరంలో ఇంటి అవసరాలకు వేసిన బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో ప్రమాదఘంటికలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వర్షాలు కురవకపోతే పరి స్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సగం బాయిలు ఎండిపోయినయి... భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. గ్రామంలో కరువు కరాళనృత్యం చేస్తుంది. బోరుబావుల్లో నీళ్లు పాతాళలోకంలోకి పోగా ఇక వ్యవసాయ బావుల్లో సైతం నీళ్లు అడుగంటాయి. ఫలితంగా పశువులు తాగేందుకు సైతం సరిపోవడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వంగరలో గ్రామంలో మొత్తం 6,024 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కాగా అందులో 4,418 ఎకరాల్లో సాగు భూమి ఉంది. సాగు నీటిని అందించేందుకు 380 వ్యవసాయ బావులు, 295 బోరు బావులు ఉన్నాయి. కాగా ఈ ఏడాదిలో సాగు నీరు ఇబ్బందిదిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందు జాగ్రత్తగా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగు చేశారు. 149 ఎకరాల్లో వరి, 242 ఎకరాల్లో మొక్కజొన్న, 24 ఎకరాల్లో వేరుశనగతో పాటుగా 75 ఎకరాల్లో కూరగాయలు తదితర పంటలను సాగు చేశారు. పంటచేతికొచ్చే సమయంలో ఎండల తీవ్రత పెరగడంతోకావడం, బావులు, బోరుబావుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. దీంతో సాగు నీరు అందక సగం మేర వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. ఇక మే మాసంలో గ్రామంలోని 295 బోరుబావులకు గాను సుమారుగా 200పై చిలుకు బోర్లలో నీటి జాడే లేకుండా పోయింది. అలాగే, 380 వ్యవసాయ బావుల్లో 150 వ్యవసాయ బావులు పూర్తిగా ఎండిపోగా, 90కి పైగా బావుల్లో అరగంట పాటు మాత్రమే నీళ్లు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇక 140 బావులు కేవలం 10 నుంచి 20 నిమిషాల మేర మాత్రమే మోటరు ద్వారా నీళ్లు అందిస్తున్నాయి. అయితే, ఈ నీరు పశువులకు తాగు నీటికి మాత్రమే సరిపోతున్నాయి. ఒకప్పుడు యాసంగిలో రైతులు పంటల సాగుతో పాటుగా కూరగాయల సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయ బావుల్లోని నీరు కేవలం పశువులకు మాత్రమే అందుతుండడం గమనార్హం. -
రైతు కంట కన్నీరు
నల్లగొండ రూరల్ : భూగర్భ జలాలు అడుగంటి.. రైతన్నకు కన్నీరు మిగులుతోంది. 750 అడుగుల లోతు బోర్లు వేసినా.. పాతాళ గంగమ్మ పైకి రాకపోవడంతో.. కంటికి రెప్పలా కాపాడుకున్న పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. తోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలెన్నో చేసి.. ఫలించకపోవడంతో ఎటూ పాలుపోక రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే బత్తాయి సాగులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. నల్లగొండ పరిసర ప్రాంతాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాగా నాలుగేళ్లుగా తోటల సంఖ్య తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అడుగంటి.. నీరు