breaking news
Totally destroyed
-
హుదూద్ తుపాన్ బీభత్సం
-
అంచనాలకు మించి ఆస్తినష్టం
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో జిల్లాలో అపార ఆస్తి నష్టం వాటిల్లింది. శిథిలాలు ఊడిపడటంతో సమాచార వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రెండు విడతలుగా పెనుగాలులు తీవ్రంగా వీయడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. పునరావాస కేంద్రాల్లో కూడా పరిస్థితి భయానకంగా మారడంతో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. విశాఖ కలెక్టరేట్ కూడా పూర్తిగా ధ్వంసమవడంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రోజు తుపాను ప్రభావిత ప్రాంతాలను మంత్రి పి.నారాయణ పరిశీలించారు. 1996 తరువాత విశాఖలో మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చిందని నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం విశాఖలో ఏ రోడ్డు కూడా క్లియర్ గా లేదన్నారు. రోడ్లను క్లియర్ చేసేందుకు 200 పొక్లెయిన్ లను వినియోగిస్తామన్నారు. ఆస్తినష్టం అంచనాకు మించి ఉందని మంత్రి తెలిపారు. ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, ఆస్తి నష్టంను తీవ్రతను తగ్గించలేకపోయామన్నారు. సోమవారం ఉదయం 10 గం.ల తర్వాతే సహాయకచర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. తన కారు అద్దాలు కూడా పగిలిపోయాయని మంత్రి తుపాను పరిస్థితిని విశ్లేషించారు. -
''అంచనాలకు మించి ఆస్తినష్టం''
-
తుపాను బీభత్సానికి కోస్తా జిల్లాలు అతలాకుతలం
-
తుపానుతో కోస్తా జిల్లాలు అతలాకుతలం
హైదరాబాద్: హుదూద్ తుపాన్‌తో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా వణుకుతున్నాయి. ఆయా జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈదురుగాలులు మరింత బలంగా వీస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో గంటకు 80 - 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆముదాలవలస మండలం వంజంగిలో ఆటోపై చెట్టు కూలింది. దీంతో ఆటో ధ్వంసమైంది. జిల్లాలోని పలాస, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో హుదూద్ ప్రభావం పాక్షికంగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 80 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కళింగపట్నం రహదారిపై భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో వేలాది ఎకరాల్లో జొన్న, అరటి, వరి, పత్తి పంటలకు నష్టం ఏర్పడింది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి.... దీంతో జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంతబొమ్మాళిలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఆరు నేవి బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విజయనగరం జిల్లా: జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపిలేకుండా భారీగా వర్షం కురుస్తోంది. అదే మండలంలోని తిప్పలవలస వద్ద సముద్ర తీరంలో ఉంచిన 10 బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. భోగాపురం మండలం ముక్కాం, చేపల కంచేరిలో భారీగా చెట్లు నేలకొరిగాయి. అలల ఉధృతికి ముక్కాం గ్రామంలోని ఇళ్లలోకి సముద్రం నీరు వచ్చి చేరింది. పార్వతీపురంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది. జిల్లావ్యాప్తంగా 60 నుంచి 70 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విశాఖపట్నం జిల్లా: జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో పెనుగాలులు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. అలాగే విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నెలమట్టమైయాయి. జిల్లాలోని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆనందపురం, పద్మనాభ మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోంగా ఉంది. అలలు 2 మీటర్ల ఎత్తు మేర ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తీరప్రాంతంలో 15 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. తాటిచెట్లపాలెం, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, ఎయిర్పోర్ట్ రహదారుల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. భీమిలి మండలం బోయవీధిలో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరింది. జిల్లాలో జాతీయ రహదారిపై 60 కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. భీమిలి, కాపులుప్పాడ వద్ద సముద్ర తీరంలో అలలు భారీగా ఎగసిపడుతూ ముందుకు దూసుకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా: జిల్లాలో పలు చోట్ల గత రాత్రి నుంచి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తోంది. తుని,తొండంగి మండలాల్లో ఈదురుగాలులు, భారీ వర్షం పడుతోంది. తొండంగి మండలంలోని తీరప్రాంతాలలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఆయా మండలాలోని తీరప్రాంత గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గొల్లప్రోలులో ఈదురుగాలలో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు విరిగిపోయియి. ఉప్పాడ తీరంపై సముద్రపు అలలు విరుచుకుపడుతున్నాయి. మాయాపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. అలాగే కోనాపాపపేటలో తీర ప్రాంతం కోతకు గురైంది. స్థానికంగా నివసిస్తున్న 20 మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమైనాయి.