breaking news
Trafficking in cannabis
-
గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తుల అరెస్టు
గన్‌ఫౌండ్రీ: ధూల్‌పేట్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను మంగళవారం ధూల్‌పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 3.045 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అప్పర్ ధూల్‌పేట్‌లోని యతీమ్‌ఖానా, బలరాంగల్లీలో గంజాయి అమ్ముతున్న కమినిభాయి, మంజుభాయి అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా శంకర్‌సింగ్ నివాసంపై దాడులు నిర్వహించి 120 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా వీరికి గంజాయి సరఫరా చేస్తున్న జుమ్మెరాత్‌బజార్‌కు చెందిన ముఖేష్‌సింగ్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో ఘటనలో... జంగూరుబస్తీకి చెందిన మహేష్‌సింగ్, రూపేష్‌సింగ్ గత కొన్ని రోజులుగా స్థానికంగా గంజాయిని అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందగా వారి నివాసాలపై దాడులు నిర్వహించి 115 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి గంజాయిని సరఫరా చేస్తున్న దీపక్‌సింగ్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ధూల్‌పేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు కె. సైదిరెడ్డి, ఎండీ జైఉద్ధీన్, ఎస్సైలు జశ్వంత్‌నాయుడు, గోపాల్, యాదయ్య, కృష్ణలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఖైదీని పట్టించిన సర్వే
సమగ్ర సర్వే పుణ్యమా అని తొమ్మిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఓ ఖైదీ పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్‌కు చెందిన ఒడ్డే(దనుల) వెంకట్రాములు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ కొన్నేళ్ల కిందట మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. అతడికి మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్లపాటు జైలులో శిక్షను అనుభవించిన వెంకట్రాములు.. 2005లో 15రోజులపాటు పెరోల్‌పై బయటికి వచ్చాడు. గడువు ముగిసినా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎంతవెతికినా ఆచూకీ లభించకపోవడంతో మహారాష్ట్ర పోలీసులు నిజామాబాద్ జిల్లా పోలీసులను ఆశ్రయించారు. సర్వేలో పాల్గొనేందుకు వెంకట్రాములు స్వగ్రామానికి వచ్చినట్లు నిజాంసాగర్ ఎస్ఐకి ఉప్పందింది. దీంతో ఆయన వెంకట్రాములును అదుపులోకి తీసుకున్నారు.