లేకపోవడంతో రైతులు తోటలను తొలగిస్తున్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులతో బోర్లలోని నీరు ఇంకిపోయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. చెట్లమీద నిమ్మకాయ సైజులో ఉన్న బత్తాయి కాయలు ఎండిపోయి రాలుతున్నాయి. బత్తాయితో పాటు దానిమ్మ, మామిడి తోటల పరిస్థితి కూడా అలాగే ఉంది. దిగుబడి మాట దేవుడెరుగు కనీసం తోటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయడం, ట్యాంకర్లద్వారా నీటి అందిస్తూ.. భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న బత్తాయితోటలు దిగుబడిని ఇచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బొగ్గుబట్టీలకు బత్తాయిచెట్లు ఎండిన బత్తాయి చెట్లను రైతులు బొగ్గు వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఎండిన చెట్లకు తమకేమీ డబ్బులు వద్దని.. చెట్లు తొలగించి బొగ్గుబట్టీలకు తీసుకెళ్లండంటూ బొగ్గుబట్టీల వ్యాపారులను రైతులు బతిమిలాడి అప్పగిస్తున్నారు. దీంతో బొగ్గుబట్టీల వ్యాపారులు, రంపాలతో కోసి ట్రాక్టర్ల ద్వారా బత్తాయి మొద్దులను తరలిస్తున్నారు. ఎండిన తోటలకు నష్టపరిహారమేదీ.. ? ఎండిన పండ్ల తోటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంలేదు. నాణ్యమైన బత్తాయి మొక్కలు నాటాలంటే రవాణాతో కలిపి మొక్క రూ.100 నుంచి 150 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం మాత్రం దిగుబడిని ఇచ్చే పండ్ల చెట్లు ఎండిపోతే నష్టపరిహారం ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో కొబ్బరి, అరటి చెట్లకు నష్టం వాటిల్లితే అక్కడ ప్రభుత్వం రూ.2 వేలు నష్టపరిహారంగా ఇస్తుంది. ఐదో ఏట దిగుబడిని ఇచ్చే ఒక్క బత్తాయి చెట్టు ఎండిపోతే రూ.1200 వరకు నష్టం వాటిల్లుతుంది. 13 ఏండ్ల చెట్టు ఎండిపోతే రూ.2 నుంచి 3 వేల వరకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎండిన చెట్టుకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు దిగుబడి నష్టాన్ని శాస్త్రీయంగా గుర్తించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. 2009లో తీవ్ర నీటి ఎద్దడితో జిల్లాలో బత్తాయి తోటలు భారీ ఎత్తున ఎండిపోయాయి. అప్పట్లో 2లక్షల 50వేల ఎకరాల్లో బత్తాయితోటలు సాగులో ఉండగా.. లక్షన్నర ఎకరాలకు పైగా తోటలు ఎండిపోయాయి. ఎండిన తోటలకు చెట్టుకు రూ.30 చొప్పున నష్టపరిహారాన్ని ఇచ్చారు. పట్టించుకోని ఉద్యానవన శాఖ.. జిల్లాలో ఏటా 80 నుంచి 100 ఎకరాల్లో దిగుబడిని ఇచ్చే పండ్ల తోటలు ఎండిపోయి రూ.