breaking news
thalasemia
-
ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ..
సాక్షి, శ్రీకాకుళం : ఒకవైపు మొరపెట్టుకుంటున్న కష్టాలు... మరోవైపు సమస్యలపై విన్నపాలు.. ఇంకోవైపు ఫిర్యాదులు, పథకాల మంజూరు కోసం అర్జీలు... కబ్జాలు, అక్రమాల తతంగాలు... ఇలా అనేకం అధికారుల దృష్టికి వచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం పరిష్కార వేదికగా నమ్మకం కల్గించడంతో పెద్ద సంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. చెప్పాలంటే కలెక్టరేట్ ప్రాంగణంలో బారులు తీరారు. వేల సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. వీరందరి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఒక్కరోజే కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో 1125 అర్జీలు వచ్చాయి. అందులో 50 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతావి సంబంధిత శాఖల పరిశీలనలో ఉన్నా యి. అత్యధికంగా భూ పరిపాలన శాఖకు సంబంధించి 265, సెర్ఫ్‌కు సంబంధించి 185, పౌరసరఫరాలకు సంబంధించి 157, గిరిజన సంక్షేమానికి సంబంధించి 125, హౌసింగ్‌కు సంబంధించి 112, మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి 81 అర్జీలు వచ్చాయి. చిన్నబోయిన వరుణుడు సమస్యల ముందు వర్షపు జల్లులు చిన్నబోయాయి. తెల్లవారు జామున నుంచి చినుకులు పడుతున్నా జనం లెక్కచేయలేదు. స్పందన వేదిక వద్దకు వెళితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో వర్షాన్ని సైతం పట్టించుకోకుండా కలెక్టరేట్‌కు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. పడుతున్న చినుకుల మ«ధ్యనే బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండి తమ వినతులు అధికారులకు అందజేశారు. పరిష్కారమైతే తమ కష్టం ఏమాత్రమని ఓపిగ్గా ఉంటూ అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. గతం ఎలా ఉన్నా ప్రస్తుతం చకచకా సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న నమ్మకంతో కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడుతోంది. సోమవారం వర్షం పడుతున్నా అర్జీదారుల తాకిడి తగ్గలేదు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్ వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు కొత్త రేషన్‌కార్డుల మంజూరు కోసం, స్వయం ఉపాధి పనుల కోసం, భూమి వివాదాల పరిష్కారం కోసం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, ట్రైసైకిళ్ల కోసం, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాలు, వసతి గృహాల సీట్ల తదితర వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, వికలాంగ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, సీపీఓ, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా వినతులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కా రం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. హుద్‌హుద్ తుపా ను బాధితులకు మంజూరు చేసిన 32 ఇళ్లను తమకు అప్పగించాలని కోరుతూ ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేసం గ్రామానికి చెందిన మ త్స్యకారులు ఫిర్యాదు చేశారు. తాను కొనుగోలు చేసిన 30 సెంట్లు భూమిని ఆక్రమించుకుంటున్నారని, వారి నుంచి తమకు న్యాయం చేయాలని ఉర్లాంకు చెందిన ఒకాయన ఫిర్యాదు చేశాడు. నీలంపేట, మామిడివలస, లంకాం, ఖండ్యాం, లాభాం వద్ద ఓపెన్ హెడ్ ఛా నల్స్, నారాయణపురం ఎడమ కాలువకు పూడికతీత, మరమ్మత్తులు చేపట్టాలని భూర్జ, ఆమదాలవలస రైతులు కోరారు. సరుబుజ్జిలి, హిరమండలాలకు వంశధార నదిలో ఇసుక ర్యాంపులు ప్రభుత్వం కల్పించిందని, ఆ ర్యాంపుల నుండి ఎల్‌ఎన్‌పేట మండలానికి ఇసుకు తీసుకురావడానికి అనుమతులు ఇవ్వాలని ఆ మండలాలకు చెందిన పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్–2 రజనీకాంతరావు, డీఆర్ఓ నరేంద్రప్రసాద్, డీఆర్డీఎ పీడీ కళ్యాణ్‌చక్రవర్తి, డ్వామా పీడీ కూర్మారావు, జిల్లా పరిషత్ సీఈఓ టి.కైలాస గిరీశ్వర్ తదితర శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. పరిష్కారంలో ఐదో స్థానం జూలై 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 6202 అర్జీలొచ్చాయి. వీటిలో 1521 పరిష్కరించారు. 2461 వినతులు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 1553 వినతులు పరిశీలనలో ఉన్నాయి. 667 అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ విధంగా 28వ తేదీనాటికి అర్జీల పరిష్కారంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం వచ్చిన అర్జీలతో కలిపి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరిష్కారంలో మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. రక్తం తగేస్తోంది. ఆదుకోండి గిరిజన ప్రాంతంలో పుట్టడం... నిరుపేద కుటుంబానికి చెందడం... మలగాం చంద్రరావు చేసిన పాపం. తలసేమియా వ్యాధి అతని రక్తాన్ని తాగేస్తోంది. తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న ఈ నిర్భాగ్యుడు సోమవారం ‘స్పందన’లో కలెక్టర్‌కు తన గోడు విన్నవించుకున్నాడు. చంద్రరావుది భామిని మండలం బాలేరు గ్రామం. ఎంబీఏ 2017లో పూర్తిచేసి బతుకుతెరువు కోసం హైదరాబాద్‌లో ఓ చిరుద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి రక్తహీనత మొదలైంది. ఆరంభంలో ఆ విషయం తెలియక అలాగే ఓ మూడు నెలలు కాలం గడిపేశాడు. స్నేహితులు ఆయనకు రక్తహీనత ఉన్నట్లు గమనించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో రక్తం 2.9 పాయింట్లు ఉన్నట్లు కనుగొని, తలసేమియా వ్యాధిగా ధ్రువీకరించారు. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్, విజయనగరం, చెన్నై గుడ్లవేలూరుతోపాటు పలుచోట్ల వైద్యం కోసం చాలామంది డాక్టర్ల వద్దకు తిరిగాడు. ఆయన తల్లిదండ్రులు వలసజీవులు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్ధితి. బతుకుపోరాటంలో భాగంగా హైదరాబాద్, చెన్నై వెళ్లిపోయి భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు ఓ అక్క, చెల్లి ఉన్నారు. రూ.40 లక్షలు ఉంటే శాశ్వత పరిష్కారం పూర్తిగా ఈ జబ్బు నయం కావాలంటే రూ.40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని బాధితుడు చెప్పాడు. పేదరికంలో పుట్టి తిండికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తనకు రూ.40 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నానని, వైద్యం చేయించమని, చిన్న ఉద్యోగం లేదా పెన్షన్ ఇప్పించాలని స్పందనకు వచ్చి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కలెక్టర్ చెప్పారని బాధితుడు సాక్షికి తెలిపాడు. -
సమాజ సేవకుడికి గవర్నర్ ప్రశంస
జ్యోతినగర్(రామగుండం): సమాజసేవలో తనవంతు పాత్ర పోషించడంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నేనున్నాంటూ రక్తదానం చేయడంతోపాటు శిబిరాలు ఏర్పాటు చేసిన సమాజసేవకుడు బుద్ధినేని సత్యనారాయణరావుకు గవర్నర్ నరసింహన్ ఉత్తమ రక్తదాత అవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేశారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సోసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ రక్తదాతగా జూలపల్లి మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన బుద్ధినేని సత్యనారాయణరావును సత్కరించారు. ఈయన ఎన్పీడీసీఎల్లో విద్యుత్ సహాయ గణాంక అధికారిగా గోదావరిఖని, పెద్దపల్లి కార్యాలయాల్లో సేవలందించారు. ప్రస్తుతం మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్నారు. 45 సార్లు రక్తదానం చేయడంతోపాటు 29 రక్తదాన శిబిరాలు నిర్వహించి 3,425 యూనిట్ల రక్తాన్ని మంచిర్యాల ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ వారికి అందించి తలసేమియా బాధితులకు ప్రాణదాతగా నిలిచారు. ఈసందర్భంగా అవార్డు అందుకున్న సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తమ రక్తదాతగా అవార్డు రావడం సంతోషంతో పాటు ఎంతో బాధ్యతను పెంచిందన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ట్రస్టును నెలకొల్పి సమాజ సేవలో తరిస్తానని చెప్పారు. -
29 నుంచి ‘థలసేమియా’ సేవలు ప్రారంభం
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఈనెల 29వ తేదీ నుంచి థలసేమియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసవానంతం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందరికీ అందిస్తామని తెలిపారు. ఎవరూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వాహన సేవలు అందుబాటులోకి తెచ్చిందని, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావు, వైద్యులు శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.