Top Maoist couple
-
బతికే భాగ్యమున్నా.. నమ్మిన సిద్ధాంతం కోసం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/ మిరుదొడ్డి: రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చివరి మహిళా మావోయిస్టు రంగనబోయిన భాగ్య అలియాస్ రూపీ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆమె చనిపోయింది. అబూజ్మాడ్ అడవిలోని చోటేబెటియా–పర్తాపూర్ పోలీస్‌స్టేషన్ ఏరియా పరిధి మచ్పల్లి దగ్గర మావోయిస్టు కమాండర్ రూపీ నేతృత్వాన దళం సంచరిస్తోందనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో రూపీ మరణించినట్టు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. దీంతో మచ్పల్లి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.చివరి వరకు అక్కడే...ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, లొంగిపొమ్మని ఎందరు చెప్పినా నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడుతానని చెప్పిన రూపీ అలాగే కొనసాగింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో దండకారణ్యంలో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నలువైపులా ఒత్తిడి పెరగడం, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దళ సభ్యులకు లభించని గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రహస్య శిబిరం నుంచి కాలు బయటపెడితే ఎన్కౌంటర్ కావడం తథ్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగుబాట పట్టారు. ఈ క్రమంలోనే రూపీని సైతం లొంగిపోవాలని కోరుతూ కాంకేర్ ఎస్పీ రెండుసార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లొంగుబాటుకు మార్గం సుగమం చేస్తామని అక్కడి విలేకరులు సైతం ఆమెకు మూడుసార్లు లేఖలు పంపించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించినట్టు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. ఆఖరి వరకు ఉద్యమంలోనే ఉంటానంటూ మధ్యవర్తుల ద్వారా సమాధానం పంపినట్టు తెలిపారు. అన్నట్టుగానే చివరకు రూపీ ఎన్కౌంటర్లోనే ప్రాణాలు కోల్పోయారు. శారీరక దివ్యాంగురాలైన రూపీ పట్టుదలతో రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపింది. కగార్ నిర్బంధం మధ్య, కేంద్రం విధించిన గడువు దాటే వరకు భద్రతా దళాల కంట పడకుండా ఆమె రహస్య జీవితం గడపడం విశేషం.2002లో అజ్ఞాతంలోకి...సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన ఎల్లవ్వ–నర్సయ్య దంపతులకు పెద్ద కూతురైన భాగ్య 2002లో మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి నర్సయ్య చనిపోయినా, కడసారి చూపు కోసం భాగ్య రాలేదు. ఎన్కౌంటర్లో భాగ్య మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందటంతో ధర్మారం శోకసముద్రంలో మునిగిపోయింది. భాగ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు బయలుదేరి వెళ్లారు.శవమై వస్తున్నవా బిడ్డా....‘లొంగిపోయి ప్రాణాలతో వస్తావనుకున్న బిడ్డా.. చివరకు మాకు దు:ఖాన్ని మిగిల్చి శవమై వస్తున్నవా బిడ్డా..వృద్ధాప్యంలో నేనే చనిపోతే నువ్వు వస్తవో రావో అనుకున్నా బిడ్డా.. ఇప్పుడు నీ శవాన్ని చూసి ఎలా తట్టుకోవాలి బిడ్డా... మీ అయ్య సచ్చినా నువ్వు రాలేదు బిడ్డా’అంటూ... మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ తల్లి ఎల్లవ్వ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్కౌంటర్లో అక్క మృతి చెందిన విషయం తెలిసి భాగ్య చెల్లెళ్లు కవిత, మమత, తమ్ముడు కుమార్‌లు బోరున విలపించారు. -
తలపై కోటి రివార్డు.. టాప్ మావోయిస్టు ప్రశాంత్ బోస్ అరెస్టు
-
తలపై కోటి రివార్డు.. టాప్ మావోయిస్టు ప్రశాంత్ బోస్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు ప్రశాంత్ బోస్, ఆయన భార్య శీలా మరాండిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మావోయిస్టు సీనియర్ నాయకులలో ఒకరైన ప్రశాంత్ బోస్‌ను జార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మావోయిస్టు నాయకుల్లో నెంబర్2గా ఉన్నారు. గణపతి తరువాత మావోయిస్టుల్లో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రశాంత్ బోస్పై గతంలో కేంద్రం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. చదవండి: ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు కాగా మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా( ఎమ్‌సీసీఐ) చీఫ్‌గా ప్రశాంత్ బోస్ పనిచేశారు. ప్రశాంత్ బోస్ భార్య షీలా మరాండీ కూడా సీనియర్ మావోయిస్టు నాయకురాలు. ఇదిలా ఉండగా 75 ఏళ్ల ప్రశాంత్ బోస్ కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కిషన్ దా ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, ఈస్ట్రన్ రీజినల్ బ్యూరో సెక్రటరీగా కొనసాగుతున్నారు. చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! -
చిక్కిన మావోలు
