breaking news
tuk tuk
-
బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు!
లండన్: నేరాల కట్టడికి ప్రపంచమంతటా పోలీసులు గాలితో పందెం వేస్తూ దూసుకెళ్లే అత్యాధునిక వాహనాలను వాడుతున్నారు. కానీ బ్రిటన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా టుక్‌టుక్ (ఈ–రిక్షా)లను రంగంలోకి దించుతోంది. వేల్స్‌లోని గ్వెంట్ కౌంటీ పోలీసులు ఇప్పటికే నాలుగు టుక్‌టుక్‌లు కొనుగోలు చేశారు. స్థానిక న్యూపోర్ట్, అబెర్గ్రావెనీ ప్రాంతాల్లో ర్రాతి వేళల్లో పార్కులు, వాక్‌వేలు, బహిరంగ స్థలాల్లో గస్తీకి వాటిని వాడుతున్నారు. నేరాలు జరిగితే సమీపంలోని ఏ టుక్టుక్నైనా సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. వీటిపై ప్రజల నుంచి విపరీతమైన సానుకూల స్పందన వస్తోందట! అయితే ఈ టుక్‌టుక్‌ల గరిష్ట వేగాన్ని గంటలకు 55 కిలోమీటర్లకు పరిమితం చేయడం మరో విశేషం. ఈ–రిక్షాల సేకరణకు మహీంద్రా ఎలక్ట్రిక్‌తో గ్వెంట్ పోలీసు విభాగం భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. టుక్ టుక్ అంటూ
లండన్: పుట్టింది భారతదేశం. ఆస్ట్రేలియాలో ఆటో మొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్న నవీన్ రబెల్లీ(35)కు ఆ దేశం తమ పౌరసత్వాన్ని కూడా ఇచ్చింది. అయితే తాను చేసే ఉద్యోగంతో పాటు మిగిలినవి అతనికి జీవితంలో చిన్నవిగానే కనిపించాయి. అదే సమయంలో స్నేహితుడిని కలిసేందుకు నవీన్ భారత్ కు వెళ్లాడు. ఆయనకు భారతీయ రోడ్లపై తిరుగుతూ పెద్ద మొత్తంలో కాలుష్యాలను విడుదల చేస్తున్న ఆటోలు కనిపించాయి. వాటిని అలానే చూస్తూ ఉండిపోయిన నవీన్ కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఎలాగైనా కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకు అనువైన మార్గాల కోసం అన్వేషించాడు. చివరగా సోలార్ ఆటోతో ప్రపంచ దేశాల్లో కొన్నింటిని చుట్టి ప్రజల్లో అవగాహన తేవాలని నిర్ణయించుకున్నాడు. ఏడు నెలల వ్యవధిలో దాదాపు 6,200 మైళ్ల దూరం ప్రయాణించినట్లు నవీన్ తెలిపాడు. ఈ ఏడు నెలల కాలంలో ఆటో వెనుక భాగాన ఉన్న ఒక బెడ్, ఓ సోలార్ కుక్కర్ లే అతని జీవన సాధనాలు. పక్కనే ఉన్న చిన్న కప్ బోర్డులో ఆహారం నిల్వ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. తన ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఓ నిర్ణయానికి వచ్చిన నవీన్.. ఇండియా నుంచి తన టుక్ టుక్ (నవీన్ తన ఆటోకు పెట్టుకున్న పేరు)తో ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పట్టణం చేరుకుని అక్కడ నుంచి యాత్రను ప్రారంభించాడు. అలా టర్కీ, బల్గేరియా, సెర్బియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ గుండా ఆటోను నడుపుకుంటూ ప్రస్తుతం బ్రిటన్ చేరుకున్నాడు. తాను చేపట్టిన యాత్రపై మాట్లాడిన నవీన్.. యాత్ర మొత్తం సజావుగానే సాగినట్లు తెలిపాడు. టుక్ టుక్ తో సెల్ఫీలను తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిని ప్రదర్శించినట్లు చెప్పాడు. టుక్ టుక్ సోలార్ పవర్ తో నడుస్తుందని వారికి తాను చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యానికి కూడా లోనైనట్లు తెలిపాడు. ఫ్రాన్స్ కు చేరుకున్న తర్వాత తన పర్సు, పాస్ పోర్టులను దుండగులు కొట్టేశారని, అయితే అక్కడినుంచి ప్రజలు చేసిన సాయంతో ముందుకు సాగుతున్నానని.. ఎమర్జెన్సీ పాస్ పోర్టు ద్వారా బ్రిటన్ లోకి ప్రవేశించినట్లు తెలిపాడు. బ్రిటన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ కు చేరుకున్న తర్వాత యాత్రను ముగించాలనుకుంటున్నట్లు చెప్పాడు.