breaking news
Tetali ramareddy
-
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి సహా పలువురు నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు జననేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తేతలి రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే రామారెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్.. బిక్కవోలు మీదుగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ వరకు నేటి పాదయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం గొల్లల మామిడాడలో సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. -
మాజీ ఎమ్మెల్యే రామారెడ్డికి పుత్రవియోగం
అనపర్తి :అనపర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తేతలి రామారెడ్డి పెద్ద కుమారుడు రామిరెడ్డి అలియాస్ రాంబాబు (54) బుధవారం తెల్లవారు జామున రైలు నుంచి జారిపడి మరణించారు. అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న రైలునుంచి పడిపోయిన రాంబాబు తీవ్రగాయాలకు లోనై సంఘటన స్థలంలోనే మృతి చెందారని సామర్లకోట రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై ఎ. వెంకటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రాంబాబు వ్యక్తిగత పనుల నిమిత్తం అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి నుంచి శ్రీకాకుళం బయలుదేరారని తెలిపారు. అనపర్తి సమీపంలో రాంబాబు రైలు నుంచి జారిపడ్డారన్నారు. అనపర్తి రైల్వే సిబ్బంది అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అలముకున్న విషాదం.. పలువురి సానుభూతి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి తనయుడు రాంబాబు రైలు నుంచి జారిపడి మృతి చెందిన వార్త తెలియడంతో అనపర్తి, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. మంచికి మారుపేరుగా, అందరికీ ఆప్తునిగా మసలిన రాంబాబు ఇక లేరన్న విషయాన్ని పలువురు పార్టీ కార్యకర్తలు, తేతలి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు రాజకీయనాయకులు అనపర్తిలోని మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి నివాసానికి చేరుకున్నారు. తేతలికి వారు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ీసీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, అనపర్తి నియోజక వర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష మాజీ నేత సత్తి రామారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, రాష్ట్ర రైతు నాయకుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, రామచంద్రపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొవ్వూరి తాతారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు కర్రి రామారెడ్డి (రామన్నతాత), వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, రామవరం ఉపసర్పంచ్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కొప్పవరం, పొలమూరు గ్రామాల మాజీ సర్పంచ్‌లు తాడి వెంకట రామకృష్ణారెడ్డి, సత్తి వీర్రాఘవరెడ్డి, మేడపాటి గంగిరెడ్డి తదితరులు తేతలికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.