కోట్లాది పంట నష్టం వాటిల్లుతోంది. ఉధ్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కనీసం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు సంబంధిత శాఖ అధికారులకు తోటలు ఎండినట్లు దరఖాస్తులు ఇవ్వడం దండగ అని భావిస్తున్నారు. ఎండిన తోటలు తొలగించేందుకు కూలీల ఖర్చు మరో ఆర్థిక భారంగా మారుతుందని భావిస్తున్న రైతులు కొందరు ఎండిన తోటలకు నిప్పంటిస్తున్నారు. జిల్లాలో ఉద్యానవ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. బత్తాయి సాగు 4,447 ఎకరాలు, నిమ్మ 16,298, దానిమ్మ 678, మామిడి 2,768, సపోటా 297 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రికార్డుల్లో తక్కువగానే ఉంది. ఇక్కడ కేవలం డ్రిప్, కొత్త తోటల సాగు ప్రోత్సాహం అందించిన రైతుల వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సొంతంగా రైతులు పండ్ల మొక్కలు పెట్టుకున్నవారి వివరాలు ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం లెక్కల్లోకి రావడంలేదు. బ్యాంకుల ప్రోత్సాహంతో పెరిగిన సాగు 2009 తర్వాత జిల్లాలో తోటల సాగు విస్తీర్ణం పెరుగతూ వచ్చింది. బ్యాంకులు పండ్లతోటల సాగుకు రుణాలు ఇవ్వడంతో ఎండిన బత్తాయి రైతులంతా పండ్ల తోటల సాగు ద్వారానే భవిష్యత్ భరోసా ఉంటుందని భావించి విస్తారంగా తోటల సాగును చేపట్టారు. జిల్లాలో 2వేల మందికి పైగా బ్యాంకుల్లో పాసుపుస్తకాలను తాకట్టుపెట్టి రుణాలు తెచ్చి బత్తాయి సాగును చేపట్టారు. దిగుబడిని ఇచ్చే సమయానికి మళ్లీ ఇప్పుడు తోటలు ఎండిపోవడంతో బ్యాంకుల్లో తెచ్చిన అప్పును రైతులు తీర్చలేకపోయారు. అప్పులు కట్టాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇవ్వడంతో పాటు కోర్టులో కేసులు కూడా వేశారు. ఇచ్చిన రుణాలు మాఫీ చేయాలని, పండ్లతోటలు ఎండిపోయాయని, ఇటీవల గుర్రంపోడు మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన రైతులు సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. 6 బోర్లేసినా... చుక్క నీరు రాలేదు... ఈ ఫొటోలోని వ్యక్తి కనగల్ మండలంలోని ఇరుగంటిపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల లింగయ్య. ఇతనికి దిగుబడినిచ్చే పదేళ్ల వయస్సున్న బత్తాయి తోట నాలుగు ఎకరాలు ఉంది. కంటికి రెప్పలా కాపాడుకున్న బత్తాయితోట నీటి సమస్య కారణంగా ఎండిపోతుండడంతో ఆరు బోర్లు 200 ఫీట్ల వరకు వేసినా చుక్క నీరు రాలేదు. ఉన్న కొద్ది నీరు సరిపోకపోవడంతో మూడెకరాల బత్తాయితోట ఎండిపోయింది. 36 టన్నుల దిగుబడి వచ్చే కాయలు ఎండిపోవడంతో రూ.14లక్షలు నష్టపోయాడు. ఎండ తీవ్రత, డి–37 ద్వారా కాల్వ నీరు రాకపోవడంతో తోట ఎండిపోయిందని లింగయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తోట ఎండింది.. ఉపాధి పనులకు వెళ్తున్నా.... ఈ ఫొటోలోని మహిళ కనగల్ మండలంలోని ఇరుగంటిపల్లి గ్రామానికి చెందిన ఎన్నమల్ల ఎల్లమ్మ. ఈమెకు తొమ్మిదేళ్ల వయస్సున్న ఎకరం బత్తాయితోట ఉంది. నీటి సమస్య కారణంగా ఎండిపోయింది. ఏటా 12టన్నుల దిగుబడి పొందేది. గతంలో డీ–37 కాల్వ ద్వారా గ్రామంలో చెరువు నిండేది. ప్రస్తుతం కాల్వలో నీరు రాకపోవడం, ఉన్నబోరు వట్టిపోవడంతో రూ.50వేలు ఖర్చు చేసి రెండు బోర్లు వేసింది. 