దళిత బావుటా ‘పైడిశ్రీ’
ఒంగోలు కల్చరల్ : ‘పైడిశ్రీ’ కలం పేరుగా చేసుకున్న తెరేష్బాబు సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందగా.. అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. ఈయన స్వస్థలం ఒంగోలులోని గద్దలగుంట. సుబ్బమ్మ, శేషయ్య తల్లిదండ్రులు. తండ్రివారసత్వంగా చిన్న తనం నుంచే పాటలు, పద్యాలపై అభిరుచి పెంచుకున్నారు.
శర్మ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వెలువరించే భావలహరి, అభిరుచివంటి కార్యక్రమాల్లో తన శైలి చూపించారు. పాటలు, గజల్స్ , కవితలు నాటక రచయితగానే కాకుండా గాయకునిగా.. తబలా, ఫ్లూటు ప్లేయర్గా రాణించారు. తాను ఆర్జించిన డబ్బుతో చదువు కొనసాగించారు. మరుదూరు రాజా రచించిన ‘గొంతు తెగినకోయిల’ నాటకంలో ఒక పాటకు తెరేష్బాబు ట్యూన్ కట్టారు. ఆయన రచించిన పలు నాటకాలు, నాటికలకు బహుమతులు లభించాయి. అమృతవాణి క్రిస్టియన్ రేడియో కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కొత్తగూడెం రేడియో కేంద్రంలో విధులు నిర్వర్తించారు. ఆ తరువాత ఆకాశవాణి ప్రోగ్రాం కో ఆర్డినే టర్గా పని చేశారు.
‘శరసంధానం’ కవితా సంపుటితోపాటు ‘నాలుగో ప్రపంచం, హిందూ మహాసముద్రం, అల్పపీడనం, నేనూ’ వంటి రచనలు ఆయనలోని కవిగాఢతను బహిర్గతం చేశాయి. పైడిశ్రీకి ఒంగోలులో కరవది సాయి, జవంగుల అర్జున్, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, చందలూరి శివరామకృష్ణవంటి సహాధ్యాయ స్నేహితులున్నారు. నీలం నాగేంద్రరావు, జి. కల్యాణరావు, డాక్టర్ నూకతోటి రవికుమార్వంటి వారితో అనుబంధం ఉంది. పేదరికంలో పుట్టి సాహిత్యప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న పైడి తెరేష్బాబుకు సన్నిహితులు అక్షర నివాళులర్పించారు.