breaking news
tribals agitation
-
మావోయిస్ట్ గడ్డపై తిరుగుబాటు
సాక్షి, విశాఖపట్నం : మావోయిస్ట్ కంచుకోటగా వెలుగొందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోలీసులు వరుస కూబింగ్‌లతో పాటు ఎన్కౌంటర్లు సైతం కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. అయినప్పటికీ పట్టు కోసం పారాడుతున్న మావోయిస్టులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలు అండగా ఉంటున్నాయి. అయితే ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటున్న ఆదివాసీలు సైతం మావోయిస్టులపై తిరుగబడుతున్నారు. తమ వెనుకబాటుకు కారణం మీరే అంటూ మావోలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రా-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దుల్లో గిరిజన ప్రజలు భారీ ర్యాలీని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని నినాదంతో 6 గ్రామాల గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మావోయిస్టుల కంచుకోటలో వ్యతిరేక నినాదాలు చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, సెల్ టవర్ నిర్మించాలి అంటూ గిరిజనులు నినాదాలు చేశారు. (ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు) మరోవైపు తెలంగాణలోనూ మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు. -
బేతోలు మైసమ్మకుంట కబ్జాకు యత్నం
అడ్డుకోబోయిన రైతు గుగులోతు శ్రీనుపై దాడి దాడికి నిరసనగా రాస్తారోకోకు దిగిన గిరిజనులు మద్దతుగా నిలిచిన ఎల్‌హెచ్‌పీఎస్, వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మద్దతుతో భూకబ్జాకు యత్నించారంటూ ఆరోపణ మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామశివారులోగల మైసమ్మకుంట చెరువు కట్టను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. వారిని గుగులోత్ శ్రీను అనే రైతు అడ్డుకోపోగా వారు అతడిపై దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత రైతు కథనం ప్రకారం.. బేతోలు గ్రామశివారులో మైసమ్మకుంట చెరువు ఉంది. ఈ చెరువుపై ఆధారపడి పలువురు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెరువు భూమిపై రియల్టర్ల కన్ను పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు దార యాదగిరిరావు, మల్యాల శ్రీనివాసరావు, నెల్లూరి శ్రీధర్, వెంకన్న, మధు, ఖమ్మంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బొందాలు, మరికొంతమంది కలిసి రైతు గుగులోత్ శ్రీనును రాత్రి 11 గంటల సమయంలో మద్యం తాగు అంటూ పోశారు. నెమ్మదిగా వారు మైసమ్మ చెరువు కుంట ప్రస్తావన తీసుకురావడంతో తాను మద్యం తాగనని, మైసమ్మ చెరువు కుంటను కబ్జా చేస్తారా అని ప్రశ్నించాడు. చెరువు కట్టను తొలగించాలని చూస్తే ఊరుకోనని చెప్పాడు. అందుకు వారు భూమిని ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగా డిమాండ్ వస్తుందన్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కూడా చెప్పామని, నువ్వు వినకుంటే ఏం చేయడానికైనా సిద్ధమేనని వారు హెచ్చరించారు. తన భూమిని గుంజుకుంటామని చెప్పడంతో అందుకు శ్రీను ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోగా వారంతా మైసమ్మకుంట చెరువు కట్టపైకి వచ్చి ప్రొక్లయినర్ సాయంతో చెరువు కట్ట తొలగించే పని ప్రారంభించారు. ఈ పనిని అపేందుకు శ్రీను వెళ్లగా అతడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. వెంటనే భయాందోళనకు గురైన శ్రీను అక్కడి నుంచి పారిపోయి ఉదయాన్నే అందరికి చెప్పాడు. విషయం తెలుసుకున్న గిరిజనులు ఆదివారం ఉదయాన్నే మహబూబాబాద్, కురవి ప్రధాన రహదారి అయిన బేతోలు హైవేపై రాస్తారోకోకు దిగారు. వారి ఆందోళనకు ఎల్‌హెచ్‌పీఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచారు. రాస్తారోకోతో రెండువైపులా వాహనాలు చాలా దూరం వరకు నిలిచిపోయాయి. ఆయా పార్టీల నాయకులు గుగులోత్ భీమానాయక్, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, గునిగంటి రాజన్న, రేషపల్లి నవీన్ మాట్లాడుతూ మైసమ్మకుంట చెరువు కట్ట కూల్చివేతకు, ఆక్రమించేందుకు యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆయన అనుచరులు ఈ పనికి పూనుకున్నారని వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించొద్దన్నారు. కురవి ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినప్పటికి వారు రెవెన్యూ అధికారులు రావాలని, శ్రీనుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కూర్చున్నారు. సివిల్ సప్లై డీటీ మాధవపెద్ది వెంకట్‌రెడ్డి, ఆర్ఐ జర్పుల సుధాకర్ నాయక్, సర్వేయర్ విజయభాస్కర్ రాస్తారోకో వద్దకు వచ్చారు. ఆందోళన కారులతో మాట్లాడారు. రైతులు ఫిర్యాదు చేస్తే సంఘటనకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేందుకు ఆదేశిస్తామని డీటీ వెంకట్‌రెడ్డి చెప్పారు. అంతేగాక ప్రొక్లయినర్‌ను సీజ్ చేస్తామని, తిరిగి మైసమ్మకుంట భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు. దీంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు. ఆరుగురిపై కేసు నమోదు బేతోలు గ్రామ శివారులోని మైసమ్మకుంట చెరువు కట్టను ధ్వంసం చేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువు కట్టను తవ్వారని దార యాదగిరిరావు, నెల్లూరి శ్రీధర్, వెంకన్న, కె మధు, మల్యాల శ్రీనివాసరావు, రామయ్యపైకేసు నమోదు చేశామని కురవి ఎస్సై రామకృష్ణ తెలిపారు.