breaking news
Thotapally project
-
తోటపల్లిపై బహిరంగ చర్చకు సిద్ధమా...?
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలో నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నయని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజ్జి.శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని రూ.కోట్ల నిధులు కేటాయించారో..? ఎంత మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయో ...? ప్రజలకు తెలియజెప్పేందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఈ చర్చలో పార్టీ జిల్లా పెద్దలతో తాము వస్తామని, అధికారులను వెంటబెట్టుకుని అధికార పార్టీ నాయకులు రావాలని సూచించారు. ఆదివారం స్థానిక సత్యకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, నిధుల వ్యయం, నీటి సరఫరా వంటి వివరాలతో అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఈ సందర్భంగా విడుదల చేశారు. నిధుల కేటాయింపులు పరిశీలిద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, ఉన్న కొద్దిపాటి 10 శాతం పనులు పూర్తి చేయకుండానే ప్రారంభించిన టీడీపీ నాయకులు ఆ ఘనత తమదే అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలా అయితే 2004 నుంచి 2014 సంవత్సరంల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులు, 2014 అనంతరం కేటాయించిన నిధుల లెక్కల వివరాలు పరిశీలిస్తే ఎవరి హయంలో పనులు జరిగాయో తేలిపోతుందన్నారు. పార్టీ నాయకుడు పిళ్లా విజయ్‌కుమార్ మాట్లాడుతూ విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అవినీతి, అక్రమార్జన, ప్రభుత్వ ఆస్తుల అడ్డుగోలు కేటాయింపులపై తూర్పారబట్టారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తెట్టంగి పీఏసీఎస్ అధ్యక్షుడు కె.రవిబాబు, పార్టీ వాణిజ్య విభా గం నాయకులు ఉప్పు ప్రకాష్, డోలా మన్మథకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'సీఎం అలా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు'
శ్రీకాకుళం : తోటపల్లి ప్రాజెక్టు ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దేనని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తోటపల్లి ప్రాజెక్టును తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టుకు మహానేత వైఎస్ఆర్ రూ.450 కోట్లు విడుదల చేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రూ.50 కోట్లు విడుదల చేశారని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు అంశంపై టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబు చర్చకు రావాలంటూ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. -
‘తోటపల్లి’ రద్దు కోరుతూ రైతుల ఆందోళన
చిగురుమామిడి(కరీంనగర్): తోటపల్లి ప్రాజెక్టు జలాశయం నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన 100 మంది రైతులు ఆందోళనకు దిగారు. కోహెడ- ముల్కనూర్ రహదారిపై బుధవారం సాయంత్రం 2 గంటలకు రాస్తారోకోకు పూనుకున్నారు. ప్రాజెక్టు కారణంగా తమ 500 ఎకరాల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని, అవి మునిగితే తామెలా బతకాలని ప్రశ్నించారు. ప్రాజెక్టును రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరైందేనని వారు స్పష్టం చేశారు. రైతులు గంట అనంతరం ఆందోళనను విరమించారు.