breaking news
Uddhav Turkey
-
అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి?
లోక్‌సభ శీతాకాల సమావేశాలు కాగానే ప్రమాణస్వీకారం శివసేన అధినేత ఉద్ధవ్ పచ్చజెండా సాక్షి, ముంబై: శివసేన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి వరించనుంది. ఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశాయ్‌కి మార్గం సుగమమైంది. కొద్ది రోజుల కిందట జరిగిన రెండవ విడత కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మిత్రపక్షాల కోటాలో శివసేన తరఫున దేశాయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే బీజేపీ, శివసేన మధ్య రాష్ట్రస్థాయి పొత్తులపై చర్చలు కొలిక్కిరాకపోవడంతో చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. అయితే అప్పట్లో నెల కొన్న విభేదాలు, కలహాలు ఇప్పుడు సద్దుమణిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయ్యింది. దీంతో అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రిపదవి కట్ట బెట్టేందుకు మార్గం సులభతరమైంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివ ర్గంలో శివసేనకు చెందిన అనంత్ గీతే ఒక్కరే క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో దేశాయ్ చేరితే ఈ సంఖ్య రెండుకు చేరుతుంది. ఎన్డీయే కూటమిలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో తగిన వాటా రాలేదు. దీంతో శివసేనలో తీవ్ర అసంతృప్తి ఉంది. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణంలో దేశాయ్‌కి చోటు లభించినప్పటికీ శివసేనలో నెలకొన్న అసంతృప్తి పూర్తిగా తొలగిపోదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అవసరమైతే శివసేనతో చర్చిస్తా..
పంకజా ముండే సాక్షి, ముంబై: అధికారంలోకి వచ్చేందుకు సహకారం తీసుకోవాల్సి వస్తే శివసేనతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో శివసేన, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించనట్లయితే శివసేన మద్దతు అవసరం కానుంది. అలాంటి సమయంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపేందుకు పంకజా ముండే సరైన నాయకురాలిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా ఆమెను ప్రకటించినట్టయితే ఉద్దవ్ ఠాక్రేకూడా బీజేపీకి మద్దతు పలికేందుకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంకజా ముండే తన సోదరిలాంటివారని పేర్కొంటూ బీడ్ జిల్లాలో ఆమెకు వ్యతిరేకంగా శివసేన ఎవరిని బరిలోకి దింపలేదు. అలాగే భావి ముఖ్యమంత్రిగా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రచార హోరు..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక్కసారి మాకు అధికారం ఇవ్వడంటూ అన్ని పార్టీలూ శనివారం రాష్ర్టవ్యాప్తంగా ప్రచార సభలను పోటాపోటీగా నిర్వహించాయి. ఒంటరి పోరుతో పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఈసారి ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా నిలబడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు ప్రముఖ పార్టీల ప్రచారసభలతో శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు మార్మోగాయి. ఈసారి అన్ని పార్టీలూ ఒంటరిగా బరిలోకి దిగడంతో ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. శనివారం నరేంద్ర మోడీ తోపాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇలా దాదాపు అన్ని పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పీఎం నరేంద్రమోదీ బీజేపీ తరఫున శనివారం రాష్ర్టంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరాఠ్వాడాలోని బీడ్ లో మధ్యాహ్నం, ఔరంగాబాద్‌లో సాయంత్రం, ముంబైలో రాత్రి జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీని పూర్తిమెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, ఎన్సీపీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించినమోదీ తమ మాజీ మిత్రుడైన శివసేనపై మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం విశేషం. ఇదిలా ఉండగా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా సాతారా, పాటణ్‌లలో జరిగిన రెండు బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులను విమర్శిస్తూ ఎన్సీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో ఎన్సీపీకి అధికారం కట్టబెట్టాలని కోరారు. కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శనివారం బుల్దానాలోని బరకట్ బకాల్‌లో, అకోలాలోని ఆకోట్‌లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసమితి అధ్యక్షులైన నారాయణ రాణే పుణేలోని బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు. ఇక శివేసన అధ్యక్షుల విషయానికి వస్తే అకోలాలో మధ్యాహ్నం, బుల్దానా, అమరావతిలలో సాయంత్రం నిర్వహించిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్, ఎన్సీపీలపై ధ్వజమెత్తిన ఆయన బీజేపీపై కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో నాయకులు లేకనే నరేంద్ర మోడీని ఎన్నికల ప్రచారంలో దింపారని, అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు శివసేనను బీజేపీ వాడుకుందని ఆరోపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా నాందేడ్, లోహలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆయన కూడా తనదైన శైలిలో ప్రముఖ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఒక్కసారి మా చేతికి అధికారం ఇచ్చిచూడండని రాష్ట్ర ప్రజలను కోరారు. మరోవైపు సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా రత్నగిరి, కనకవిలీలో జరిగిన బహిరంగ సభలలో ప్రసగించారు. మేం కరివేపాకు కాదు..: ఉద్ధవ్ సాక్షి, ముంబై: కూరలో కరివేపాకులా వాడుకుని మమ్నల్ని బీజేపీ వదిలేసిందని శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. అకోలాలో శనివారం జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు శివసేన మద్దతు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ తీరు మారిపోయిందని ఆయన విమర్శించారు. కరివేపాకులా తమను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వారికి నాయకులెవరూ లేకపోవడంతోనే ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి దింపిందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవాచేశారు. మహాకూటమి విడిపోయిన అనంతరం ఉద్ధవ్‌ఠాక్రే తరచూ బీజేపీపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు.