సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/ మిరుదొడ్డి: రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చివరి మహిళా మావోయిస్టు రంగనబోయిన భాగ్య అలియాస్ రూపీ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆమె చనిపోయింది. అబూజ్‌మాడ్ అడవిలోని చోటేబెటియా–పర్తాపూర్ పోలీస్‌స్టేషన్ ఏరియా పరిధి మచ్‌పల్లి దగ్గర మావోయిస్టు కమాండర్ రూపీ నేతృత్వాన దళం సంచరిస్తోందనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో రూపీ మరణించినట్టు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. దీంతో మచ్‌పల్లి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చివరి వరకు అక్కడే...
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, లొంగిపొమ్మని ఎందరు చెప్పినా నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడుతానని చెప్పిన రూపీ అలాగే కొనసాగింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో దండకారణ్యంలో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నలువైపులా ఒత్తిడి పెరగడం, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దళ సభ్యులకు లభించని గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రహస్య శిబిరం నుంచి కాలు బయటపెడితే ఎన్‌కౌంటర్ కావడం తథ్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగుబాట పట్టారు.
ఈ క్రమంలోనే రూపీని సైతం లొంగిపోవాలని కోరుతూ కాంకేర్ ఎస్పీ రెండుసార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లొంగుబాటుకు మార్గం సుగమం చేస్తామని అక్కడి విలేకరులు సైతం ఆమెకు మూడుసార్లు లేఖలు పంపించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించినట్టు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. ఆఖరి వరకు ఉద్యమంలోనే ఉంటానంటూ మధ్యవర్తుల ద్వారా సమాధానం పంపినట్టు తెలిపారు. అన్నట్టుగానే చివరకు రూపీ ఎన్‌కౌంటర్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. శారీరక దివ్యాంగురాలైన రూపీ పట్టుదలతో రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపింది. కగార్ నిర్బంధం మధ్య, కేంద్రం విధించిన గడువు దాటే వరకు భద్రతా దళాల కంట పడకుండా ఆమె రహస్య జీవితం గడపడం విశేషం.
2002లో అజ్ఞాతంలోకి...
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన ఎల్లవ్వ–నర్సయ్య దంపతులకు పెద్ద కూతురైన భాగ్య 2002లో మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి నర్సయ్య చనిపోయినా, కడసారి చూపు కోసం భాగ్య రాలేదు. ఎన్‌కౌంటర్‌లో భాగ్య మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందటంతో ధర్మారం శోకసముద్రంలో మునిగిపోయింది. భాగ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు బయలుదేరి వెళ్లారు.
శవమై వస్తున్నవా బిడ్డా....
‘లొంగిపోయి ప్రాణాలతో వస్తావనుకున్న బిడ్డా.. చివరకు మాకు దు:ఖాన్ని మిగిల్చి శవమై వస్తున్నవా బిడ్డా..వృద్ధాప్యంలో నేనే చనిపోతే నువ్వు వస్తవో రావో అనుకున్నా బిడ్డా.. ఇప్పుడు నీ శవాన్ని చూసి ఎలా తట్టుకోవాలి బిడ్డా... మీ అయ్య సచ్చినా నువ్వు రాలేదు బిడ్డా’అంటూ... మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ తల్లి ఎల్లవ్వ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్‌కౌంటర్‌లో అక్క మృతి చెందిన విషయం తెలిసి భాగ్య చెల్లెళ్లు కవిత, మమత, తమ్ముడు కుమార్‌లు బోరున విలపించారు.


