మూడో ఆపరేషన్‌కి రెడీ అవుతున్న ఏంజెలినా!
హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలి తన ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయరు. భవిష్యత్తులో కేన్సర్ సోకుతుందేమోననే భయంతో మూడు ఆపరేషన్లు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. విచిత్రంగా ఉంది కదూ. అయితే, ఏంజెలినా ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి కదా. అలా ఏంజెలినా జోలి కుటుంబంలోని మహిళలు చాలామంది ‘కేన్సర్’ బారిన పడ్డారు. ఆమె అమ్మమ్మ, అత్తయ్య, అమ్మ ఈ రోగానికి బలైనవారే. తనకూ ఆ ప్రమాదం ఉంటుందేమోనని భావించిన ఏంజెలినా ముందుగానే పరీక్షలు చేయించుకున్నారు. ఆమె అనుకున్నదే జరిగింది. 87 శాతం బ్రెస్ట్ కేన్సర్‌తో పాటు 50 శాతం ఒవేరియన్ కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారట.
చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవడం మంచిదని భావించిన ఏంజెలినా, ‘మాసెక్టమీ’ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ‘బ్రెస్ట్ ఇంప్లాంట్స్’ ఆపరేషన్ చేయించుకున్నారు. దానివల్ల ఆమె బ్రెస్ట్స్ పూర్వ ఆకారాన్ని సంతరించుకున్నాయి. ఈ రెండు శస్త్రచికిత్సలు విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు మూడో ఆపరేషన్‌కి రెడీ అవుతున్నారు ఏంజెలినా. ఒవేరియన్ కేన్సర్ బారిన పడే అవకాశం ఉన్నందున ఓవరీస్ తొలగించుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ శస్త్ర చికిత్సల వల్ల తనేం క్రుంగిపోవడంలేదని ఆమె అన్నారు. మహిళలందరూ ముందుగానే పరీక్షలు చేయించుకుంటే, ప్రమాదం జరిగే ముందే బయటపడొచ్చని కూడా సూచించారు ఏంజెలినా.