పిల్లలతో జూలో జోలీ
తన పిల్లల ఆలనా పాలనా చూసుకోవడంలోనే తల్లికి నిజమైన అనందం. బయట ఆమె సూపర్‌స్టార్ కావొచ్చు. పిల్లల దగ్గరకొచ్చేసరికి ఆమె అమ్మే. ఆ పిలుపులోనే నిజమైన ఆనందాన్ని పొందుతుంది అమ్మ. ఇంతకీ అమ్మ గురించి ఈ ఉపోద్ఘాతం దేనికి? అనుకుంటున్నారా! హాలీవుడ్ సూపర్‌స్టార్ ఏంజిలినా జోలీ గురించి మాట్లాడుకునే ముందు ఈ మాత్రం ఉపోద్ఘాతం అవసరం. ఎందుకంటే... ఆమె మంచి నటి మాత్రమే కాదు. గొప్ప తల్లి కూడా. ఇటీవల తన ఆరుగురు పిల్లల గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘నేను నటిగా ఎంత బిజీగా ఉన్నా... పిల్లల విషయంలో మాత్రం కేర్‌ఫుల్‌గా ఉంటాను.
నా సినిమా ప్రమోషన్లకు కూడా పిల్లల్ని తీసుకెళ్తా. ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతోన్న ‘అన్ బ్రోకెన్’ చిత్రం కోసం ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి వచ్చింది. దాంతో పిల్లల్ని కూడా తీసుకెళ్లా. అక్కడి సిడ్నీలోని తరోంగ జూలో మూడు రోజులు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేశా. నిద్ర కూడా అక్కడే. ఆ మూడు రోజుల్నీ నా జీవితంలో మరిచిపోలేను. అక్కడి ప్రకృతినీ, జీవరాసుల్ని చూసి పిల్లలు కేరింతలు కొడుతుంటే... తల్లిగా నా కడుపు నిండిపోయింది. ఆ జూలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను కూడా పక్షులతో కలిసి ఆడుకున్నా’’ అని సంబరపడిపోతూ చెప్పారు ఏంజెలినా.
ఇంకా తన పిల్లల గురించి మాట్లాడుతూ- ‘‘పిల్లల్ని నిద్ర పుచ్చడం కోసం నేను భిన్నమైన రీతుల్ని అనుసరిస్తా. స్వతహాగా సినిమా వ్యక్తిని కావడం వల్ల... భిన్నమైన కథల్ని అప్పటికప్పడు అల్లుతూ, వాటిల్లో నైతిక విలువల్ని కూడా రంగరించి పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తుంటా. కేవలం కథలు చెప్పడమే కాదు, రకరకాల కేరక్టర్లను సృష్టించి కథను వారి కళ్లముందు కదిలేలా చేస్తా. నా కథల్ని పిల్లలు అమితంగా ఇష్టపడతారు’’ అని చెప్పుకొచ్చారు.