200 ఫీట్ల లోతు వేసినా చుక్క నీరు రాలేదు. సమీపాన బోరు, నీరున్నా.. రైతులు లేకపోవడంతో చేసేదేమీ లేక ఆశలు వదులుకుంది. ట్యాంకర్ ద్వారా నీరందించాలనుకుంది. కానీ అప్పుల ఊబిలో చిక్కిపోతానని తోటపని మానేసి ఉపాధి హామీ కూలికి వెళ్తోంది. పంట దిగుబడి నష్టం రూ.2.50లక్షల ఆదాయం కోల్పోయింది. ఏడాది క్రితమే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరు పిల్లలను కూలినాలి పనికి తీసుకెళ్తూ.. జీవనం నెట్టుకొస్తోంది. ఎండిన తోటకు పరిహారం ఇవ్వాలి ఎండిన పండ్లతోటలకు మొక్కల ఖరీదుతో పాటు దిగుబడి నష్టాన్ని అంచావేసి.. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. నా తోటలు ఎండిపోకపోవతే.. దానిమ్మ 50టన్నుల దిగుబడితో రూ.20–25లక్షలు, బత్తాయి 150 టన్నుల దిగుబడితో రూ.42 లక్షలు వచ్చేవి. తోట ఎండిపోవడంతో.. ఆ మొత్తం నష్టపోయాను. తోటకు పెట్టుబడి, బోర్ల ఖర్చు మరో రూ.40 వరకు నష్టపోయాను. ప్రభుత్వం నాకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – రైతు అంజిరెడ్డి, దోమలపల్లి పిల్లలతో సమానంగా చెట్లను పెంచాం.. పిల్లలతో సమానంగా బత్తాయి, దానిమ్మ తోటలను పెంచాం. బత్తాయితోటలో వేసిన బోర్లు పడక పోవడంతో రెండు కిలోమీటర్ల దూరం నుంచి బోరు వేసి పైప్‌లైన్ ద్వారా నీళ్లు తెచ్చినా వారం కంటే ఎక్కువ రోజులు నీరు పోయలేదు. అద్దెబోర్లు తీసుకుందామన్నా సమీపంలో ఎక్కడా నీటి వసతి లేక వదిలేశాం. ఇద్దరు కుమార్తెల చదువు, వివాహం, వారి భవిష్యత్ తలుచుకుంటేనే భయాందోళనకరంగా ఉంది. 15 రోజుల పాటు అన్నం ముట్టకుండా.. కుటుంబ సభ్యులమంతా రోదించాం. బంధువులు, స్నేహితులు ఓదార్చినా మానసికంగా కోలుకోలేకపోతున్నాం. – అరుణ, అంజిరెడ్డి భార్య జిల్లా కేంద్ర సమీపంలోని దోమలపల్లి గ్రామానికి చెందిన రైతు నాతాల అంజిరెడ్డి దంపతులు. వీరికి 13ఏళ్ల వయస్సు కలిగిన 15 ఎకరాల బత్తాయితోట, ఐదేళ్ల వయస్సు కలిగిన ఆరెకరాల దానిమ్మతోట ఉంది. బత్తాయితోట నుంచి ఏటా కత్తెర, సీజన్ బత్తాయి దిగుబడి 120–130 టన్నులు లభిస్తుంది. ఆరెకరాల్లో ఉన్న దానిమ్మతోట ద్వారా 50 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ తోటల్లో ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉంది. మరో నెలలో పంట దిగుబడి చేతికందుతుందని ఆశించగా.. తీవ్ర నీటిఎద్దడి ఎదురైంది. తోటను కాపాడుకునేందుకు ఇప్పటి వరకు 21 ఎకరాల్లో 72 బోర్లు వేసినా ఫలితం లేకుండాపోయింది. 2 కిలోమీటర్ల దూరంలో 250 ఫీట్ల లోతు బోరువేసి తోటకు నీరు అందించినా వారం రోజుల్లోనే ఆ బోరు కూడా వట్టిపోయింది. సమీపంలో ఎక్కడా రైతుల బోర్లలో నీరు లేకపోవడంతో ఎలాగైనా దానిమ్మ, బత్తాయితోటలను కాపాడుకోవాలని 750 ఫీట్లలోతు బోర్లు వేసినా చుక్క నీరు పైకి రాలేదు. చేసేదేమీలేక వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. దిగుబడి చేతికందితే.. బత్తాయి మీద రూ.42 లక్షలు, దానిమ్మకు రూ.20–25 లక్షలు చేతికొచ్చేవి.. కాగా ఆయన తోట మీద పెట్టుబడిగా ఎరువులకు రూ.8 లక్షలు, 72 బోర్లకు రూ.25లక్షలు, పశువుల ఎరువుకు రూ.1.80లక్షలు, కూలీల ఖర్చు రూ.6లక్షలు అంతా కలుపుకుని రూ.కోటికిపైగా నష్టపోయాడు. తోట ఎండిపోవడంతో తన ఇద్దరు కూతుళ్ల చదువు, వివాహాలు, కుటుంబం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.. అంటూ ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. ఇది ఒక్క అంజిరెడ్డి పరిస్థితే కాదు. అనేక మంది రైతులది. -