సాక్షి, చెన్నై: తమిళనాడు, కేరళ, కర్ణాటక పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన మావోయిస్టుల్లో కొందరు క్యూబ్రాంచ్ చేతికి చిక్కారు. ముం దస్తు సమాచారంతో పథకం ప్రకా రం ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఆపరేషన్ విజయవంతంతో ఆ మావోయిస్టుల వద్ద తీవ్రంగా విచారిస్తున్నారు. వీరి అరెస్టుతో పలు దాడుల కుట్రలు భగ్నం అయ్యాయి. తిరుపతిలో దాడులకు వీరు వ్యూహ రచన చేసినట్టు సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృం దం కోవైలో విచారణ జరుపుతున్న ట్టు తెలిసింది. 2008లో ఏప్రిల్ 19న కొడెకైనాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో మావోయిస్టులు పత్తా లేకుండా పోయారు. ఆ ఎన్కౌంట ర్లో మావోయిస్టు నేత నవీన్‌ప్రసాద్ హతమయ్యాడు. ఈ ఘటనతో రాష్ర్టంలో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. ఇక రాష్ట్రంలో మావోయిస్టులు తోకముడిచినట్టేనన్న విషయాన్ని పోలీసు యంత్రాంగం సైతం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏడాది కాలంగా పశ్చిమ పర్వత శ్రేణుల్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్టు, ఆయుధాలను చేతబట్టి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చాయి. సమాచారం వచ్చినప్పుడల్లా క్యూ బ్రాంచ్ వర్గాలు కూంబింగ్ చేయడం పరిపాటిగా మారింది. రెండు నెలల క్రితం కేరళ - తమిళనాడు సరిహద్దుల్లోని కోయంబత్తూరుకు కూత వేట దూరంలో జరిగిన దాడి రెండు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కేరళ అటవీ శాఖ కార్యాలయంపై దాడులు జరిగినప్పటి నుంచి మావోయిస్టులు తమ ప్రతాపం చూపించే విధంగా, తమ ఉనికిని చాటు విధంగా ఏదో ఒక చర్యకు పాల్పడుతూ వచ్చారు. ఇది కాస్త తమిళనాడు, కేరళ, కర్ణాటక పోలీసులకు సవాల్‌గా మారింది. వీరిని అదుపులోకి తీసుకోవడం లక్ష్యంగా ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు తీసుకున్నారు. చిక్కిన మావోయిస్టులు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ మేరకు వచ్చిన సమాచారంతో కోయంబత్తూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో తమిళనాడు క్యూ బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ పోలీసు బృందం పథకం ప్రకారం ఆ మావోయిస్టులను అరెస్టు చేసింది. కరుమాత్తం పట్టి వద్ద ఓ బేకరీలో టీ తాగేందుకు వచ్చిన ఐదుగుర్ని పోలీసులు తుపాకులతో చుట్టుముట్టారు. సినీ ఫక్కీలో సాగిన ఈ అరెస్టుతో ఆ ఐదుగుర్ని కోయంబత్తూరులోని క్యూబ్రాంచ్ కార్యాలయంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. విచారణలో పట్టుబడ్డ మావోయిస్టులు రూపేష్, సైనా, అనూఫ్, కణ్ణన్, ఈశ్వరన్లుగా గుర్తించారు. వీరిలో రూపేష్ మావోయిస్టు బృందానికి నాయకుడని తేలింది. భర్త అడుగు జాడల్లో సైనా రూపేష్ నడిచినట్టు గుర్తించారు. పలు చోట్ల దాడులకు వీరు వ్యూహ ర చన చేసినట్టుగా విచారణలో వెలుగు చూసి ఉన్నది. అలాగే, 20 మందికి వీరు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉన్న సమాచారంతో వారెక్కడ ఉన్నారో పసిగట్టి, అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పరుగులు తీస్తున్నారు. అలాగే 20 మంది తమిళుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తిరుపతిలో దాడులకు వ్యూహ రచన చేసి ఉన్నట్టుగా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుందరి అనే మావోయిస్టు వీరితో తరచూ సంప్రదింపుల్లో ఉన్నట్టు తేలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ఎస్పీ నేతృత్వంలోని బృందం వారి వద్ద విచారణ సాగిస్తున్నది. ఇక కోయంబత్తూరు రేంజ్ డీఐజీ ఆయుష్మణి తివారి, ఎస్పీ సుధాకర్ నేతృత్వంలోని తమిళ పోలీసుల బృందం తీవ్రంగా విచారణ సాగిస్తున్నది. డైరీలో ఏముంది: అరెస్టు చేసే క్రమంలో మావోయిస్టులు తమ చేతిలో ఉన్న ఓ డైరీని పొదల్లోకి విసిరినట్టు సమాచారం. దీనిని బేకరీ కృష్ణన్ గుర్తించి పోలీసులకు అందించాడు. అందులో యాబై ఫోన్ నంబర్లు ఉండడంతో వాళ్లు ఎవరు అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే పోలీసులపై తిరగబడే యత్నం చేసినట్టు ఆ పరిసర వాసులు పేర్కొన్నారు. పట్టుబడ్డ రూపేష్ ఒకప్పుడు న్యాయవాది. హైకోర్టులో క్లర్క్‌గా ఉన్న సైనాను ప్రేమించి పెళ్లి చేసుకుని, వామపక్ష భావాలతో మావోయిస్టుగా మారాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో మావోయిస్టుల నెట్ వర్క్‌ను విస్తరించడం లక్ష్యంగా పశ్చిమ పర్వత శ్రేణుల్ని అడ్డాగా చేసుకుని తలదాచుకుని ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. పట్టుబడ్డ వారిలో రూపేస్, సైనా, అనూఫ్ కేరళ రాష్ట్రం తిరుచ్చూర్‌కు చెందిన వారు. ఇక, కణ్ణన్, ఈశ్వరన్ తమిళనాడు వాసులు. వీరి అరెస్టుతో అజ్ఞాతంలో ఉన్న వీరి మద్దతు దారులు ఏదేని దాడులకు వ్యూహ రచన చేయొచ్చన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత పెంచారు. అలాగే, సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వీరి మద్దతు దారులు ఇతర ప్రాంతాల్లోకి తరలి వెళ్లకుండా నిఘాతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది.


