breaking news
tourists problems
-
గోవాలో మద్యం సేవించడం, సెల్ఫీలపై కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోండి
గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?. గోవా వెళ్లి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ మందు తాగాలని అనుకుంటున్నారా?.. అయితే తాజాగా గోవా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలను ఒక్కసారి తెలుసుకోండి. లేకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ గైడ్‌లైన్స్ ఏంటంటే.. గోవాకు వచ్చే పర్యాటకుల ప్రైవసీ, భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడి బీజేపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. జనవరి 26 వ తేదీన గోవా పర్యాటక శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా గోవాకు వచ్చే పర్యాటకులు మోసపోకుండా, అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. బీచ్‌లో బహిరంగంగా మద్యం సేవించేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా మద్యం సేవించవచ్చు. అలాగే, ఎవరైనా టూరిస్టులు గోవాలో సన్ బాత్ లేదా బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో వారికి ఫొటోలు సీక్రెట్‌గా తీయకూడదు. వారి ఫొటోలు తీయడానికి ముందస్తుగా వారి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడంపై కూడా నిషేధించారు. ఇలా చేస్తే.. వారికి రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పర్యాటక శాఖలో నమోదు చేసుకున్న హోటళ్లలోనే బస చేయాలని కూడా మార్గదర్శకాల్లో సూచించింది. దీంతో, పర్యాటకుల భద్రతతోపాటు వారికి భద్రతకు భంగం కలుగకుండా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా గోవాలోని చారిత్రక కట్టడాలను పాడుచేయవద్దని పర్యాటకులకు గోవా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. గోవాకు వచ్చే పర్యాటకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మార్గదర్శకాల్లో క్లియర్‌గా చెప్పారు. -
తాజ్‌మహల్ చెంత దాహం.. దాహం
దేశంలోనే పర్యాటక స్థలాల్లో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వేడి, దాహం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. శుక్రవారం నాడు అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. శనివారం ఉదయం కొంత మబ్బులు కనిపించినా, వేడి ఎక్కువగానే ఉంది. వడగాలులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయని ఆగ్రాలోని పలివల్ పార్కులో తరచు మార్నింగ్ వాక్ చేసే ప్రదీప్ భాయ్ చెప్పారు. ఈ ఎండల తీవ్రత కారనంగా స్కూళ్లకు వేసవి సెలవులు త్వరగా ఇవ్వాలని నరేష్ పరస్ అనే మరో వ్యక్తి చెప్పారు. తాజ్‌మహల్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు కూడా ఈ వేడి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. ప్రధానంగా తాజ్ ఎదురుగా ఒక పాలరాతి బెంచి ఉంటుంది. దానిమీద కూర్చుని వెనకాల తాజ్‌మహల్ కనిపించేలా ఫొటోలు తీయించుకుంటారు. ఇప్పుడు దానిమీద కూర్చోవాలంటే వేడెక్కిపోయి చాలా ఇబ్బందిగా ఉంటోందట. తాగునీరు కూడా చాలా సమస్యగా మరిందని పర్యాటకులు వాపోతున్నారు. వీళ్ల దాహం తీర్చడానికి ఆగ్రాలో తగినన్ని నీళ్లు కూడా లేవు. గత 15 రోజులుగా ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. యమునా నదిలో నీటి అందుబాటు చాలా పడిపోయిందని వాటర్ వర్క్స్ అధికారి ఒకరు చెప్పారు.