భూగర్భ జలమట్టాల్లో భారీ పెరుగుదల
సాక్షి, సంగారెడ్డి: పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. రెండు నెలలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు భారీ వృద్ధిని సాధించినట్లు భూగర్భ జల శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. గత ఏడాది జూలైలో భూ ఉపరితలానికి 20.37 మీటర్లు దిగువన నమోదైన జిల్లా సగటు భూగర్భ జల మట్టం.. ఈ ఏడాది జూలై నాటికి 5.10 మీటర్ల మేర వృద్ధి సాధించింది. అదే విధంగా గత ఏడాది జూన్‌లో 23.79 మీటర్లు నమోదైన భూగర్భ జల మట్టం ఈ ఏడాది జూన్‌లో 19.53 మీటర్లకు ఎగబాకింది. ఈ సీజన్లో వర్షపాతం 18 మండలాల్లో సాధారణానికి మిం చిపోగా 20 మండలాల్లో సాధారణానికి చేరుకుంది. మిగలిన 13 మండలాల్లో వర్షపాతం ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోయినా.. ఎక్కడా వర్షభావం మాత్రం నెలకొనలేదు. వాగులు, వంకలపై నిర్మించిన చెక్ డ్యాంలు, వాటర్‌షెడ్ ట్యాంకులకు జలకళ వచ్చింది. భూగర్భ జలాల వృద్ధి చెందడంతో వ్యవసాయ బావులు నిండు కుండళ్లా కళకళలాడుతున్నాయి. మరికొన్ని చోట్లలో బావుల నుంచి నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి. ఉబికివస్తున్న జలాలు... మనూరు మండలం పసుపులపాడులో వ్యవసాయ బావి పొంగింది. ఆ గ్రామంలో భూ గర్భ జలాలు భూ ఉపరితలానికి 0.45 మీటర్లు లోతుకే లభ్యమవుతున్నాయి. రేగోడ్ మం డలం టి.లింగంపల్లిలో 0.80 మీటర్లు, వెల్దుర్తి మండలం కుకునూరులో 1.50 మీటర్లు, ఝరాసంఘంలో 4.20 మీటర్లు, పెద్ద శంకరంపేటలో 5.20 మీటర్లు, చిన్న శంకరంపేట మండలం గవ్వపేటలో 5.59 మీటర్లు, పాపన్నపేటలో 6.17 మీటర్లు, శివ్వంపేటలో 6.64 మీటర్లు, వర్గల్ మండలం మజీద్‌పల్లిలో 8.09 మీటర్లు, సిద్దిపేటలో 8.74 మీటర్లు దిగువన భూగర్భజలాల మట్టం నమోదైంది. భూ గర్భ జల మట్టాలు అత్యంత దిగువన నమోదైన ప్రాంతాలను పరిశీలిస్తే..గజ్వేల్‌లో 33.60 మీటర్లు, ములుగులో 32.60 మీటర్లు లోతున భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. విషమం నుంచి ఉపశమనం ఓ ప్రాంతంలో భూగర్భ జలాల లభ్యత, విని యోగం ఆధారంగా భూగర్భ జలాల పరిస్థితిని నిర్ధారిస్తారు. వినియోగం అధికమైతే ఆ ప్రాం తాలను అతి విషమం, విషమ పరిస్థితిలో ఉన్న ట్లు ప్రకటించి అక్కడ కొత్తగా బోరుబావుల తవ్వకాలపై నిషేధాన్ని అమలుచేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వి నీటిని తోడేస్తుండటంతో వేసవికాలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో పడిపోతున్నాయి. కురిసిన వర్షాల వల్ల ఇలాం టి ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాల స్థితి గతులు మెరుగయ్యాయి. మనూరు మండలం పసుపులపాడు, ఝరాసంఘం, పాపన్నపేట, తూప్రాన్ ప్రాంతాలు ఈ కోవకు వస్తాయి.